Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంధ్య గోళ్ళముడి... ఏడు పదుల వయసు... ఎవరు కష్టాల్లో ఉన్నా 20 ఏండ్ల యువతిలా పడిగెడతారు. అందరికీ విద్య అందించడం ద్వారానే సమాజంలోని అసమానతలు దూరం చేయొచ్చు అని బలంగా నమ్మిన స్వచ్ఛమైన మనసు ఆమెది. అందుకే 'ప్యూర్' అనే సంస్థను పెట్టారు. మారుమూల పల్లెల్లో, గిరిజన ప్రాంత్రాల్లో.. చదువుకు దూరమైన పేద పిల్లలు ఎక్కడవున్నా రెక్కలు కట్టుకొని వాలిపోతారు. వారిని అక్కున చేర్చుకుని విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. హాయిగా చదువుకునేందుకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నారు. ప్రస్తుత కరోనా సమయంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో విస్తృతమైన వైద్య సేవలు అందిస్తున్నారు. 'ప్యూర్' ఆధ్వర్యంలో ఐసొలేషన్ సెంటర్లు పెట్టి ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్నారు. ఎందరి ప్రాణాలనో కాపాడుతున్నారు. లాక్‌డౌన్‌తో పనులు కోల్పోయి తిండిలేక అల్లాడిపోతున్న బడుగు జీవులకు అమ్మలా అన్నం పెడుతూ ఆమె చేస్తున్న సేవల గురించి మరిన్ని విశేషాలు మానవి పాఠకుల కోసం...
అవగాహన కల్పిస్తున్నాం
రెండురాష్ట్రాలలోనే కాకుండా భారతావనిలో అన్ని చోట్లా తమ ప్రేమ హస్తాన్ని ప్యూర్ అందిస్తుంది. లాక్డౌన్ మొదలు కాకముందే మొదటగా అనాధాశ్రమాలకు, వృధశ్రమాలకూ వంట దినుసులు, మందులు, శానిటైజర్లు, మాస్కులు వారడిగినవన్నీ సమకూర్చింది. ఆస్పత్రులలో రోగులకూ, ఊళ్ళల్ల్లో, పల్లెల్లోని ప్రజలకు దినుసులు, అవసరమైన మందులు పంపుతున్నాం. డాక్టర్ల బృందాన్ని పల్లెలకు పంపి కరోనా వైరస్ మీద అవగాహన కల్పిస్తున్నాం.
ఖమ్మ జిల్లాలోని మారుమూల గిరిజన ప్రాంతానికి చెందిన ఓ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయురాలు ఏడేండ్ల కిందట ఫేస్బుక్లో ఓ పోస్టు పెట్టారు. తమ పాఠశాలలోని పిల్లలు స్కూలు బ్యాగులు లేక పాఠశాలకు రాలేకపోతున్నారని. ఆ టీచరే తర్వాత రోజు పిల్లలకు మధ్యాహ్న భోజనం తినడానికి పళ్ళాలు లేక ఇబ్బంది పడుతున్నారు మరో పోస్టు పెట్టారు. ఆ రెండు పోస్టులు చూసి మనసు కలచివేసింది.
మా అమ్మాయితో పంచుకున్నా
మా అమ్మాయి శైల తాళ్ళూరి అమెరికాలో ఉంటుంది. నా మనసుకు ఏమనిపించినా తనతోనే పంచుకుంటా. అప్పుడు సమయం ఎంత అయిందో కూడా చూసుకోకుండా నా బాధను తనతో పంచుకుందామని ఫోన్ చేశా. ఇక్కడ మనకు పగలైతే వాళ్ళకు రాత్రి. 'ఈ టైంలో అమ్మ ఫోన్ చేసిందేంటి' అని తను చాలా కంగారు పడింది. నేను విషయం చెబితే ''ఆ టీచర్ని అడిగి స్కూల్లో ఎంత మంది పిల్లలు ఉంటారో కనుక్కో మనమే వాళ్ళకు ఏం కావాలో ఇద్దాం'' అన్నది. అప్పుడు నా మనసు కాస్త కుదటపడి ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాను. తర్వాత రోజు ఆ పోస్ట్ పెట్టిన టీచర్ ద్వారా పిల్లలకు ఏం కావాలో కన్నుక్కోమంటే ఆ పిల్లల చెప్పిన సమాధానికి ఆశ్చర్యపోయాను. ''తినడానికి పళ్ళాలు లేకపోయినా ఒకరి తర్వాత ఒకరం ఒకే పళ్ళెంలో తింటాము. కానీ మాకు రాసుకోవడానికి నోటు పుస్తకాలు లేవు. అవి ఇప్పించండి'' అన్నారంటా టీచర్‌తో. అంత చిన్న వయసులో ఆ పిల్లల ఆలోచనా శక్తికి, చదువు పట్ల వాళ్ళకున్న ఆసక్తికి నోట మాట రాలేదు. వెంటనే మా అమ్మాయి సహకారంతో ఆ పాఠశాలలోని పిల్లలకు బ్యాగులు, పళ్ళాలు, నోటుపుస్తకాలు అందించాం. అలా మొదలయింది ప్రభుత్వ పాఠశాలల్లో మా సేవా కార్యక్రమం.
