Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆర్మాన్ అనే స్వచ్ఛంధ సంస్థ వ్యస్థాపకురాలు, ఛైర్పర్సన్ డాక్టర్ అపర్ణ హెగ్డే.. భారత ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రపంచంలోని ఆరోగ్య కార్యకర్తలకు అతిపెద్ద మొబైల్ ఆధారిత ప్రసూతి సందేశ కార్యక్రమం, శిక్షణా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఈమె అంతర్జాతీయంగా ప్రఖ్యాత యూరోజీనాలజిస్ట్, పరిశోధకురాలు. ఆర్మాన్ సంస్థ తల్లులు, పిల్లల ఆరోగ్యం, ప్రసూతి సమయంలో మహిళలకు వచ్చే అనారోగ్యాలకు చికిత్స చేయడం, మరణాలు రేటు తగ్గించడంపై విశేష కృషి చేస్తుంది. ఆమె చేసిన సేవలకుగాను 2021 ఫార్చ్యున్ వరల్డ్‌లో 50 మంది విశిష్ట వ్యక్తులలో ఒకరిగా పేరు పొందారు.
ఆరోగ్య సంరక్షణ, హెల్త్‌టెక్ ఈ రెండో ఆమె ప్రపంచం. కోవిడ్-19 విషకౌగిలిలో ప్రపంచం చిక్కుకున్నప్పుడు డాక్టర్ అపర్ణ నాయకత్వంలో ఆర్మాన్ సంస్థ మహిళలు పిల్లల ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యం ఇస్తూ కొన్ని కీలక కార్యక్రమాలు చేపట్టారు. ఈ ప్రయత్నమే డాక్టర్ అపర్ణను 2021 ఫార్చ్యూన్ వరల్డ్‌లో 50 మంది గొప్ప నాయకుల జాబితాలో చేర్చడానికి దారితీసింది. ఈ జాబితాలో ఆమెది 15వ స్థానం. ఇది ప్రపంచవ్యాప్తంగా స్త్రీ, పురుష తేడా లేకుండా వ్యాపారం, ప్రభుత్వం, సేవ, కళల రంగాల నుండి విశేషమైన కృషి చేసిన వారి జాబితాను విడుదల చేస్తుంది.
ఆరోగ్యకర జీవితాన్ని ఇవ్వాలి
''ఈ గౌరవం దక్కడానికి కారణం ఆర్మాన్ తల్లి-పిల్లల ఆరోగ్య సమస్యపై దృష్టి పెట్టడమే. గర్భిణీ స్త్రీలు, తల్లులు, పిల్లలకు ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ సంస్థ స్థాపించబడింది'' అంటున్నారు అపర్ణ. ఈమె ముంబైలోని సియోన్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఈ ఆలోచన మొదలయింది. అక్కడ ఆమె మొదట నివసించేవారు తర్వాత అధ్యాపకురాలయ్యారు.
అట్టడుగు స్థాయిలో...
''విపరీతమైన ఆరోగ్య సమస్యల వల్ల తల్లులు, పిల్లలు తమ ప్రాణాలను ఎలా కోల్పోతున్నారో చాలా దగ్గరగా చూశాను. దీని పరిష్కారం మన చేతుల్లోనే వుంది'' అని అపర్ణ అంటున్నారు. ''నేను యుఎస్‌లో నా వైద్య శిక్షణ పూర్తి చేస్తున్నప్పుడే అర్మాన్ ప్రారంభించబడింది. ప్రపంచాన్ని మార్చాలంటే సమాజంలోకి వెళ్లి అట్టడుగు స్థాయిలో పని ప్రారంభించాల్సిన అవసరం ఉందని అప్పుడే నేను గ్రహించాను. మా లక్ష్యం తల్లి-పిల్లల మరణాలు మరియు అనారోగ్యాలను తగ్గించడమే'' అంటున్నారు ఆమె.
మంచి ఆరోగ్యం కోసం...
గ్రామీణ భారతంలోకి స్మార్ట్ఫోన్లు ప్రవేశించడంతో అర్మాన్ సాంకేతిక పరిజ్ఞానంతో అట్టడుగు వర్గాలకు చేరుకోవడానికి ప్రారంభించింది. లాభాపేక్షలేకుండా ప్రభుత్వ భాగస్వామ్యంతో, అతిపెద్ద మొబైల్ ఆధారిత ప్రసూతి సందేశ కార్యక్రమాన్ని, ప్రపంచంలోని ఆరోగ్య కార్యకర్తలకు అతిపెద్ద మొబైల్ ఆధారిత శిక్షణా కార్యక్రమాన్ని మొదలుపెట్టింది.
స్త్రీని శక్తివంతం చేయడమే
ఇప్పటి వరకు ఆర్మాన్ ఆరోగ్య కార్యక్రమాలు 24 మిలియన్ల మంది మహిళలు, పిల్లలకు చేరుకున్నాయి. దీనికోసం 17 రాష్ట్రాలలో 170,000 మందికి పైగా ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ గురించి అపర్ణ మాట్లాడుతూ ''మా లక్ష్యం ప్రతి స్త్రీని శక్తివంతం చేయడం, ఆరోగ్య సమస్యలను పరిష్కారాలను రూపొందించడం. దీనికోసం అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచడం ద్వారా ప్రతి బిడ్డను ఆరోగ్యంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నాం'' అంటున్నారు.
