Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాన్న పెరు మహేందర్ సింగ్ బిస్ట్, ఫారెస్ట్ ఆఫీసర్‌గా చేసేవారు.అమ్మ శశి బిస్ట్, టీచర్‌గా చేసేవారు. మేం ఇద్దరం ఆడపిల్లలం. నాకొక చెల్లి ఉంది. మాది ఉత్తరాఖండ్. నాన్నతో నేను చాలా సన్నిహితంగా ఉండేదాన్ని. నేను ఇంట్లో తొలి సంతానం అవటం వల్లనేమో నాన్నతో బాగా అనుబంధం ఉండేది. అమ్మనాన్నలు ఏనాడు కొడుకులు లేరు అని బాధపడలేదు. ఆడా, మగా అనే భేదభావం ఉండేది కాదు. ఎంత స్వేచ్ఛను ఇచ్చినా కూడా నాన్న ఓ కండిషన్ పెట్టేవారు. అది తప్పకుండా పాటించాల్సిందే. అదేమిటంటే సాయంత్రం ఇంటికి త్వరగా వచ్చేయాలి. నువ్వు ఏమైనా అడుకో, ఎంత అల్లరి అయిన చేయ్యి, కానీ ఇంటికి మాత్రం ఆయన పెట్టిన సమయానికి వచ్చేయాలి. గోడలు ఎక్కినా, సైకిల్ తొక్కినా, ఆటలు ఆడినా, ఏమి అనేవారు కాదు. ఆడపిల్లలు వంటపనులు, ఇంటిపనులు, బట్టలు వుతకడం, కుట్లు అల్లికలు ఇలా మొదలైనవి నేర్చుకోండి అంటూ ఏనాడు ఒత్తిడి చేయలేదు. మీ మనసు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడకి వెళ్ళండి. ఏ పని చేసినా మనసు పెట్టి, శ్రద్ధగా చేయండి అనేవారు.
21 ఏండ్ల వయసులో పెండ్లి సంబంధాలు రావటం మొదలయ్యాయి. నేను ఇప్పుడే పెండ్లి చేసుకోను అని కొంచం గట్టిగానే నాన్నతో చెప్పటంతో చాలా బాధపడ్డారు. రెండు నెలలు మేము ఇద్దరం మాట్లాడుకోలేదు. కానీ తర్వాత ఆయనే మనసు మార్చుకుని సరే నీకు నాలుగేండ్లు సమయం ఇస్తున్నాను. నువ్వు ఏమి కావాలనుకున్నా అయ్యి చూపించు అన్నారు. చిన్నప్పటి నుంచి నాన్నను యూనిఫామ్‌లో చూస్తూ పెరగడంవలన నాకు తెలీకుండానే దానిపై ఇష్టం ఏర్పడింది. ఐపీఎస్ కావలన్నది నా లక్ష్యం. నీలో ధైర్యం ఉండి, ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలను అనే నమ్మకం నీకుంటే ఐపీఎస్కి వెళ్ళు అన్నారు. నా లక్ష్యానికి నాన్న ఎప్పుడూ అడ్డు గోడగా నిలబడలేదు. ఓ మూలస్థంభంలా నా వెనక నిల్చున్నారు. నాన్న ఎప్పుడు చెప్పేది ఒక్కటే 'ఏది చేసినా దాంట్లో ద బెస్ట్ అవ్వండి' అని.
నాన్న మమ్మల్ని ఎప్పుడు ఆర్ధిక స్వతంత్రులుగా ఉండమనేవారు. ఎవరి దయా దాక్షిణ్యాల మీద, ఎవరి పైనా ఆధారపడకుండా బతకమని చెప్పేవారు. నాన్నతో అన్ని విషయాలు చర్చించేదాన్ని. ఒక్క అబ్బాయిల విషయం తప్ప(నవ్వు) నాది ప్రేమ వివాహం. మా వారు విశ్వజిత్ కూడా ఐపీఎస్. పెండ్లి అనేది ఇద్దరి మనుషుల మధ్య స్నేహం, ప్రేమ, ఒకరికొకరు తోడు, నీడ, అండగా ఉండే భాగస్వామి అయ్యుండాలి అనేవారు. నా ప్రేమ విషయం చెప్పినప్పుడు ఆ అబ్బాయి మంచివాడు అయ్యుండి, విలువలకు, నిజాయితీకి ప్రాధాన్యం ఇచ్చేవాడు అయ్యుంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదని అన్నారు. ఒకసారి తీసుకొచ్చి పరిచయం చేయమన్నారు. మా ఇంట్లో కుల, మత పట్టింపులు లేవు. అహర్నిశలు శ్రమించి, నా తప్పటడుగులును సరి చేసి, నా జీవితానికి పసిడి బాటలు వేసి, నా గమ్యాన్ని నాకు పరిచయం చేసిన నాన్న.. నీకు ప్రేమతో వందనం. ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నానంటే నాన్న ఇచ్చిన ప్రోత్సహం. నాన్నా ఏమి ఇచ్చి నీ రుణం తీర్చుకోగలను?
- అభిలాష బిస్ట్, ఐపీఎస్