Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమ్మ పేరు జానకమ్మ, నాన్న పేరు మల్లవరపు సుందరేసం. ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. మేమిద్దరం ఆడపిల్లలం వారికి. నాకు ఒక అక్క. మాకు అమ్మ తరఫున కానీ, నాన్న తరఫున కానీ బంధువులు అంటూ ఎవరూ లేకపోవడం వలన మాకు మేమే నలుగురం కలిసి ఉండేవాళ్ళం. ఆటలు, పాటలు, ఏదైనా సమస్య వచ్చిన్నా నిర్ణయాలు తీసుకోవాన్నా మేం నలుగురమే. మా తల్లి తండ్రులు ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు మద్రాస్‌లో ఉండేవారు. రాష్ట్రం ఏర్పడ్డాక కర్నూలు, ఆ తర్వాత హైద్రాబాద్‌కి వచ్చేసారు. మద్రాస్‌లో ఉండటం వలన అమ్మ సంగీతానికి, నాట్యానికి బాగా ఆకర్షితురాలైంది. ఆడపిల్లలు పుడితే కళల్లో వారిని రాణించేలా చేయాలని ఇద్దరూ అనుకునేవారు.
నాన్న మంచి గాయకులు. సంగీతం ఏమి నేర్చుకోకపోయిన అద్భుతంగా పాడేవారు. కె.ఎల్. సైగల్ వీరాభిమాని మా నాన్న. చిన్నపుడు నాన్నా పాటలు, రేడియో ఈ రెండే మాకు ఎంటర్టైన్మెంట్. నాన్న మా ఇష్టాలను తమ ఇష్టాలుగా చేసుకున్నారు తప్ప, తన ఇష్టాలను మాపై ఎప్పుడు రుద్దలేదు. మా చిన్నప్పుడు మేము ఎర్రమంజిల్ కాలనీలో ఉండేవాళ్ళం. ఆ కాలనీలో ఎందరో కళా కారులు, సాహితీవేత్తలు ఉండేవారు. ఎప్పుడూ ఏవో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. ఏ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినా నాన్న మమ్మల్ని తీసుకుని వెళ్తుండేవారు. మాకు బందువర్గం లేనందువలన ఎక్కడికి వెళ్లాలన్నా ఇటువంటి కార్యక్రమాలకి తీసుకుని వెళ్లేవారు. మంగళంపల్లి బాలమురలి గారు, ఎం.ఎస్.సుబ్బలక్మి గారి కచేరీలకు తప్పనిసరిగా తీసుకుని వెళ్లేవారు. ఆ సాంస్కృతిక కార్యక్రమాలు నాపై బాగా ప్రభావం చూపాయి.
నాన్న మాకు మంచి స్నేహితుడు. చాలా ప్రోత్సహించే వారు. నా ఎదుగుదలకు ఓ మూలస్థంభం. నాన్నతో ఏ విషయాలు అయిన నిర్భయంగా, నిస్సంకోచంగా మాట్లాడేవాళ్ళం, చర్చించేవాళ్ళం. నాన్న మృదుస్వభావి, సహృదయులు. మంచి నడవడి కలిగిన వ్యక్తి. అందరిని కలుపుకుని వెళ్లిపోయేవారు. నేను నా 4వ ఏటనే ఆరగ్రేటం చేసాను. 15వ ఏట కథలు రాయటం మొదలు పెట్టా. నా ప్రతి కథను నాన్న జాగ్రత్త చేసి పెట్టేవారు. నా చదువుకు, నాట్యానికి సంబంధించిన వాటి గురించి పత్రికలలో వచ్చిన వాటిని జాగ్రత్తగా కత్తిరించి ఫైల్ చేసిపెట్టేవారు. నేను పేరు సంపాదించుకోవడం మొదలు పెట్టాక నాన్న చాలా గర్వంగా ఫీల్ అయ్యేవారు. నా ప్రోగ్రాం ఉన్న రోజున తొందరగా తయారై మొదటి వరసలో కూర్చుని చూడాలనే కోరిక బలంగా ఉండేది. పక్క వారు చప్పట్లు కొడుతూ ఉంటే ఆ చప్పట్లు నా పిల్లలకు కొడుతున్నారు అని ఎంతో గర్వపడేవారు. మా కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఈ రోజున ఈ స్థాయికి ఎదిగాను అంటే నాన్న త్యాగం, కష్టం వల్లనే. నా ఎదుగుదల గురించి అందరికి చెప్పుకుని సంతోష పడేవారు.
2001లో ప్రతిష్టాత్మకమైన హంస పురస్కారాన్ని ప్రకటించారు. ఇది విని ఆయన ఎంతగానో సంతోషించారు. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 5న రవీంద్రభారతిలో నిర్వహిస్తున్నారు అనగానే 'నువ్వు ఆ పురస్కారం అందుకోవడం నేను దగ్గరుండి చూడాలి. కనుక స్టేజి పక్కనే కోర్చోబెట్టు' అన్నారు. దురదృష్టకరం అత్యంత విషదాకరం ఏమిటంటే నాన్న 4వ తేదీన లోకాన్ని విడిచిపెట్టారు. నా పరిస్థితి ఏమని వివరించను. ఒక పక్క సంతోషం, మరోపక్క విషాదం. 5వ తేదీన పురస్కారం అందుకోవడానికి ముందు నా నాట్య ప్రదర్శన ఉంది. ఎటు పాలుపోని పరిస్తితి. నాన్న అంతిమ సంస్కారాలు అవగానే మనసులోని బాధని, విషాదాన్ని దిగమింగుకుని నాట్యప్రదర్శన ఇచ్చి పురస్కారాన్ని అందుకున్నా. నాకు ఇప్పటికి బాధ కలిగించే విషయం నేను పురస్కారం అందుకోవడం నాన్న చూడలేకపోయారనే. ఆ విషయం నన్ను తొలిచేస్తూనే ఉంటుంది.
- డా.మద్దాలి ఉషా గాయాత్రి
ప్రముఖ నాట్యకారిని