Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వానాకాలం మొదలైతే నాలుక కొత్త రుచులు కోరుకుంటుంది. కాస్త ఘాటుగా తినాలని తెగ ఉబలాటపడుతుంది. కారం కారంగా నోటికి తగులుతుంటే మస్తు అనిపిస్తది. అయితే తినే ఆ వంటలు రుచిగానే కాదు కాస్త ఆరోగ్యంగా కూడా ఉండాలి కదా. పచ్చళ్ళు అంటే ఎవరైనా ఇష్టపడతారు. అసలే కరోనా సమయం. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యం విషయంలో అస్సలు రిస్క్ తీసుకోకూడదు. అందుకే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం... అలాంటి కొన్ని రకాల పచ్చళ్ళు ఈరోజు మీకోసం...
ముల్లంగి, పల్లి పచ్చడి
కావలసిన పదార్ధాలు: ముల్లంగి తురుము - ఒక కప్పు, పల్లీలు - అర కప్పు, పచ్చి మిర్చి- రెండు, ఎండు మిర్చి - నాలుగు, నువ్వులు - రెండు చెంచాలు, ఆవాలు - పావు చెమ్చా, ఇంగువ - చిటికెడు, నూనె - 5 చెంచాలు ఉప్పు, పసుపు - తగినంత, చింతపండు గుజ్జు - అర చెమ్చా.
తయారీవిధానం: ముందుగా పల్లీలను వేయించి పెట్టుకోవాలి. ఆ తర్వాత బాణలిలో రెండు చెంచాల నూనె వేసి ఆవాలు, పచ్చిమిర్చి, నువ్వులు వేసి వేయించాలి. ఆఖరున ఎండు మిర్చి కూడా వేసి వేగాగానే ఇంగువ వేసి ఆపేయాలి. ఆ పోపుని తీసి పక్కన పెట్టి, అదే బాణలిలో ముల్లంగి తురుము వేసి అయిదు నిముషాలు వేయించాలి. చిటికెడు ఉప్పు వేసి మూత పెడితే తడి వచ్చి ఆ తడితో మెత్త పడుతుంది. అలా ఓ రెండు నిముషాలు వుంచి ఆపేయాలి. ఇప్పుడు పోపు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ పొడిలో పల్లీలు కూడా వేసి మళ్ళీ తిప్పాలి. తర్వాత ముల్లంగి, చింతపండు వేసి, కావలసిన ఉప్పు, పసుపు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆఖరున ఆవాలు, ఎండు మిర్చి, ఇంగువతో పోపు చేసి పచ్చడి పయిన వేసి కలిపితే రుచిగా వుంటుంది.
మునగాకు పచ్చడి
కావలసిన పదార్ధాలు: మునగాకు - 1/4 కప్పు, చింతపండు - కొద్దిగా, ఎండుమిర్చి - 2, పచ్చిమిర్చి - 2, కొత్తిమీర - 2 కట్టలు, వెల్లులి - 4 రెబ్బలు, జీలకర్ర - 1/2 చెంచా, ఉప్పు - తగినంత, పసుపు - 1/8 చెంచా, పల్లీలు - 1/4 కప్పు, నూనె - సరిపడినంత, తాలింపుగింజలు - కొద్దిగా.
