Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇద్దరూ ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. పెండ్లి విషయంలో ఇరువైపుల పెద్దలను ఎదిరించారు. సంవత్సరం పాటు ఎంతో సంతోషంగా గడిపారు. ఒకరికి ఒకరుగా బతికారు. తర్వాత వారి అన్యోన్య దాంపత్యంలో కల్లోలం చెలరేగింది. అనుమానం వారిద్దరి మధ్య దూరాన్ని పెంచింది. చిలికి చిలికి గాలివానై ఆది పెను తుఫానుగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లోనే ఆమె తన అక్కను తీసుకొని ఐద్వా లీగల్ సెల్‌కు వచ్చింది. తన సమస్యను సభ్యులకు ఇలా చెప్పుకొచ్చింది...
''నా పేరు రాధిక. నా భర్త పేరు రాజేష్. మాది ప్రేమ వివాహం. మా పెండ్లి జరిగి ఎనిమిది సంవత్సరాలు. తను రియల్ఎస్టేట్ బిజినెస్ చేస్తాడు. పెద్దలను ఎదిరించి పెండ్లి చేసుకున్నాం. ఇప్పుడు మాకు ముగ్గురు పిల్లలు. నా భర్తకు నాపై అనుమానం. తాగొచ్చి విపరీతంగా కొడతాడు. ఎవరితో పడితే వారితో సంబంధాలు అంటగడతాడు. అప్పట్లో అత్తగారింట్లో అందరం కలిసే వుండేవాళ్ళం. ఇంటి పక్క వారితో మాట్లాడినా అనుమానిస్తాడు.
ఎప్పుడూ నేను తనతోనే ఉండాలంటాడు. ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత ఇది ఎలా సాధ్యం. పిల్లలు లేకుండా బయటకు వెళదామంటాడు. పిల్లల్ని ప్రేమగా చూసుకోడు. వాళ్ళను కూడా కొడతాడు. ఓసారి సెలవులకు మా ఇంటికి మా ఆడపడుచు కూతురు వచ్చింది. మా పాప, ఆ పాప కొట్టుకున్నారు. నేను ఇద్దరినీ మందలించాను. దాంతో ఆయన ''నా మేనకోడలినే తిడతావా..?'' అని పిల్లల ముందే నన్ను విపరీతంగా కొట్టాడు. ఆయన కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక పిల్లల్ని తీసుకొని ఆ రాత్రి అక్కవాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. ఆయన దగ్గరకు వెళ్ళాలంటేనే భయంగా ఉంది. మీరే నాకు న్యాయం చేయాలి. నా భర్త తాగుడు మాన్పించాలి. ఆయన తాగితేనే ఇలా ప్రవర్తిస్తాడు. తాగకపోతే చాలా మంచిగా వుంటాడు'' అని చెప్పి తన మాటలు ముగించింది.
వచ్చే వారం రాజేష్‌ను రమ్మని లీగల్‌సెల్ సభ్యులు లెటర్ పంపారు. చెప్పిన సమయానికి రాజేష్ వచ్చాడు. సభ్యులు రాజేష్‌ను కూర్చోబెట్టి సమస్య ఏంటని అడిగారు.
రాజేష్ మాట్లాడుతూ ''మేడమ్, నాకు ప్రశాంతంగా వుండటం ఇష్టం. కాని తను ప్రతి విషయానికి పెద్ద పెద్దగా అరుస్తుంది. ఆమెపై వాళ్ళ అక్కల ప్రభావం చాలావుంది. నన్ను వాళ్ళ బావలతో పోల్చి మాట్లాడుతుంది. పైగా మా అన్నయ్య గురించి నా దగ్గర ఎక్కవగా ప్రస్తావిస్తుంది. తన ప్రవర్తన నాకు నచ్చడం లేదు. అందుకే మా అమ్మ వాళ్ళ దగ్గర నుండి వచ్చేసి వేరుకాపురం పెట్టాము. వేరుపడిన తర్వాత కూడా చుట్టు పక్కల వారితో అలాగే ప్రవర్తిస్తుంది. ఎంత చెప్పినా నా మాట వినిపించుకోదు. ప్రతి విషయంలో నన్ను రెచ్చ గొడుతుంది. నాకు నచ్చని పనులే చేస్తుంది. నన్ను తక్కువ చేసి మాట్లాడుతుంది. తన మాటతీరు మారాలి' అంటూ రాజేష్ చెప్పుకొచ్చాడు.
రాజేష్ చెప్పినవన్నీ విన్న సభ్యులు అతనితో ''నువ్వు నీ భార్యను అనుమానిస్తున్నావు. అందుకే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. మీ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రేమ వుంది. కాని మీలో వున్న అనుమానం, కోపం, ద్వేషం వల్ల ఆ ప్రేమ కనిపించడం లేదు. నువ్వు ముందు తాగడం మానుకోవాలి. అప్పుడు మీ సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. మెల్లమెల్లగా తాడగం తగ్గించుకో. భార్యను, పిల్లల్ని కొట్టడం మానుకో. నీ పిల్లలు తండ్రి ప్రేమను కోల్పోతున్నారు.
