Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా థర్డ్‌వేవ్‌లో పిల్లలకు ముప్పువాటిల్లే అవకాశం వుందని శాస్త్రవేత్తలు, వైద్యులు హెచ్చరిస్తున్నారు. సెకండ్‌వేవ్ ఉధృతమైన దాడిన మనమంతా చూసి ఉన్నాం. ఎంతో మంది మిత్రులు, బంధువులు, తెలిసినవారు కరోనా ధాటికి బలైపోయారు. ఇప్పుడు కన్ను పిల్లలపై పడింది. పెద్దవాళ్ళు ఐసొలేషన్‌లో ఉండటమే కష్టం. అటువంటిది పిల్లల్ని ఉంచడం ఎంత కష్టమో ఆలోచించండి. జాగ్రత్తలు పాటించకపోతే తీవ్రనష్టాన్ని, గర్భశోకాన్ని కలిగిస్తుందని మేధావులు చెబుతున్నప్పటికీ సరైన చర్యలు ఎవరూ తీసుకోవడం లేదు. ప్రజలు కూడా ఎప్పుడెప్పుడు లాక్డౌన్ తీసేస్తారా అనే ఆలోచనలోనే ఉన్నారు. పిల్లలను దుకాణాలకు, కూరగాయలకు, సరుకుల కొరకు పంపించవద్దు. పెద్దవాళ్ళే ఈ పనులు చేసుకొని పిల్లలను కరోనా బారి నుంచి రక్షించాలి. ఆరు బయట ప్రాంతాలలో క్రికెట్, కబడ్డీ వంటి పదిమందితో కలసి ఆడే ఆటలకు వెళ్ళనివ్వద్దు. ముఖ్యంగా 13 సంవత్సరాల వయసులోపు పిల్లలకు ఎక్కువగా సోకే అవకాశముందట. మా ఆసుపత్రిలో ఏడాది, రెండేళ్ళ లోపల పిల్లలే ఎక్కువగా కరోనా పాజిటివ్ వాళ్ళు వస్తున్నారు. పిల్లల్ని బయటకు పంపవద్దు. కరోనాకు బలి ఇవ్వవద్దు.
ఆసుపత్రి ప్లాస్టిక్ వ్యర్థాలతో...
ఆసుపత్రులలో ఉండే ప్లాస్టిక్ వ్యర్థాలనుపయోగంచి ఈరోజు రామచిలకను తయారు చేశాను. మనం చిన్నప్పటి నుండే ''చిట్టి చిలకమ్మా! అమ్మ కొట్టిందా!'' అంటూ చిలకమ్మ పాటలు చిలక పలుకుల్లా వల్లించే వాళ్ళం. చిలకలను పంజరాల్లో పెట్టి పెంపుడు జంతువుగా పెంచుకుంటుంటారు. చిలకలకూ మానవులకూ ఎన్నో సంబంధాలున్నాయి. చిలకల్లో దాదాపు 350 జాతులు ఉన్నాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా జీవిస్తున్నప్పటికీ దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా ఖండాలలో విరివిగా కనిపిస్తాయి. నేను ''టాక్సిమ్, బయోటాక్స్, మోంటాజ్, మోనోసెఫ్'' వంటి ఇంజక్షన్ల సీసాలపై వచ్చే ప్లాస్టిక్ మూతలతో చిలకను చేశాను. పచ్చని దేహంతో, ఎర్రని ముక్కుతో ఎంత ముంద్దుగా ఉందో చూడండి. ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణానికి నాశనకారులు కాబట్టి వాటిని పారేయకుండా రీయూజ్ చేస్తున్నాను. రంగురంగుల ప్లాస్టిక్ మంచినీళ్ళ సీసాల మూతల్ని మీరు ఉపయోగించవచ్చు. నేను ఆసుపత్రి వ్యర్థాలతో చేసిన చిలక ''హలో నన్ను చూశారా'' అని ముద్దు పలుకలు పలుకుతోంది మీతో.
రంగుల వడియాలతో...
బియ్యం పిండి, సగ్గుబియ్యంలలో టమోటాలు, సొరకాయలు వంటి కూరగాయల్ని కలిపి ఎన్నో రకాల వడియాలను తయారుచేస్తున్నారు. వాటికి మళ్ళీ ఎన్నో రంగులు, ఎన్నో ఆకారాలు, రింగులు, బెండకాయలు, బ్యాట్లు, గొట్టాలు, పువ్వులు, చక్రాలు అంటూ ఎన్నో పేర్లతో నోరూరిస్తున్నాయి. నేను వీటితో కూడా బొమ్మల్ని రూపొందిస్తున్నాను. ఈరోజు ఈ వడియాలతో ఒక అందమైన చిలుకను తయారుచేశాను. ఇళ్ళలో జామచెట్లుంటే తప్పని సరిగా చిలకలు వాలాల్సిందే. చిలకలు కొట్టిన జామపండుకు రుచి ఎక్కువ. చిలక ముక్కు వంకర తిరిగి బలంగా ఉంటుంది. అందుకే పండ్లను కొరికి తినగలుగుతున్నది. చిలకల్లో అధికశాతం ఆకుపచ్చని శరీరం కలిగినవే. అవి ఆకుల్లో కలిసిపోతూ ఎక్కువగా ఉంటాయి. కొన్ని పంచరంగుల చిలకలు కూడా ఉంటాయి. ముఖ్యంగా వీటిలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి నిజమైన చిలుకలు అనీ, రెండు 'కాకటూస్' అనీ పిలుస్తారు. ఇవి ఎక్కువగా గింజలు, పండ్లు, మొగ్గలు, చిన్న మొక్కల్ని కొరుక్కుని తింటాయి. ఇవి మూడు అంగుళాల నుండి మీటరు పొడవు దాకా ఉంటాయి. కొన్ని చిలకలు పురుగుల్ని, చిన్న క్రిముల్ని తింటుంటాయి. చిలకలు ఎక్కువగా చెట్టు తొర్రలలోనే గూళ్ళు కట్టుకుంటాయి. వీటి శరీరానికున్న పచ్చదనం మూలంగా చిలకపచ్చ అంటూ రంగుకే ఒక పేరు ఏర్పడింది. నేను వడియాలతో చిలకను ఎలా చేశానో చూడండి.