తయారీవిధానం: మునగాకు కడిగి ఆరబెట్టి పుల్లలు, ఈనెల లేకుండా దూసి ఉంచుకోవాలి. పొయ్యిమీద పాన్లో నూనె వేడిచేసి పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి ముక్కలు, వెల్లులి, జీలకర్ర వేయించాలి. అవివేగాక మునగాకు వేసి వేయించుకోవాలి. పసుపు వేసి అవి పూర్తిగా వేగుతున్న సమయంలో కొత్తిమీర ఆకులువేసి ఉప్పు, చింతపండు వేసి మూతపెట్టి మగ్గనిచ్చి పొయ్యిమీద నుండి దించి చల్లారనివ్వాలి. ఈలోగా పల్లీలు దోరగా పొడి మూకుడులో వేయించుకోవాలి. ఇవ్వన్నీ కలిపి పచ్చడిలా రుబ్బుకోవాలి. ఈ పచ్చడిని విడిగా గిన్నెలోకి తీసుకుని పైన నూనెలో వేయించిన తాలింపుగింజలు, కరివేపాకు వేసుకోవాలి. ఈ పచ్చడి చాలా బావుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
కంది పచ్చడి
కావలసిన పదార్ధాలు: కందిపప్పు - 1 కప్పు, జీలకర్ర - 1 చెంచా, చింతపండు - కొద్దిగా, వెల్లుల్లిపాయలు - 5 నుంచి 6, ఎండు మిర్చి - 4 నుంచి 5, ఉప్పు - 1 చెంచా, మినప్పప్పు - 1/4 చెంచా, శెనగప్పపు - 1 /4 చెంచా, పసుపు - చిటికెడు, ఆవాలు - 1/4 చెంచా, కరివేపాకు - 8 నుంచి 10 ఆకులు, ఇంగువ - కొద్దిగా, నూనె - తగినంత.
తయారీవిధానం: కందిపప్పు తక్కువ మంట మీద మెల్లగా దోరగా వేయించుకోవాలి. పూర్తిగా వేగినతరువాత అదే వేడి మూకుడులో ముక్కలుగా తుంచిన ఎండుమిర్చి, జీలకర్ర వేసి కలిపి కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీలో పసుపు ఉప్పు వేసి తిప్పాలి. ఇష్టమైన వారు ఆ వేడి మూకుడులో వెల్లుల్లి రెబ్బలు వేసి అవికూడా రుబ్బాలి. చింతపండు నానబెట్టి రసం తీసుకుని ఆపచ్చడిలో వేసి కొద్దినీరు పోసి గట్టిగానే కలుపుతూ రుబ్బాలి. మరీ మెత్తగా కాకుండా ఈ పచ్చడిని రుబ్బాలి. రోలు ఉంటే అందులో రుబ్బితే మరీరుచిగా ఉంటుంది. బాణలి వేడి చేసి నూనె పోసి మినప్పప్పు, శెనగపప్పు ఆవాలు, ఇంగువ వెలుల్లి, కరివేపాకు వేసి దోరగావేగనిచ్చి ఈ పచ్చడి పైన పోపు వెయ్యాలి. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది.
క్యాప్సికమ్ పచ్చడి
కావలసిన పదార్థాలు: క్యాప్సికమ్ - పావు కిలో, కారం - 2 టీ స్పూన్లు, ఉప్పు - తగినంత, చింతపండు - సరిపడా, అల్లం, వెల్లుల్లి ముద్ద - 1 టేబుల్ స్పూను, నూనె - తగినంత, జీలకర్ర - అర టీ స్పూను, పసుపు - కొద్దిగా, జీలకర్ర పొడి - 1 స్పూను, మెంతిపొడి - ఒక స్పూను.
తయారీవిధానం: ముందుగా క్యాప్సికమ్ కడిగి తుడిచి, అంగుళం ముక్కలుగా కట్ చేసి గింజలు తీసేసుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు చిక్కగా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి వేడిచేసి జీలకర్ర వేసి వేగాక క్యాప్సికమ్ ముక్కలు, పసుపు వేసి కలిపి మూతపెట్టి మగ్గనివ్వాలి. ముక్కలు మెత్తబడ్డాక కారం, అల్లం, వెల్లుల్లి ముద్ద, తగినంత ఉప్పు వేసి కలిపి కొద్దిసేపు వేయించాలి. తర్వాత జీలకర్ర పొడి, మెంతిపొడి, చింతపండు పులుసు వేసి బాగా కలిపి మూతపెట్టి ఉడికించాలి. ముక్కలు మసాలా ఉడికి నూనె తేలగానే స్టవ్ ఆఫ్ చేసి పొడి సీసాలో భద్రపరచుకోవాలి.