Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కావ్యను ప్రేమించానంటూ వెంటబడి పెండ్లి చేసుకున్నాడు ప్రతాప్. తర్వాత పూర్తిగా మారిపోయాడు. ఆ మార్పును కావ్య భరించలేక పోయింది. ప్రశ్నిస్తే కొడతాడు. పైగా ఆమె జీతం మొత్తం తీసుకొని జల్సా చేస్తుంటాడు. అత్తా, మామ, భర్త చుట్టూ ఉన్నా ఆ ఇంట్లో ఒంటరి తనాన్ని అనుభవిస్తున్న ఆమె చివరకు పోలీసులను ఆశ్రయించింది. అక్కడ తనకు సరైన న్యాయం జరగలేదు. అందుకే తన తండ్రిని తీసుకొని ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చి...
మేడమ్ 'నేను ఓ కంపెనీలో పనిచేస్తున్నా. జీతం ఇరవై వేలు. ప్రతాప్ వాళ్ళ ఇల్లు, మా ఇల్లు ఒకే గల్లీలో ఉంటాయి. అలా మా ఇద్దరికీ పరిచయం. చాలా రోజులు ప్రేమిస్తున్నానంటూ వెంటబడ్డాడు. కాని నేను ఒప్పుకోలేదు. చివరికి అతని ప్రేమలో నిజాయితీ ఉందనుకొని ఒప్పుకున్నాను. ఇరువైపుల పెద్దలు మాట్లాడుకొని పెండ్లి చేశారు.
మా అత్త నర్సు. మా మామయ్యకు ఆర్టిసిలో జాబ్. ఇద్దరూ ఉదయం నాలుగ్గంటలకే వెళ్ళాలి. నేను మూడు గంటలకే లేచి వంట చేసి బాక్స్ పెడతాను. తర్వాత ఇంటి పనంతా చేసుకొని ఆఫీస్‌కు వెళతాను. ఇంట్లో ఎంత పనైనా చేసేదాన్ని. కాని మా అత్త ప్రవర్తన మాత్రం నాకు నచ్చేది కాదు. ప్రతాప్ ఎక్కడా స్థిరంగా పని చేయడు. నా జీతంతో పాటు, వాళ్ళ అమ్మ దగ్గర కూడా డబ్బు తీసుకొని సరదాగా తిరుగుతుంటాడు. అతనికి వాళ్ళ అమ్మ సపోర్ట్ బాగా ఉంది. అర్ధరాత్రి రెండు దాటినా మా గదికి రాడు. అమ్మతో కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటాడు. కనీసం మా అత్త కూడా ఆయనకు చెప్పదు.
మా మామయ్య వాళ్ళకు చెప్పలేక తాగుడుకు అలవాటు పడ్డాడు. నేను ఏమైనా అడిగితే ప్రతాప్ కొడతాడు. ఓసారి డబ్బులు ఇవ్వనన్నాని విపరీతంగా కొట్టాడు. భరించలేక పోలీస్ స్టేషన్లో కేసుపెట్టా. అయినా ఫలితం లేదు. ఇంటి సమస్యలు, ఆఫీస్ పని ఒత్తిడితో నాకు థైరాయిడ్ వచ్చింది. పైగా ప్రతాప్ వేరే అమ్మాయిలతో సంబంధాలు కూడా పెట్టుకున్నాడు. ఈ విషయం ఓ అమ్మాయి స్వయంగా నాతో చెప్పింది. ఆమెతో పెండ్లి కాలేదని అబద్దం చెప్పాడంటా. అవన్నీ భరించలేక పుట్టింటికి వచ్చేశా. అప్పటి నుండి ప్రతాప్ రోజూ ఫోన్లు చేస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. మీరే నాకు న్యాయం చేయండి' అంటూ తన మాటలు ముగించింది.
