Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాన్న పేరు బాల సుందర రావు, డాక్టర్. అమ్మ మధుర మీనాక్షి గృహిణి. నేను వారికి ఏకైక కుమార్తెను. అమ్మ నా మూడు సంవత్సరాల వయసులో లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. అప్పటి నుండి నేను బామ్మ దగ్గర అతి గారాబంగా పెరిగాను. ఆ గారాబం వలన నేను పాడైపోతాను అనే భయంతో నాకు అమ్మ కూడా నాన్నే అయ్యారూ. నాన్న నాకు తండ్రి, స్నేహితుడు, గైడ్, ఫిలాసఫర్ అన్నీ ఆయనే. నాన్న భౌతికంగా దూరం అయినప్పటికీ... నా హృదయంలో నిత్యం జ్ఞాపకంగా, హెచ్చరికగా, అనుభూతిగా, ఆహ్లాదంగా ఆప్యాయంగా, అనునిత్యం నన్ను గైడ్ చేసే గార్డింగ్ ఏంజెల్‌గా.. ఏమని చెప్పను? ఎంతని చెప్పగలను? ఎలా చెప్పగలను? అనుభవం, అనుభూతి అక్షరాలకు అందనంత తీపిదనం మా నాన్న.
మా నాన్న మద్రాస్ రాయపేట హాస్పిటల్ అసిస్టెంట్ సర్జన్‌గా పని చేసేవారు. టీబీ అప్పట్లో ప్రాణాంతకమైన వ్యాధి. దేశ అన్ని మూలల నుంచి టీబీ పేషంట్లు నాన్న దగ్గరకు వచ్చేవారు. కానీ ఏనాడు ఎవరి దగ్గరా నా ఫీజు ఇంత.. ఇవ్వండి అని అడిగేవారు కాదు. నా పెండ్లి చంద్రమోహన్ గారితో జరిగినప్పుడు నాన్న నాకు చెప్పిన మాటలు, కళాకారులతో జీవితం కష్టం. కమర్షియల్‌గా సక్సెస్ అయితే మరింత కష్టం. అతడిలోని కళాకారుడిని కాపాడుకో అన్నారు. ఇది మా నాన్న హెచ్చరికతో కూడిన దీవెనలు. బిడ్డగా నేను ఆయనకు సన్నిహితురాలినైన స్నేహితురాలిని. నా చేత ఆయన చదివించిన పుస్తకాలు, నాతో చేసిన పాత్ర విశ్లేషణలు, మనిషి మానసిక అనుభూతులు. వీటి అన్నింటి వలననేమో నేను ఈ కొద్దిపాటి అక్షరాల వెన్నెలలు ఆరుబయట నేర్చుకున్నాను. అద్భుతమైన విలువలు నేర్పించారు. ఇప్పటికి కూడా ఆయన నా వెంటే ఉన్నారని భావిస్తాను. నన్ను అనుక్షణం కనిపెట్టుకొని ఉండి జీవితంలో ముందుకు నడిపిస్తున్నది మా నాన్న అని నమ్ముతాను. ఆయన గురించి చెప్పడానికి పదాలు రావటం లేదు.
- జలందర, ప్రముఖ రచయిత్రి