Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుతం అందరం రోగనిరోధక శక్తిని పెంచుకోవడంపై దృష్టి పెట్టాం. తీసుకునే ఆహారంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. గారెలు ఎంతో బలమైన ఆహారం. పైగా వీటిని వంటకాన్ని ఇష్టపడని వారు దాదాపుగా ఉండరు. ఆరోగ్యానికి ఆరోగ్యం.. బలానికి బలం. అందుకే ఉదయం అల్పాహారంగానో.. సాయంత్రం స్నాక్స్‌గానో వీటిని తీసుకోవచ్చు.
మసాలా గారెలు
కావల్సిన పదార్థాలు: మినప పప్పు - అరకేజీ, పచ్చిమిర్చి- 4, అల్లం - కొద్దిగా, కొత్తమీర - కొద్దిగా, కరివేపాకు - కొద్దిగా, మిరియాలు- ఒక చెంచా, వంటసోడ - చిటికెడు, ఉల్లిగడ్డ - 4, ఉప్పు- సరిపడ, జీలకర్ర - ఒక చెంచా, నూనె - తగినంత.
తయారు చేసే విధానం: ముందుగా మినపప్పును నానపెట్టాలి. నానిన పప్పును బాగా కడిగి గారెల కోసం కొంచెం గట్టిగా రుబ్బాలి. తర్వాత అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, మిరియాలపొడి, ఉల్లి తరుగు, ఉప్పు అన్నింటిని కలిపి గ్రైండ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని గారెల పిండిలో వేసి కలపాలి. ఇప్పుడు స్టవ్‌పై ఫ్రైయింగ్ పాన్ పెట్టి నూనె వేసి వేడి చెయ్యాలి. పిండిలో వంటసోడా కలిపి పిండి ముద్దని తీసుకుని కావలసిన సైజులో గారెల్ని కాగుతున్న నూనెలో వెయ్యాలి. బంగారు రంగులోకి రాగానే ప్లేటులోకి తీసుకుని కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోవాలి.
అల్లం గారెలు
కావాల్సిన పదార్థాలు: మినప్పప్పు - 2 కప్పులు, అల్లం ముద్ద - 2 టీస్పూన్లు, పచ్చిమిర్చి - నాలుగు, జీలకర్ర - 2 టీస్పూన్లు, మిరియాలు - అర టీస్పూను, ఎండుకొబ్బరి తురుము - టీస్పూను, ఉప్పు - 2 టీస్పూన్లు, లవంగాలు - రెండు, దాల్చినచెక్క - చిన్న ముక్క, ఉప్పు - తగినంత, నూనె - వేయించడానికి సరిపడా.
తయారుచేసే విధానం: ముందుగా మినప్పప్పుని నానబెట్టుకోవాలి. మినప్పప్పు మినహా మిగిలినవన్నీ వేసి బాగా రుబ్బుకోవాలి. తర్వాత అందులోనే మినప్పప్పు కూడా వేసి రుబ్బాలి. ఇలా రుబ్బుకున్న మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని గారెల మాదిరిగా చేసి మరిగిన నూనెలో వేయించి తీయాలి. అంతే వేడివేడిగా ఘూటుఘూటుగా ఉండే అల్లం గారెలు రెడీ అయినట్టే. ఏ చట్నీతో అయినా ఈ గారెలను లాగించొచ్చు.
అరటికాయ- క్యారెట్ గారెలు
కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరటికాయ (తొక్కతో పాటు)- ఒకటి, బియ్యం పిండి - కప్పు, క్యారెట్ తురుము - కప్పు, ఉల్లిగడ్డ - ఒకటి, వెల్లుల్లి రెబ్బలు - పది, పచ్చిమిర్చి - ఐదు, కొత్తిమీర తురుము - అరకప్పు, ఉప్పు - తగినంత, జీలకర్ర - చెంచా, నూనె - వేయించడానికి సరిపడా.
తయారుచేసే విధానం: ముందుగా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొద్దిగా ఉప్పును మిక్సీలో వేసి పేస్టు సిద్ధం చేసుకోవాలి. తర్వాత ఓ గిన్నెలో ఉడికించిన అరటికాయను తొక్క తీసి ముక్కలుగా కోసుకుని మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో క్యారెట్ తురుము, తగినంత బియ్యం పిండి వేసుకుని కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్టుతో పాటు తగినంత ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు వేసి గారెల పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని గారెల్లా వత్తి కాగిన నూనెలో వేయించి తీస్తే రుచికరమైన అరటికాయ క్యారెట్ గారెలు రెడీ అయినట్టే. సాయంత్రపు స్నాక్స్‌గా వీటిని ఎంజారు చేస్తూ తినవచ్చు. టమాటా సాస్‌తో తింటే మరింత రుచి వీటి సొంతం...
మొక్కజొన్న గారెలు..
కావలసిన పదార్ధాలు: మొక్కజొన్న పొత్తులు - రెండు, ఉల్లిగడ్డ - ఒకటి, మిర్చి - నాలుగు, కొత్తిమీర - ఒక కట్ట (చిన్నది), కరివేపాకు - రెమ్మ, అల్లం - చిన్న ముక్క, జీలకర్ర - ఒక టీ స్పూన్, ఉప్పు- తగినంత, నూనె - సరిపడినంత, శనగపిండి- రెండు టేబుల్ స్పూన్లు, కార్న్ ఫ్లోర్- రెండు టీ స్పూన్లు.
తయారు చేసే విధానం: మొక్కజొన్న పొత్తును ఒలచి పెట్టుకోవాలి. వీటికి తగినంత ఉప్పు, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేప్పుడు నీటిని వాడకూడదు. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమంలో సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, మిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసి కలపాలి. కార్న్‌ఫ్లోర్ జతచేసి మళ్ళీ కలపాలి. ఒక వేళ పొత్తులు లేతగా ఉండి, పిండి పలుచగా అయితే శనగపిండి కలుపుకోవచ్చు. తర్వాత ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న గారెలుగా ఒత్తుకొని నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. అంతే వేడివేడిగా క్రిస్పీగా ఉండే మొక్కజొన్న గారెలు రెడీ అయినట్టే.