కావ్య చెప్పింది విన్న లీగల్‌సెల్ సభ్యులు 'చూడు కావ్య, నువ్వు ప్రతాప్‌కు దూరంగా ఉంటే అతను ఇంకా బరితెగిస్తాడు. మేము ప్రతాప్‌ను పిలిచి మాట్లాడతాం. ఆ తర్వాత ఏం చేయాలో నిర్ణయించుకుందాం' అని తల్లిదండ్రులు తీసుకొని రమ్మని ప్రతాప్‌కు లెటర్ పంపారు.
తర్వాత వారం ప్రతాప్ తన తల్లిదండ్రులతో వచ్చాడు. ముందు అతన్ని పిలిచి సమస్య ఏంటని అడిగారు. 'ఏం లేదండి. కావ్యే అనవసరంగా ఇక్కడికి వచ్చింది. తనంటే నాకు చాలా ఇష్టం. ఇంట్లో ఒక్క పని చేయకపోయినా ఎవ్వరూ ఒక్క మాట కూడా అనము. పనులన్నీ మా అమ్మే చేసుకుంటుంది. అయితే నాకు కాస్త కోపం ఎక్కువ. నేను చేసేది మార్కెటింగ్ జాబ్. అందులో కొన్ని టెన్షన్లు ఉంటాయి. ఇప్పుడు కరోనా వల్ల మార్కెటింగ్ సరిగా లేదు. టార్గెట్ పూర్తి చేయకపోతే కంపెనీ వాళ్ళు ఒప్పుకోరు. తను ఇంటికి రాగానే అన్నం పెట్టదు. ప్రశాంతంగా ఉండనివ్వదు. దాంతో ఎప్పుడన్నా చిరాకు వస్తే ఓ దెబ్బ వేస్తా' అంటూ చెప్పుకొచ్చాడు.
తర్వాత ప్రతాప్ తల్లిదండ్రులతో కూడా సభ్యులు మాట్లాడారు. ముందు తల్లి మాట్లాడుతూ 'కావ్య అంతకు ముందు చాలా బాగుండేది. నేను ఏమన్నా ఎదురు మాట్లాడేది కాదు. ఈ మధ్యే ఇలా తయారయింది. తనకు ఎవరో నేర్పుతున్నారు. కావ్యకు పిల్లలు లేరని నేనే దగ్గరుండి మరీ ఆస్పత్రిలో చూపిస్తున్నా. కాని ఇప్పుడు మమ్మల్ని ఇలా రోడ్డుకీడ్చింది' అని బాధపడింది.
ఆమె చెప్పింది విన్న సభ్యులు 'చూడండి ఇప్పటి వరకు ఆమెకు పిల్లలు లేరని అంటున్నారు. అసలు కొడుకూ కోడలు సరిగా ఉంటున్నారో లేదో మీరెప్పుడైనా గమనించారా. అర్ధరాత్రి వరకు కొడుకుతో మీరు కబుర్లు చెబుతూ కూర్చుంటే వాళ్ళు దగ్గరెలా అవుతారు. మీ అబ్బాయి కేవలం కావ్య జీతం కోసం పెండ్లి చేసుకున్నాడు. అతనికి సరైన ఉద్యోగం లేదు. కబుర్లు మాత్రం చెబుతాడు. మీరు అతన్ని ఒక్కమాట కూడా అనరు. ఇది మంచి పద్ధతి కాదు. ముందు వారిద్దరినీ సంతోషంగా ఉండనివ్వండి' అని వారు అంటుండగా ప్రతాప్ తండ్రి కల్పించుకుని 'మావాడు కేవలం డబ్బు కోసమే వాళ్ళ అమ్మతో మంచిగా ఉంటాడు. వాడికి బాధ్యత తెలీదు. అందుకే వాళ్ళను వేరుగా ఉండమనండి. అప్పుడే వాడికి బాధ్యత తెలుస్తుంది' అని తన మాటలు ముగించాడు. దీనికి కావ్య సరే అంది. కాని ప్రతాప్ ముందు ఒప్పుకోలేదు. సభ్యులు మాట్లాడి ఒప్పించారు. కావ్య తనతో రావాలంటో మంచి ఉద్యోగం చూసుకున్న తర్వాత రమ్మని ప్రతాప్‌కు చెప్పి పంపారు సభ్యులు.
