Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన ఆలోచనలను భాగస్వామితో పంచుకుంటే ప్రేమ ఏర్పడుతుందని మానసిక నిపుణులు అంటున్నారు. కొంతమంది అన్ని విషయాలను భాగస్వామి వద్ద ఎక్స్‌ప్రెస్ చేయలేరని, అందుకే వారి మధ్య దూరం పెరుగుతుంది. మనలోని మైండ్ సెట్ ఆధారంగానే దాంపత్య జీవితంలో బంధం ఏర్పడుతుంది. అంతేకానీ ఊహల పల్లకిలో ఉన్నట్టు ఆ బంధం ఉండదు. అందువల్ల ప్రతి ఒక్కరూ ఊహాలోకం నుంచి బయటకు వచ్చి భాగస్వామిని ప్రేమిస్తే ఇద్దరి మధ్య అంతరం తగ్గుతుంది. దాంపత్య జీవితంలో ఒకరినొకరు ప్రేమించుకోవడం, అర్థం చేసుకోవడం, సమస్యలను పరిష్కరించుకోవడం చేయాలి.
రోజువారీ పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతల్లో పడి కొంతమంది మగవాళ్లు భార్యకు తగినంత సమయం కేటాయించరు. ఇలాంటప్పుడే వారు అసంతృప్తిలో కూరుకుపోతారు. ఒక వ్యక్తి అవసరాలు, కోరికలు ఎప్పటికప్పుడు మారవచ్చు. కానీ వీటి కోసం జీవిత భాగస్వామిని నిర్లక్ష్యం చేయకూడదు. అందుకే భార్యను మరింత ఎక్కువగా ప్రేమించాలి. ఇందుకు మీరు మార్చుకోవాల్సిన అంశాలపై దృష్టి పెట్టాలి. భార్యలకు ఇంటి పనుల్లో సాయం చేయడం, సమయం ప్రకారం తింటున్నారా లేదా అని ఆరా తీయడం, మానసిక ఒత్తిడిని దూరం చేయడానికి ప్రయత్నించడం వంటివి చేయాలి.
గత అనుభూతులు గుర్తు చేయాలి
భార్యకు ఇంటి పనులు... భర్తకు ఆఫీసు పనులతో రోజంతా గడిచిపోతుంది. కొన్నిసార్లు ఒకరితో మరొకరు ప్రేమగా మాట్లాడుకునేంత సమయం ఉండదు. ఇలాంటప్పుడు భర్తలు చొరవ తీసుకోవాలి. ఖాళీ సమయంలో భార్యతో మాట్లాడాలి. మీరు జీవితభాగస్వామిని మొదటిసారి కలుసుకున్న సందర్భం, ఫస్ట్ కిస్, ఫస్ట్ డేట్... వంటి రొమాంటిక్ డిస్కషన్ ఉండాలి. ఇలాంటి చిన్న చిన్న విషయాలే ఇద్దరి మధ్య ఆకర్షణ తగ్గిపోకుండా చేస్తాయి.
ప్రేమభాషను వాడాలి
ప్రేమను అనుభూతి చెందే భాషలో భాగస్వామితో మాట్లాడటం దాంపత్య బంధంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రేమభాష తెలుసుకోవడం, జీవిత భాగస్వామితో ఇదే భాషలో మాట్లాడటం వల్ల ఎంతో సమయాన్ని ఆదా చేయవచ్చు. భార్యతో మాట్లాడేటప్పుడు నిశ్చితమైన పదాలు, ముద్దుపేర్లు వాడాలి. కౌగిలింతలు వంటి శారీరక స్పర్శ ఉండాలి. వారితో సేవాభావంతో మెలగాలి. భార్యలకు నాణ్యమైన సమయం కేటాయించాలి. తరచుగా బహుమతులు ఇవ్వాలి. అటు భార్యలు కూడా ఎంతసేపు ఇంటి పనులలో నిమగం కాకుండా భర్తకు అవసరమైన వాటిని తెలుసుకుని వారితో ప్రేమగా మెలగాలి.
క్షమాపణలు చెప్పాలి
ప్రేమ భాష మాదిరిగానే క్షమాపణలకు కూడా ప్రత్యేకమైన భాష ఉంటుంది. సంసారంలో కోపతాపాలు తప్పనిసరిగా ఉంటాయి. భాగస్వామిపై కోప్పడినప్పుడు, వారికి నిర్దిష్టమైన పద్ధతుల్లో క్షమాపణ చెప్పాలి. అది ఇద్దరి మధ్య ఏర్పడే గ్యాప్‌ను క్షణాల్లోనే దూరం చేస్తుంది. జీవితభాగస్వామికి ఎలా క్షమాపణలు చెబితే సమస్య పరిష్కారం అవుతుందో భార్యాభర్తలకు తెలిసి ఉండాలి.
తప్పులకు బాధ్యత వహించాలి
అన్ని విషయాల్లోనూ జీవిత భాగస్వామినే తప్పుపట్టడం సరికాదు. కొన్నిసార్లు భర్తలు లేదా భార్యలు గొడవకు కారణం అవుతారు. ఇలాంటప్పుడు తప్పును ఒప్పుకోవడానికి వెనుకాడకూడదు. మీ ప్రవర్తనకు పూర్తి బాధ్యత తీసుకోవడం సంసారంలో చాలా ముఖ్యం. తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పడం వల్ల ఇద్దరి మధ్యా గొడవలు దూరమవుతాయి.
అతిగా ఊహించుకోవద్దు
జీవిత భాగస్వామి గురించి మీకు అన్ని విషయాలు తెలిసి ఉండవచ్చు. కానీ వారు ఎలాంటి పరిస్థితుల్లో ఎలా స్పందిస్తారో కూడా తెలుసుకోవాలి. ప్రతి విషయాన్ని పెద్దదిగా చేసి చూడకూడదు. అతిగా ఊహించుకోవడం వల్ల లేనిపోని అపార్థాలు, అనుమానాలు కలుగుతాయి. ఇవి ఇద్దరి మధ్య గొడవలకు కారణమవుతాయి. అందువల్ల ఇద్దరి మధ్య చిన్నపాటి గ్యాప్ వచ్చినా సరే.. దాన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. ఇలాంటి సందర్భం ఎదురైనప్పుడు ఒకరికొకరు ప్రశ్నలు వేసుకోండి. అనుమానాలను దూరం చేసుకునేందుకు ప్రయత్నించాలి. ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఎప్పటికీ బాగుండేలా చూడాలి.
మొండితనం వద్దు
సంసారం సజావుగా ముందుకు సాగాలంటే.. భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు క్షమించే గుణం అలవాటు చేసుకోవాలి. మొండి పట్టుదలను దూరం చేసుకోవాలి. ఈ రెండింటినీ మగవాళ్లు అర్థం చేసుకున్నప్పుడే దాంపత్యంలో సుఖం ఉంటుంది. భాగస్వామి చేసిన చిన్న విషయాలను కూడా మీరు క్షమించలేకపోతే, అది జీవితంలో అసంపూర్ణతకు దారితీస్తుంది.