Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా వైరస్ రకరకాల రూపాలు మార్చుకుంటుంది. ప్రస్తుతం వస్తున్న కొత్త వేరియంట్‌ని 'డెల్టా వేరియంట్' అని పేరు పెట్టారు. కరోనా వైరస్ మానవులపై దాడి చెయ్యడమేమో గానీ చాలా మంది సైంటిస్టులు అయిపోయారు. ప్రతివారూ పిల్లలకు ఎలాంటి ఫుడ్ పెట్టాలి, కరోనా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని సామాజిక మాధ్యమాల్లో మాట్లాడుతున్నారు. కానీ వారికి ఆ సబ్జెక్టు గురించి మాట్లాడటానికి ఎటువంటి అర్హతలు, చదువులు గానీ లేవు. అందువలన ప్రజలు తగిన జాగ్రత్తల్లో ఉండాలి. సామాజిక మాధ్యమాల్లో ధర్డ్‌వేవ్‌లో ''ఫలానా ఆహారం తీసుకుంటే కరోనా రాదు, ఫలానా జాగ్రత్తలు తీసుకుంటే కరోనా రాదు'' అంటూ చెప్పే విషయాలను ప్రామాణికత ఆధారంగా నిర్ధారించుకోవాలి. వారు ఆ మాటలు చెప్పటానికి అర్హులా కాదు ఆలోచించాలి. ఎటువంటి అర్హతలు లేని వారిని టీవీల్లో కూడా ఇంటర్వ్యూలు ఇప్పిస్తే ప్రజల పరిస్థితి ఏమిటి? డాక్టర్లు, సైంటిస్టులు చెప్పినవి మాత్రమే వినాలి. ధర్డ్‌వేవ్‌లో పిల్లలని వెతికి మరీ కరోనా వైరస్ దాడి చేస్తుందనే ప్రచారాలు నమ్మద్దు. పెద్దవాళ్ళకు వాక్సిన్లు ఇస్తున్నారు కాబట్టి పిల్లలకు సోకే అవకాశముంది అనే ఆలోచన చేస్తున్నారు గానీ పిల్లలనే టార్గెట్ చేస్తుందని కాదు.
ఇంజక్షన్ సీసాల మూతలతో...
పిల్లలకు వేసే ఇంజక్షన్ల బుడ్లుకు ప్లాస్టిక్ మూతలు ఉంటాయి. ఆ మూతలు తీసివేశాకే సిరెంజి నీడిల్ గుచ్చేందుకు వీలవుతుంది. తర్వాత ప్లాస్టిక్ మూతలు డస్ట్‌బిన్‌లోకే. నేను ఈ మూతల్ని సేకరించి ఎన్నో బొమ్మలు చేస్తున్నాను. ఇంతకు ముందు ఈ ప్లాస్టిక్ మూతల స్థానంలో అల్యూమినియం రేకులు ఉండేవి. ఆ రేకు తీసేసి ఇంజక్షన్ చేస్తారు. ఆ రేకులు బొట్టు బిళ్ళంత సైజులో ఉంటాయి. వాటిని సేకరించడం చాలా కష్టంగా ఉండేది. ప్రస్తుతం ఈరోజు ప్లాస్టిక్ మూతలతో బాతును తయారు చేశాను. బాతు నీటిలో జీవనం సాగించే ఒక పక్షి. ఇది 'ఎనాటి డే' కుటుంబానికి చెందిన పక్షి. చిన్నతనంలో అందరూ 'బంగారు బాతుగుడ్డు' కథను చదివే ఉంటారు. దురాశతో మనిషి బంగారు గుడ్లు పెట్టే బాతును కోసుకుని రోధించిన కథ చాలా నీతిని తెలుపుతుంది. నేను ఇంజక్షన్ల మూతలలో ఎరుపు, బులుగు, లేత ఆకుపచ్చ, వంగరంగు, నారింజ రంగుల మూతలతో చక్కని బాతును తయారు చేశాను. ఈ బాతులు హంసల కన్నా ఆకారంలో చిన్నవిగా ఉంటాయి. ఇవి నీటి పక్షులు. ఇవి ఉప్పు నీటిలోనూ, మంచి నీటిలోనూ జీవించగలిగే పక్షులు. మామూలు బాతులు, అడవి బాతులు, హంసలు అన్నీ ఒక గ్రూపుకు చెందినవే. కానీ వేరు వేరు ఉప కుటుంబాలకు చెందినటువంటివి.
