Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లైవ్ టు లవ్, కుంగ్ ఫూ నన్స్ కలిసి హిమాలయాలలో మహమ్మారితో పోరాడుతున్నారు. లడఖ్, లాహాల్-స్పితి, ఖాట్మండ్ వంటి మారుమూల ప్రాంతాలలో ఉంటూ మౌలిక సదుపాయాలకు నోచుకోక, ఇతర ఎన్నో ఆరోగ్య సమస్యలను అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాల నుండి నిర్లక్ష్యం చేయబడిన హిమాలయ ప్రాంతల్లో నివసించే వీరికి కుంగ్ ఫూ నన్స్‌తో పాటు లైవ్ టు లవ్ సంస్థ వారు అద్భుతమైన సేవ చేస్తున్నారు. ఈ కరోనా సమయంలో వారికి అవసరమైన వనరులను అందిస్తున్నారు.
హిమాలయాల్లో ఉండే లడఖ్, లాహాల్-స్పితితో పాటు నేపాల్‌లోని మరికొన్ని ప్రాంతాలు భూమిపైనే అత్యంత అందమైన ప్రదేశాలు. కాని ఈ ప్రాంతాలకు వెళ్ళడానికి ఎటువంటి అవకాశాలూ లేవు. నగరాలకు వీరికి ఎలాంటి సంబంధం ఉండదు. మౌలిక సదుపాయాలు అందుబాటుల్లో లేవు. ఇక వైద్య సేవలైతే అంతంత మాత్రమే. కోవిడ్-19 మహమ్మారి ప్రారంభంతో ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల కష్టాలను మరింతగా పెరిగాయి. అటువంటి అట్టడుగు ప్రజలకు సహాయ కార్యక్రమాలు చేసేందుకు ముందుకు వచ్చారు లైవ్ టు లవ్, కుంగ్ ఫూ నన్స్. వీరు ఇతర స్థానిక సంస్థల భాగస్వామ్యంతో అట్టడుగు వర్గాలకు, మహమ్మారి వల్ల తీవ్రంగా ప్రభావితం చెందిన మహిళలకు అవసరమైన సహాయాన్ని అందిస్తున్నారు.
అసమానతలను రూపుమాపేందుకు
ద్రుక్పా వంశానికి చెందిన కుంగ్ ఫూ నన్స్ లింగ అసమానతలు రూపుమాపేందుకు కృషిచేస్తున్నారు. ఇందులో భాగంగా బాలికలకు యుద్ధ కళను నేర్పించడమే కాకుండా వారిలో ఆత్మవిశ్వాసం నింపి తమను తాము ఎలా రక్షించుకోవాలో చెబుతూ వారి జీవితంలో ఎన్నో మార్పులు తీసుకువస్తున్నారు. ''పర్యాటక రంగంపై ఆధారపడిన కుటుంబాలో ఇక్కడ అధికం. కరోనా సమయంలో ఈ రంగం దెబ్బతినడంతో వేలాది మంది జీవనోపాధిపై దీని ప్రభావం పడింది. లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన మహిళలు తీవ్రమైన గృహ హింసను ఎదుర్కొన్నారు. మానవ అక్రమ రవాణా సంఘటనలు పెరగడం ప్రారంభమయ్యాయి. ఇటువంటి పరిస్థితుల్లో మా తక్షణ కర్తవ్యం రేషన్, ఆహారం, వైద్య సేవలను అందించడం. మేము లడఖ్‌లో 18,000 మాస్కులు సరఫరా చేసాము. మొదటి వారంలో 3,000 కుటుంబాలకు ఆహారాన్ని అందించాము. ఇది ప్రస్తుతం లాహౌల్-స్పితి, నేపాల్, లడఖ్‌లోని 4,000 కుటుంబాలకు పెరిగింది'' అని స్మృది చెప్పారు.