విద్య ద్వారానే సాధ్యం
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు సహకారం అందిస్తున్నామని తెలుసుకున్న చాలా మంది సాయం కోసం మమ్నలి కలిసేవారు. మన దేశంలో తీవ్రమైన అసమానతలు ఉన్నాయి. ఈ అసమానతలు పోవాలంటే అందరూ చదువుకోవాలి. అందుకే మేము పేద వద్యార్థులకు సాయం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాము. భారతదేశంలో సాయం కోసం ఎదురు చూస్తున్న పేద విద్యార్థుల సంఖ్య చూసి శైల ఓ ఆలోచన చేసింది. ''మనం ఒక్కళ్ళమే అయితే కొంత మందికి మాత్రమే సాయం చేయగలం. అదే టీంగా అయితే ఏంతో మందికి చేయగలం'' అని తన చిన్ననాటి స్నేహితులను కలుపుకుని 2016 మార్చిలో ప్యూర్ పేరుతో సంస్థ ప్రారంభించింది. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో ప్యూర్ సేవాకార్యక్రమాలు జరుగుతున్నాయి. చదువుకోవాలనే కోరిక వుండి ఆర్థిక వెసులుబాటు లేని పిల్లలకు చేయూతనివ్వడమే ముఖ్య ఉద్దేశం.
ఒంటరి మహిళలకు
ఒంటరిగా కుటుంబాన్ని నడిపే మహిళలు పిల్లలకు కడుపునిండా తిండి పెట్టడమే కష్టం. ఇక వాళ్ళకు చదువెలా చెప్పిస్తారు. అందుకే అటువంటి పిల్లలకు సపోర్ట్ చేస్తున్నాము. అలాగే ఒంటరి మహిళలకు ఉపాధి అవకాశాలు కలిపంచే ప్రయత్నం కూడా చేస్తున్నాము. అలాగే ఏదైనా ప్రమాదంతో వికలాంగులైన పిల్లలకు, పుట్టుకతోనే వికలాంగులైన వారికి వారి అవసరాలను గుర్తించి సహాయం అందిస్తున్నాము. కాళ్ళు, చేతులు ఇరిగిపోయన వారికి ఆర్టిఫిషల్ అవయవాలు పెట్టిస్తున్నాము. భారతదేశ వ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తున్నాము. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 370 పాఠశాలల్లోని పిల్లలు 'ప్యూర్' ద్వారా సహాయం పొందుతున్నారు. అలాగే కాలేజీ విద్యార్థులకు కూడా సహకరిస్తున్నాం.
పిరియడ్స్‌పై అవగాహన...
పాఠశాలల్లో ఇలా కార్యక్రమాలు చేస్తున్న సమయంలోనే మేము ఒకటి గమనించాము. హైస్కూల్‌కి వచ్చిన తర్వాత అమ్మాయిల అటెండెన్స్ తక్కువగా ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అని అధ్యయనం చేస్తే పిరియడ్స్ వల్ల దానికి తగ్గ సౌకర్యాలు పాఠశాలలో లేకపోవడంతో వాళ్ళు స్కూల్‌కి రావడంలేదు. మధ్యలోనే బడి మానేస్తున్నారు. అందుకే పిరియడ్స్‌పై అమ్మాయిలకు అవగాహన కల్పించేందుకు ఓ పెద్ద ప్రాజెక్ట్ తీసుకున్నాం. అన్ని పాఠశాలల్లో సదస్సులు నిర్వహించి అవగాహన కల్పించడంతో పాటు శానిటరీ ప్యాడ్స్ పంచుతున్నాము. ఇప్పటి వరకు లక్షా 70 వేల మంది అమ్మాయిలకు వీటిని అందించాము. ఈ ప్రాజెక్ట్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుత కరోనా సమయంలో అన్లైన్ ద్వారా సదస్సులు పెడుతున్నాం. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని అనాథాశ్రమాలతో కాంటాక్ట్ పెట్టుకొని అవగాహన కల్పిస్తూ నాప్కిన్లు ఇస్తున్నాం. అలాగే 80 అనాథాశ్రమాలలో అనేక వ్యాధులతో బాధ పడుతున్న పిల్లలకు మందులు పంపిణీ చేశాము.