ఆలుగడ్డలతో...
ఇంట్లో ఉన్న ఆలుగడ్డలతో ఒక బాతును తయారు చేశాను. ఈరోజు అన్నీ బాతు బొమ్మల్ని చేస్తున్నాను. వివిధ రకాల వస్తువులతో బాతుల్ని తయారు చేయాలనుకున్నాను. తద్వారా బాతుల గురించి బోలెడు విషయాలు చర్చించుకోవచ్చు. బాతుల నడకను అందరూ మెచ్చుకుంటారు. అందుకే 'బుడిబుడి నడకల బాతు' అంటారు. పసివాళ్ళు నడక నేర్చుకునే సమయంలో వేసే అడుగులను బుడిబుడి నడకలు అంటారు. బాతుల కాలి వేళ్ళ మధ్య ఒక వల లాంటి చర్మం ఉంటుంది. దీనిని అంగుళ్యాంతర జాలము అంటారు. దీని వలననే బాతులు నీటిలో జీవించగలవు. రెండు ఆలుగడ్డల్ని తీసుకొని ఒకటి తలగా, మరొకటి శరీరంగా మార్చుకోవాలి. నేను శరీరానికి తీసుకున్న ఆలుగడ్డకు తోలు తీసేసి దానిపై క్యారెట్ తోలును పరిచాను. క్యారెట్ తోలును పొడవుగా తీసి ఆలుగడ్డపై పెట్టాను. నీళ్ళతో తడిపి పెట్టగానే అతుక్కు పోయింది. సన్నగా ఉన్న క్యారెట్ ముక్కను తీసుకొని దీనికి ముక్కుగా గుచ్చాను. మిరాయలతో కళ్ళు పెట్టాను. వంకర తిరిగిన పచ్చిమిర్చిని తోకగా పెట్టాను. ఇంకొంచెం క్యారెట్‌ను పలుచగా కోసి చివర్న దుంప జాతికి చెందిన కూరగాయ. దీనికి బంగాళా దుంప, ఉర్లగడ్డ అని కూడా పిలుస్తారు. 17వ శతాబ్దం వరకు దక్షిణ అమెరికా ఖండానికి తప్ప ఆలుగడ్డలు ప్రపంచానికి తెలియదు. మొత్తం పంటలలో ఆలుగడ్డలు ప్రపంచంలో నాలుగవ స్థానాన్ని ఆక్రమించాయి.
రబ్బరు బ్యాండ్లతో...