టెక్ టచ్‌ల కలయిక
ప్రోగ్రామ్ ఐవీఆర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుంది. దీన్ని హ్యాండ్సెట్, ఆడియో, వాయిస్ కాల్ ద్వారా ఉపయోగించవచ్చు. ఈ కోర్సు 33 నెలలు గర్భస్థ శిశువు నుండి రెండేండ్ల పిల్లల వయసు వరకు ఉంటుంది. ''మేము తెలంగాణలో సమగ్రమైన కార్యక్రమాన్ని చేస్తున్నాం. ప్రతి కేడర్ స్థాయికి ప్రోటోకాల్‌లను సృష్టించడమే కాకుండా వారికి శిక్షణ ఇస్తున్నాం. సూపర్ స్పెషలిస్టులు, మెడికల్ ఆఫీసర్లు, నర్సులకు జూమ్ ద్వారా శిక్షణ ఇస్తున్నాం. వీడియోలు, ఇంటరాక్టివ్ క్విజ్‌లతో మల్టీమీడియా కంటెంట్‌తో నేర్చుకునే టెక్నాలజీ త్వరలో తీసుకురాబోతున్నాం. ఇది టెక్, టచ్‌ల కలయిక. ఇది అనుకూలమైన ఫలితాలను ఇచ్చింది. ఆమె జతచేస్తుంది'' అంటున్నారు అపర్ణ.
ఆరోగ్యకరమైన ఫలితాలు
గ్రామీణ మహారాష్ట్రలో యుకేఏఐడీ చేత మద్దతు ఇవ్వబడిన క్లస్టర్ ట్రయల్‌లో, మహిళలకు సమాచారం ఇచ్చినప్పుడు వారు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపడం మాత్రమే కాదు.. వైద్యంపై వారికి అవగాహన కూడా పెరిగింది. ఇది ఆరోగ్యకరమైన ఫలితాలకు దారి తీసింది. మంచి బరువుతో పిల్లలు పుట్టే విధంగా ఇది ఉపయోగపడింది. గతంతో పోలీస్తే 20 శాతం పెరుగుదల ఉంది.
ఉచిత సేవలు అందిస్తూ...
ఆర్మాన్ సుమారు 300,000 మంది గర్భిణీ స్త్రీలు, తల్లులకు చేరుకుంది. అల్ట్రాసౌండ్ కోసం ఎక్కడికి వెళ్ళాలి, అంబులెన్స్ సౌకర్యం ఎలా పొందాలి, పని చేసే ఆసుపత్రుల సమాచారం గురించి ఈ కాలంలో 67,000 మంది మహిళలకు సమాచారం ఇచ్చింది. కరోనా సమయంలో అపర్ణ ముంబైలోని కామా హాస్పిటల్లో కోవిడ్- వార్డ్‌ను ఏర్పాటు చేయడంలో సహాయపడ్డారు. అక్కడ ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. ఇది నిరుపేద మహిళలు, పిల్లలకు సేవలందించిన మాతృ-పిల్లల ఆసుపత్రి.
ఆరోగ్య సంరక్షణకే ప్రాధాన్యం
అపర్ణ ఆలోచనలు ఎప్పుడూ సైన్స్, సేవ పరిశోధనల చుట్టూనే తిరుగుతుంది. ఆమె తన రోజును తెల్లవారుజామున 4.30 గంటలకు ప్రారంభిస్తుంది. కొంత సమయం వ్యాయామం చేసిన తర్వాత, తన పరిశోధన, పఠనం, ఆర్మాన్ కోసం ఏం చేయాలో ఆలోచిస్తారు. కామా హాస్పిటల్లో ఉచితంగా సేవలను అందిస్తూ మధ్యలో సమావేశాలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం తన ప్రైవేట్ ప్రాక్టీస్‌కు వెళతారు. సాయంత్రం మళ్ళీ ఆర్మాన్ కార్యక్రమాల కోసం సమావేశమైతే రాత్రి 11 గంటలకు ముగుస్తుంది. ఇది ఆమె రోజువారి దిన్యచర్య.
అపోహలు తొలగిస్తూ..
టీకాల విషయంలో కూడా ఆమె ఎంతో ప్రచారం చేశారు. టీకాలు ఇవ్వాల్సిన అవసరం గురించి అనేక సార్లు ప్రస్తావించారు. వాటి పట్ల ప్రజల్లో ఉన్న అపోహలపై అవగాహన కల్పించారు. భవిష్యత్తులో ఆమె తల్లీ-పిల్లల ఆరోగ్యం కోసం లోతైన కార్యక్రమాలను రూపొందించాలని చూస్తున్నారు. ప్రతి సంవత్సరం 15 మిలియన్ల మంది మహిళలు వారికి కావల్సిన వైద్య సమాచారాన్ని పొందగలరని ఆమె భావిస్తున్నారు.
- సలీమ