కరోనా కాలంలో...
కరోనా వచ్చిన తర్వాత గత సంవత్సరం లాక్డౌన్లో వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారికి 'ప్యూర్' ఆధ్వర్యంలో పండ్లు, స్నాక్స్, భోజనం ఏర్పాటు చేశాము. కొంత మందిని సొంత గ్రామాలకు పంపించాము. సెకండ్ వేవ్‌లో కరోనా విజృంభించింది. ఆస్పత్రులలో సరైన సదుపాయలు లేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వైద్యం అందంగా ఎవ్వరూ చనిపోకూడదనే ఉద్దేశంతో హైదరాబాద్‌లో రెండు చోట్ల ఐసోలేషన్ సెంటర్లు పెట్టి 24 గంటలూ వారికి వైద్యం అందుబాటులో ఉండేలా చూస్తున్నాం. ఐసొలేషన్‌లో ఉండే వాళ్ళు కట్టు బట్టలతో వస్తే చాలు. మిగిలిన అన్ని సైకర్యాలు ఇక్కడే ఉంటాయి. మంచి డాక్టర్లు వాళ్ళను పర్యవేక్షిస్తున్నారు. అలాగే ఎన్నో ఐసొలేషన్ సెంటర్లకు, ఆస్పత్రులకు ఆక్సిజన్ సిలెండర్లు, బెడ్లు, మందులు, భోజనం, వెంటిలేటర్లు అందిస్తున్నాం.
ఆమె శ్రమే కారణం
స్వచ్ఛమైన మనసు కలిగిన వ్యక్తి సంధ్య గోళ్ళముడి. ఆమె లేకుండా మన భారతదేశంలో ప్యూర్ కార్యకలాపాలు ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయికి ఎదగవు. ఆమె చేసే ప్రతి పని కోసం 500 శాతం శ్రమిస్తారు. అదే లక్షలాది మంది విద్యార్థులను, నిరుపేదలను ప్యూర్ చేరుకోవడానికి సహాయపడింది. ప్యూర్‌కు ఆమె ఓ బలమైన నాయకత్వం. కాబట్టే ఇంత తక్కువ సమయంలో ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ఉపయోగపడింది. ఇంత తక్కువ వ్యవధిలో వందలాది కుటుంబాలకు మేము మద్దతు ఇవ్వగలిగాము. మొదటి వేవ్ సమయంలో కూడా ఆమె సేవలు అసమానమైనవి.
- శైల తాళ్ళూరి, ప్యూర్ వ్యవస్థాపకులు.
వేగంగా సాయం
ప్యూర్ సంస్ధలో వాలంటీర్‌గా ఐదు సంవత్సరాల నుండి చేస్తున్నాను. సంధ్య గారు చేసే సేవలు మొదటి నుండి చూస్తున్నాను. ఆ నమ్మకంతోనే చేరానూ. 'ప్యూర్' అనే మాటకు ప్యూర్ సంస్ధ ఓ నిర్వచనమని చెప్పవచ్చు. అడగీ అడక్కముందే మావాలంటీర్లకు కబురువస్తుంది. నిజానిజాలను క్షాణాలలో విచారించి రిపోర్టు చేస్తాము ప్యూర్ మేనేజ్మెంట్కు. అంతే వేగంగానూ అవసరమైన వారికి సహాయం అందుతుంది.
- భార్గవి
కలలు కన్నాను...
కరోనా సమయంలో ప్యూర్ సేవలు చూసి ఆశ్చర్యం అనిపించింది. నేను కూడా వాలంటీర్‌గా చేరాలని, నాకు అప్పగించిన పనిని బాధ్యతగా చేయాలని కలలుకనేవాడిని. ఓ సారి ఆఫీస్‌కు వెళ్ళి మేడమ్‌ను కలిసి ఇందులో పని చేయాలనుకుంటున్నాని చెప్పాను. వారు నా గురించి తెలుసుకుని 'ప్యూర్'తో కలిసి సేవ చేసే అవకాశం కల్పించారు. ఎంతో మంది పేదలకు ఎన్నో రకాలుగా సేవలు అందిస్తున్న ప్యూర్‌కు ధన్యవాదములు.
- రాజ
- సలీమ