పల్లీ కాయలతో...
ఇప్పుడు పల్లీలు కాసే కాలం. నేనూ మా కుండీలో కొన్ని విత్తుల్ని పెడితే మొలకలు వచ్చాయి. దాని ఆకులు ఎలా ఉంటాయో చూడటం కోసం పెట్టాను. పచ్చి పల్లీ కాయల్ని ఉండకబెట్టుకొని తినడం మాకిష్టం. అలా తెచ్చుకున్న పల్లీకాయలకు రెక్కలు మొలిచినాయి. చిలకగా మారి పోయినాయి. కాకపోతే ఈ చిలక రంగుల్లో లేదు. బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో హీరోయిన్లా ఉంది. చెట్టుకొమ్మమీద వాలి పండును కొరకడానికి సిద్దంగా ఉన్నట్టుగా చిత్రించాను. దీనిలో పల్లీలు మాత్రమే కాకుండా, వాటి తొక్కలు సైతం వాడాను. ఎలా ఉంది చెప్పండి. విభిన్న వస్తువులతో చిలకను తయారు చేయాలని నా కోరిక. న్యూజిలాండ్ దేశానికి చెందిన 'కకాపో' అనే జాతి చిలకలు ప్రస్తుతం అంతరించిపోయే దశలో ఉన్నాయి. లోరీలు, లోరికీట్లు అనే చిలుకలు మొదట న్యూగినాయాలో ఉండేవి. అవి క్రమంగా దక్షిణ పసిఫిక్ మహాసముద్ర దీవులకు వ్యాపించాయి. అమెజాన్ చిలకలు, మకావ్‌లు, రోసెల్లాలు, పెస్కెట్లు, కొకాటూలు వంటి ఎన్నో రకాల చిలుకలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి.
వస్త్రపు ముక్కలతో...
పట్టుచీర జాకెట్లలోని మిగిలిన ముక్కలు దాచిపెట్టి ఏదైనా బొమ్మలు చేయడం నా అలవాటు. అలా ఈరోజు ఒక అందాల రామచిలుకను చేశాను. కాకపోతే ఈ రామచిలుక ఆకుపచ్చని రెక్కలతో గులాబీ రంగు దేహంతో మెరిసిపోతున్నది. బహుశ ఏదో జాతరలో గులాం కొట్టుకొని ఉంటుంది. అందుకే చిలకపచ్చ రంగు నుండి గులాబీ రంగుకు మారింది. ఒకవేళ గులాబీ మొగ్గల్ని బాగా తినేయడం వల్ల దీనికీ రంగు వచ్చిందేమో. మరి చిలకలు మొగ్గల్ని కూడా తింటాయని ఇందాక చెప్పుకున్నాం కదా! పట్టు జాకెట్ల మీద చిలకల్ని కుట్టుకొని ధరించాలి గానీ జాకెట్లో మిగిలిన ముక్కలతో చిలకను చేయడమేమిటని మా అమ్మ ప్రశ్నించింది. వ్యర్థం అనేది ఏదీ ఉండకూడదని నా సమాధానం. చిలక ఆకారంలో వస్త్రాన్ని కత్తిరించి కాగితంపై అతికించాను. వాటిపై అక్కడక్కడ చమ్కీలు అతికించాను. మరి మనమేనా ఎంబ్రాయిడరీ జాకెట్లు వేసుకునేది. మా చిలక వేసుకోవద్దా!
సొరకాయ-కాప్సికంతో...
కాప్సికంలలో ఆకుపచ్చ, ఎరుపు, పసుపుపచ్చ రంగులుంటాయి. ఎర్రటి కాప్సికంలు తెచ్చినపుడు వెంటనే వాడక పండి మెత్తబడ్డాయి. దాన్ని చూస్తే ఎర్రని చిలక ముక్కులా అనిపించి పక్కన పెట్టాను. ఇంట్లో సొరకాయను తెచ్చి చిన్న ముక్క కత్తిరించి చిలక శరీరంలా పెట్టాను. కారెట్, బీట్రూట్ ముక్కల్ని గుండ్రంగా కత్తిరించి కనుక్నలా గుచ్చాను. పీలికలుగా కత్తిరించి సొరకాయను రెక్కలుగా, తోకగా పెట్టాను. దానికి కాళ్ళు కూడా పెట్టానండోరు. చిలకలకు కాళ్ళు కూడా వంకర తిరిగి బలిష్టంగా ఉంటాయి. దాంతో చెట్టుకొమ్మను బలంగా పట్టుకుంటుంది. అన్ని పక్షులలాగానే చిలకలక్కూడా జీవించడానికి అనుకూలతలు లేక అంతరించిపోతున్నాయి. పక్షిశాస్త్రవేత్త డా||సలీం అలీ చిలకలను వేటాడటం, పెంపుడు జంతువులుగా వాడటం మూలంగా అంతరించిపోతున్నాయని చెప్పారు. రంగన్నతిట్టు పక్షిధామంలో పక్షులన్నీ ప్రకృతిలోనే ఉంటాయి. ఏవీ పంజరాల్లో ఉండవు.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్