నువ్వు రాధికలో మార్పు రావాలని అడిగావు. చాలా మంచి విషయం. అలాగే రాధిక కూడా నువ్వు మారాలని కోరుకుంటుంది. ముందు మీరు మీ పిల్లల గురించి ఆలోచించాలి. కేవలం నీ సుఖాలు, సంతోషాలు చూసుకుంటే సరిపోదు. మీరు పిల్లల ముందు కొట్టుకుంటూ, తిట్టుకుంటూ వుంటే వాళ్ళ మనసులో మీ గురించి ఎలాంటి అభిప్రాయం వుంటుంది. మీరిద్దరూ చదువుకున్నవారు. ఒక్కసారి పిల్లల గురించి ఆలోచించండి. ఇలాంటి హింసాపూరిత వాతావరణంలో పెరిగిన పిల్లలు తర్వాత సమాజంలో క్రూరంగా తయారవుతారు. ఎప్పుడో ఏదో ఓ సంఘటన జరిగిందని భార్యను పదే పదే అనుమానించడం తప్పు.
ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. మీరు ఎంత ప్రేమగా, అన్యోన్యంగా ఉంటే సమాజంలో ప్రేమ వివాహాల పట్ల అంత గౌరవం ఉంటుంది. అందుకే ముందు మీరు ఒకరినొకరు అర్థం చేసుకోండి. ఒకరినొకరు ప్రేమించుకోండి. మనసు విప్పి మాట్లాడుకోండి. ఎవరిలో ఎలాంటి మార్పు కోరుకుంటున్నారో సామరస్యంగా మాట్లాడుకోండి. ఇలా చేస్తే మీ కుటుంబ సభ్యుల్లో కూడా మీపై గౌరవం పెరుగుతుంది. చుట్టుపక్కల వారు కూడా మీతో మంచిగా వుంటారు'' అని సభ్యులు చెప్పారు.
సభ్యులు చెప్పిన దానికి సరే అన్న రాజేష్, రాధికలో కూడా కచ్చితంగా మార్పు వస్తేనే తను కూడా మారగలనని అన్నాడు. ఆమెతో కూడా మాట్లాడతామని రాజేష్‌ను బయటకు వెళ్ళమని చెప్పి సభ్యులు రాధికను పిలిచి మాట్లాడారు.
''నువ్వు నీ భర్త కావాలనుకుంటున్నావు. కాబట్టి నువ్వు కూడా అతన్ని రెచ్చగొట్టడం మానుకో. మీ అక్కవాళ్ళ భర్తలతో నీ భర్తను పోల్చుకోవద్దు. అది నీకే అవమానం. భర్తను నిర్లక్ష్యం చేయకు. మీ ఇద్దరి మధ్య సమస్యకు కారణమైన తాగుడు మానుకోమని అతనికి గట్టిగానే చెప్పాం. నువ్వు కూడా అతనికి ఇష్టం లేని పనులు చేయొద్దు. కొన్ని రోజులు మీ అక్కవాళ్ళతో మాట్లాడకపోయినా పర్వాలేదు. ముందు నీ సంసారం గురించి ఆలోచించు.
మనం పురుషాధిక్య సమాజంలో వున్నాం. ఆ భావజాలంతో పెరిగినవారు ఇలాగే తయారవుతారు. చాలామంది మగవారు ఇంట్లో తమ మాటే నెగ్గాలని అనుకుంటారు. వినకపోతే కొట్టి వారి అక్కసు తీర్చుకుంటారు. భర్త నుండి విడిపోయి నువ్వు ముగ్గురు పిల్లలతో పుట్టింట్లో ఎన్ని రోజులు వుండగలవు. పైగా ఇలా పుట్టింట్లో వుంటే నీ భర్తకు నువ్వే పూర్తి స్వేచ్ఛనిచ్చిన దానివవుతావు. చుట్టూవున్న సమాజాన్ని అర్థం చేసుకో. నీ భర్తతో లౌక్యం తెలిసి నడుచుకో. అతనితో మంచిగా వుంటూనే మార్చుకో. మేము ఇక్కడ మాట్లాడినంత మాత్రాన అతనిలో మార్పు ఒక్కసారిగా రాదు. నీ ప్రవర్తన కూడా చాలా ముఖ్యం. పదే పదే పాత విషయాలు గుర్తు చేసుకోవద్దు. నీకు అతనితో ఎలాంటి సమస్య వచ్చినా మాకు చెప్పు. మార్పు వచ్చేవరకు మేము అతనితో మాట్లాడతాం. నువ్వు మాత్రం పెద్ద పెద్దగా అరిచి అతనితో గొడవపెట్టుకోకు'' అని చెప్పారు. రాధిక సభ్యులు చెప్పిన ప్రకారమే చేస్తానంది.
తర్వాత సభ్యులు ఇద్దరినీ కూర్చోబెట్టి ''మీ ఇద్దరికీ ఏ చిన్న సమస్య వచ్చినా మాదగ్గరకు రండి. అంతేగాని కొట్టుకోవద్దు. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడటం మానండి. ఇప్పటి వరకూ ఇద్దరూ కొన్ని పొరపాట్లు చేశారు. నేటి నుండి కొత్త జీవితాన్ని ప్రారంభించండి. సమస్యలను అర్థం చేసుకొని సర్దుకుపోండి. ఒకరిపై ఒకరు నమ్మకం పెంచుకోండి. అప్పుడే మీ సంసారం హాయిగా వుంటుంది. ఇద్దరూ కొన్ని వారాల పాటు లీగల్ సెల్‌కు వచ్చి ఎలా వుంటున్నారో చెప్పండి'' అన్నారు.
ఇద్దరూ సభ్యులు చెప్పిన ప్రకారమే చేస్తామని చెప్పి రిజిస్టర్లో సంతకం చేసి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ప్రతి వారం ఇద్దరూ కలిసి ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చి ఎలా ఉన్నారో చెప్పి సంతకాలు చేసి వెళుతున్నారు.
- సలీమ