చిన్న చిన్న రబ్బరు బ్యాండ్లను డబ్బుల కట్టలకు పెడుతుంటారు. స్వీటుబాక్సులకు, షాపుల్లో కొనే అనేక రకాల వస్తువులకు రబ్బరు బ్యాండ్లను వేస్తూ ఉంటాయి. ఇవి ఎరుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగులలో దొరుకుతాయి. ఈ రబ్బర్లను ఉపయోగించి నేను కొన్ని బొమ్మలు చేశాను. ఈరోజు బాతును కూడా చేశాను. రబ్బర్ల బాతు భలే అందంగా ఉంది. ఈ బొమ్మలో నేను పూర్తిగా ఎర్రరంగు రబ్బర్లనే వాడాను. ఇదంతా ఒక తెల్లని డ్రాయింగ్ షీటుపై అతికించాను. రబ్బర్లలో కొన్ని సాగిపోయి పొడుగ్గా ఉంటాయి. అటు వంటిదాన్ని తీసుకొని ముక్కుగా అమర్చాను. అలాగే బాతుకుండే చిన్నతోకను కూడా పెట్టాను. బాతుకు కాళ్ళు అమర్చాను. ఎర్రరంగు బాతు తయారయింది. ఈ రబ్బర్ బ్యాండ్లలోపల నేను ఎర్ర రంగు పెన్నుతో కళజాలం ఉన్నట్టుగా డిజైను వేశాను. కణాలు, కణజాలం వెయ్యటంతో బాతుబొమ్మ చక్కగా వచ్చింది. బాతుల్లో ఎన్నో జాతులు ఉన్నాయి. మల్లార్ట్ బాతు, కాన్వస్ బ్యాక్ బాతు, మార్బర్ డక్ వంటివి ప్రధానంగా కనిపిస్తాయి.
చెట్ల ఆకులతో...
హరితహారం పేరుతో రోడ్లకిరువైపులా ఎన్నో చెట్లను నాటుతున్నారు. వాటిలో కొన్ని పూలచెట్లున్నాయి. కొన్ని మామూలు చెట్లున్నాయి. మా ఇంటి ముందు గేటు పక్కనే ఒక చెట్టు గుబురుగా పెరిగింది. ఈ చెట్టుకు పువ్వులేమీ పూయలేదు. కానీ ఆకులు హృదయాకారంలో ముచ్చటగా ఉంటాయి. ఈ ఆకులు లేతగా ఉన్నపుడు లేత ఆకుపచ్చ రంగులోనూ, ఆ తర్వాత ముదురు ఆకుపచ్చ రంగుకూ మారతాయి. ఈ ఆకుల్ని కోసుకొచ్చి ఒక బాతును తయారు చేశాను. బాతులు సాధారణంగా మూడు ప్రధాన సమూహాలుగా విభజింపబడతాయి. ఒకటి డబ్లింగ్ బాతులు, రెండు డైవింగ్ బాతులు, మూడు పెర్చింగ్ జాతులు. డబ్లింగ్ బాతుల్లో మల్లార్ట్ బాతు ఒక విలక్షణమైన బాతు.
పల్లీకాయలతో...
ఇంట్లోకి తెచ్చిన పల్లీకాయలతో ఒక బాతును చేశాను. నేల పండే పల్లికాయలతో నీళ్ళలో ఉండే పక్షిని తయారు చేశాను. గుడ్ల కోసం బాతుల్ని కూడా పెంచుతారు. అమెరికన్ పౌల్ట్రీ అసోసియేషన్ జాతుల్లో 17 రకాల పెంపుడు జాతుల్ని గుర్తించారు. వైట్ పెకిన్ బాతులు మాంసానికి, గుడ్ల ఉత్పత్తి కోసం ఎక్కువగా పెంచుతారు. బాతు ఈకలు కూడా ప్రాధాన్యం కలిగినటువంటివి. దీని శాస్త్రీయ నామం ''బూసెఫాలా ఆల్బియోలా'' అంటారు. వీటిలో చాలా చిన్న బాతు ''కాల్ డక్''. దీని బరువు ఒక కేజీ కన్నా తక్కువ బరువే ఉంటుంది. ఆహారం కొరకు, ఆటల కొరకు అడవి బాతులు ఎక్కువగా ఉపయోగపడతాయి. మగ బాతుల్ని 'డ్రేక్' అనీ, ఆడ బాతుల్ని 'డక్' అనీ అంటారు. ఇవి నీటి మొక్కల్ని, గడ్డి పరకల్ని, క్రిములు, చిన్న మలస్క్లనూ తింటాయి. ఇవీ గూళ్ళను కట్టుకుంటాయి. సంవత్సరానికి ఒకసారి గుడ్లను పెడతాయి.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్