రెండు వారాల తర్వాత కావ్య, ప్రతాప్ కలిసి వచ్చారు. ప్రతాప్‌కు ఉద్యోగం దొరికిందని, మంచి ఇల్లు చూసుకొని వేరు కాపురం పెడతామని చెప్పారు. సభ్యులు ప్రతాప్‌తో మాట్లాడుతూ 'చూడు ప్రతాప్.. వేరే ఇల్లు తీసుకున్నంత మాత్రాన సరిపోదు. నీలో మార్పు రావాలి. కావ్యను ప్రేమించి, వెంటబడి మరీ పెండ్లి చేసుకున్నావు. ఇప్పుడు ఆమెను ఇబ్బంది పెడుతున్నావు. నీలాంటి వాళ్ళ వల్ల ప్రేమపై ఉన్న గౌరవం పోతుంది. కావ్య చాలా మంచి అమ్మాయి. తనకు ఓపిక ఎక్కువ. నీక్కూడా కావ్యంటే చాలా ఇష్టమంటున్నావు. అలాంటి అమ్మాయిని బాధపెట్టకు. నీకు వేరే అమ్మాయిలతో సంబంధాలున్నాయని కావ్య దగ్గర ఆధారాలు ఉన్నాయి. కాని నువ్వు కాదంటున్నావు. నీది నిజమైన ప్రేమే అయితే నీపై తనకు నమ్మకం కలిగేలా ప్రవర్తించాల్సిన బాధ్యత నీదే. తనకూ కొన్ని కోర్కెలు ఉంటాయి. కాని నువ్వు కావ్యను లెక్కచేయడం లేదు. ఆమె జీతం డబ్బుతో నీ సుఖం నువ్వు చూసుకుంటున్నావు. నీ కాపురం హాయిగా ఉండాలా?వద్దా? అనేది నీ చేతుల్లోనే ఉంది. నువ్వు మారడమే దానికి పరిష్కారం. కాబట్టి నువ్వే ఆలోచించుకో. కాని ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో. ఇకపై నీ వల్ల కావ్యకు ఎలాంటి ఇబ్బంది కలిగినా ఆమెకు అండగా మేమున్నాం' అని సభ్యులు కాస్త గట్టిగానే చెప్పారు. దాంతో ప్రతాప్ ఇకపై జాగ్రత్తగా ఉంటానన్నాడు.
తర్వాత అతన్ని బయటకు పంపి కావ్యతో మాట్లాడబోతుంటే, వెంటనే కావ్య 'గతంలో కూడా ఇలా మారతానని చాలా సార్లు చెప్పాడు. ఇతన్ని ఎలా నమ్మాలి మేడమ్' అంది. దానికి సభ్యులు 'ఇప్పుడే ప్రతాప్లో మార్పు వస్తుందని చెప్పలేం. కాని మారతానంటున్నాడు. కాబట్టి ఓ అవకాశం ఇద్దాం. ముందు మీరిద్దరూ మంచిగా ఉండండి. నీకేమైనా ఇబ్బంది వస్తే మాతో చెప్పు. అలాగే నీ జీతం మొత్తం అతని చేతుల్లో పెట్టకు. మీకున్న సమస్యలకు తోడు ఇప్పుడు కరోనా వచ్చింది. ఎన్నో కుటుంబాల్లో ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. కాబట్టి నువ్వు ఇంకాస్త ఓపిక పట్టు. అప్పటికీ నీ భర్త మారకపోతే ఏం చేయాలో ఆలోచిద్దాం' అని నచ్చ చెప్పారు.
లీగల్‌సెల్ సభ్యులు చెప్పిన విషయాలన్నీ విన్న కావ్య, సరేనంటూ సంతోషంగా ధన్యవాదాలు చెప్పి భర్తతో కలిసి వెళ్ళింది.
_ సలీమ