యువతకు ఉపాధి కల్పనకు
లైవ్ టు లవ్, దాని ఆన్-గ్రౌండ్ భాగస్వామి అయినా యంగ్ డ్రుక్పా అసోసియేషన్ గార్షాతో కలిసి ఇప్పటికే రెండు వేల కుటుంబాలకు స్టీమర్లు, గార్గిల్స్, మందులు సరఫరా చేసింది. లాహౌల్-స్పితి అంతటా 171 గ్రామాలను మొదటి దశ సహాయక చర్యల్లో భాగంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసింది. వలస కార్మికులు తిరిగి రావడంతో.. మరో తక్షణ అవసరం యువతకు ఉపాధి కల్పించడం. దీనికోసం నెట్‌వర్క్‌లు, ఛానెల్‌లను సృష్టించడం. లైవ్ టు లవ్ వారి సామాజిక వ్యవస్థాపకత వెంచర్లను నిర్వహించడానికి యువతకు మెంటర్షిప్, వనరులను అందించడానికి పెట్టుబడిదారులతో ఇంక్యుబేషన్ కేంద్రాలు, సమావేశాలను ఏర్పాటు చేసింది.
మహిళలకు ఆర్థిక వెసులుబాటు
ఇక్కడి ప్రజలకు వైరస్ గురించి అవగాహన లేకపోవడం మరో సవాలు. ''లేV్‌ా వంటి నగరంలో మాత్రమే ప్రాథమిక పరికరాలు, అవసరమైన వైద్య పరికరాలు ఉన్నాయి. వైరస్ అంటే ఏమిటో లేదా ఫేస్‌మాస్క్ ఎలా ఉపయోగించాలో తెలియని చాలా మారుమూల గ్రామాలు ఉన్నాయి'' అని సిమ్రాన్ చెప్పారు. లైవ్ టు లవ్ వాలంటీర్లు ఇటువంటి ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని మాస్కులు కుట్టడం కోసం చిన్న యూనిట్లను ఏర్పాటు చేశారు. తద్వారా మహిళలకు కొంత ఆర్థిక వెసులుబాటు వచ్చింది. ఇలా ఇప్పటి వరకు స్థానిక మహిళలతో కుట్టించిన 18,000 మాస్కులు పంపిణీ చేయబడ్డాయి.
కుంగ్ ఫూ నన్స్ చేసే సేవలు
కుంగ్ ఫూ నన్స్.. ప్రపంచం హిమాలయ ప్రాంతాలలోని మహిళలను చూసే విధానాన్ని మార్చివేశారు. వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి కుంగ్ ఫూ నేర్చుకోవడం ప్రారంభించినప్పటికీ వారు ఇప్పుడు తమ నైపుణ్యాలను ఇతరులకు సేవ చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఇతర మహిళలకు ఆత్మరక్షణ నేర్పుతున్నారు. ఉచిత ఆరోగ్య కేంద్రాలు నడుపుతున్నారు. ఇతర సంస్థలతో భాగస్వామ్యంతో వారు తిరిగి మళ్ళీ ఉపయోగించగలిగే శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేస్తున్నారు. దీని ద్వారా ప్లాస్టిక్‌ను నిరోధించి పర్యావరణాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు. ఆత్మరక్షణ శిక్షణతో పాటు రుతుస్రావ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు.
మన ఆరోగ్యం దృష్టి
సీనియర్ కుంగ్ ఫూ నన్ జిగ్మే కొంచోక్ మాట్లాడుతూ ''మహమ్మారి మాకు చాలా విషయాలు నేర్పింది. లింగ అసమానత మహిళలకు ఎక్కువ బాధలకు కారణమవుతుంది. చివరికి ఇది వారి ప్రాణాలను కూడా తీస్తుందని మేము తెలుసుకున్నాం. ఇది స్త్రీలుగా మన సొంత ఆరోగ్యం, భద్రతకు బాధ్యత వహించాలని ఇది మాకు నేర్పింది. మనం మనుగడ సాగించాలంటే మనమందరం ఒకరినొకరు సహకరించుకోవాలి. ప్రతి స్త్రీ, ప్రతి అమ్మాయికి ఒకటి చెప్పదలచుకున్నా... ఎవరూ మీకు శక్తిని ఇవ్వరు. మీలో ఇప్పటికే ఆ శక్తి ఉంది. .దానిని గ్రహించాలి'' అంటారు.
