Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాల్యం అంటేనే అల్లరి. కంటికి కనిపించే వాటన్నింటి అంతు చూడాలన్న ఆత్రుత కుతూహలం వారిని ఓ విషయంపై దృష్టి కేంద్రీకరించనీయవు. కానీ స్కూల్లో చేరి, పాఠాలు చదువుకోవడం మొదలెట్టినా పిల్లలు ఏకాగ్రతను అలవరచుకోక పోవడం పెద్దలను బాధిస్తుంది. అయితే ఇప్పుడు కరోనాతో ఆన్లైన్ క్లాసులే తప్ప స్కూల్‌కి వెళ్ళే అవకాశం లేదు. దాంతో సమస్య మరింత ఎక్కువవుతుంది. ఇలాంటప్పుడు దృష్టిని నిలపడం నిజానికి పిల్లలకు చాలా కష్టమైన పనే. కొంతమందికి స్వతహాగా ఉంటే కొంతమందికి పెద్దల భయంతో బలవంతాన అలవర్చుకుంటారు. అలా కాకుండా పిల్లలు ఇబ్బంది పడకుండా వారికీ అలవాటయ్యేలా చెయ్యాలంటే పెద్దలు కాస్త శ్రమపడాల్సి ఉంటుంది.బాబు గానీ, పాపా కానీ ఏదైనా ఓ పనిలో లీనమవడం పెద్దలు గమనిస్తే వాళ్ళను డిస్టర్బ్ చేయకుండా కొనసాగనివ్వాలి.
వారి ధ్యాస మళ్లించే ప్రయత్నాలేవీ చేయకూడదు. వాళ్ళు చెప్పిన పనిని మెచ్చుకుంటూ దానిని ఇంకా కొనసాగించేలా ప్రోత్సహించాలి.
వాళ్ళ పక్కనే మీరూ నిలబడి సహాయపడటమో, మరో పని చేస్తూనో వారిని గమనిస్తుండాలి. మధ్య మధ్యలో ప్రశంసలు, చిన్న సూచనలు ఇవ్వచ్చు. ఇలా చేయడం వల్ల మీరున్నంతసేపో అ పని చేసి ఒక పనిపై ఎక్కువ సమయం గడిపినవరవుతారు. పిల్లలకు ఇదే క్రమేపి ఏకాగ్రత పెరగడానికి దోహదం చేస్తుంది.
పిల్లలు చేయాల్సిన పనులను వారికి ఆసక్తికరంగా ఉండేలా మార్చండి. ఈ రోజు ఇంగ్లీష్ పాఠం పూర్తిగా రెండు సార్లు చదివితే కథ చెప్తానని, తెలుగు హోం వర్క్ నీట్‌గా రాస్తే పాట నేర్పుతానని.. ఇలా వర్క్ ఆసక్తి కలిగే విషయాలను చెప్పాలి. పాఠమంతా చదివాక ఫలానా పదం ఎన్నో లైన్లో ఉందో చూసి చెప్పు. ఈ పదం స్పెల్లింగ్ నేను చెప్తాను కరేక్టేనేమో నువ్వు చూడు... ఇలా చిన్న చిన్న ఆటలు, మాటలతో వారు ఎక్కువసేపు ఇక పనిలో కొనసాగేలా చేయవచ్చు. అయితే రోజూ కొంచెం చొప్పున సమయం పెంచుకుంటూ వెళ్ళాలి. కానీ ఒకే రోజు గంటసేపు కుర్చోబెట్టకూడదు.
పిల్లలు ఎక్కువగా ఇష్టపడేది కార్టూన్ ఛానల్ చూడడం. వారిని రోజులో కొంత సమయం వారికి నచ్చిన ఛానల్‌ని చూడనివ్వడం. దాని వాల్ల పిల్లలో కొంచెం స్ట్రెస్ తగ్గుతుంది.
మొత్తం చదువుపైననే కాకుండా వారికీ అన్ని ఆటలు నేర్పించాలి.
పిల్లలకి పెట్టే ఆహారపదార్థాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వారికి ఇష్టంలేని పదార్థాలు పెట్టడం వల్ల పిల్లలు సరిగా తినరు. ఖాళీ కడుపుతో ఉంటే పాఠాలు బుర్రకెక్కవు.
పిల్లలకి ఎక్కువ మార్కులు వచ్చినప్పుడు మెచ్చుకోవడం తక్కువ మార్కులు వచ్చినప్పుడు తిట్టడం లాంటివి చేయకూడదు. తక్కువ మార్కులు వచ్చినప్పుడు వారికి చదువుపై శ్రద్ధ పెరిగే విధంగా మసలుకోవాలి. నమ్రతగా వారికి నచ్చ చెప్పాలి.
ఇలా పిల్లల్లో ఏకాగ్రత పెరిగే విధంగా తల్లిదండ్రులు చిన్న చిన్న సూచనలు పాటిస్తే సరిపోతుంది. అదే వారి బంగారు భవిష్యత్తుకు చక్కటి బాట వేస్తుంది. పిల్లల్లో ఏకాగ్రత పెంచితే చాలు అదే మంచి మెడిటేషన్.