మహిళల పాత్ర ఎక్కువ
కుంగ్ ఫూ నన్స్ ఆహార పంపిణీ, మెడికల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నప్పుడు వారి కుటుంబాలను చూసుకోవడం మహిళల పాత్ర ఎంతగా ఉందో గమనించారు. ''తమ కుటుంబం కోసం ఆహారం, పరిశుభ్రత గురించి శ్రద్ధ వహిస్తారని మేము గమనించాం. వారు క్రమం తప్పకుండా చేతులు శుభ్రం చేసుకోవాలని చెబుతున్నాం. కోవిడ్-19 వ్యాప్తి తగ్గుతుందని నిర్ధారించే సంఘ నాయకులను తయారు చేయడానికి ఇది మాకు సహాయపడింది. ఆహారాన్ని సమానంగా పంపిణీ చేసేలా వారు కూడా మాకు సహకరించారు'' అని సిమ్రాన్ వివరించారు. నేపాల్‌లో లైవ్ టు లవ్ కార్యకలాపాలను నిర్వహించే కుంగ్ ఫూ నన్ యేషే లామో మాట్లాడుతూ ''స్త్రీవాదం మహిళలను బలంగా మార్చడం కోసం లేదు. మహిళలు ఇప్పటికే బలంగా ఉన్నారు. ఇది ప్రపంచం మహిళలను చూసే ప్రవర్తించే విధానాన్ని మార్చడం కోసం పని చేస్తుంది'' అంటున్నారు.
కోవిడ్-19 ఎదుర్కునేందుకు
ప్రోగ్రామ్స్ అండ్ కమ్యూనికేషన్స్ అధికారి సిమ్రాన్ తప్లియల్, లైవ్ టు లవ్ కమ్యూనికేషన్స్ అండ్ అడ్వకేసీ వైస్ ప్రెసిడెంట్ స్మృధి మార్వా, మహమ్మారి సమయంలో తీసుకున్న కార్యక్రమాలు, అక్కడి సమస్యల పరిష్కారం కోసం తీసుకున్న కార్యక్రమాల గురించి మాట్లాడుతూ ''హిమాలయ ప్రాంతంలో పనిచేస్తున్న అత్యంత చురుకైన సంస్థలలో ఇది ఒకటి. ఈ ప్రాంతం ఎదుర్కొంటున్న సవాళ్లను మేము బాగా అర్థం చేసుకున్నాము. ముఖ్యంగా ఇతర ప్రాంతాలతో వీరికి కమ్యూనికేషన్ లేదు. లాక్డౌన్ ప్రకటించిన తర్వాత ఈ సమస్య మరింత ఎక్కువయింది. ప్రజలు ఆహారం, ఇతర నిత్యావసరాల వంటి ప్రాథమిక విషయాల కోసం కూడా సైన్యం మీద ఆధారపడవలసి వచ్చింది'' అని సిమ్రాన్ చెప్పారు.
వైరస్‌పై అవగాహన
''ఆక్సిజన్ సిలిండర్లతో పాటు ఇతర ముఖ్యమైన వైద్య పరికరాలను అవసరమైన ప్రాంతాలకు రవాణా చేయడానికి ప్రభుత్వం మా మద్దతును కోరింది. గత మూడు నెలల్లో మేము లడఖ్ ప్రాంత ప్రజలకు అవసరమైన ఎన్నో మౌలిక సదుపాయాలను అందించగలిగాము. దీనితో పాటు కోవిడ్-19పై ప్రజలకు అవగాహన కల్పించడానికి వీడియోలు, బ్యానర్లను తయారు చేసి ప్రచారం చేశాము. నన్స్ హిమాలయ ప్రాంత ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. వారి కుటుంబాలు, స్నేహితులు, వాలంటీర్లు, అభిమానులు సైతం వెళ్ళలేని అత్యంత దుర్భరమరైన మార్గాల ద్వారా వారిని చేరుకుంటారు'' అని స్మృది చెప్పారు.
- సలీమ