Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా మహమ్మారి పట్ల ప్రజల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. వాటిని పెంచిపోషిస్తూ కొంత మంది మేధావులు. టీకాలు తీసుకోవాలా, వద్దా అనే అనుమానంతో, భయంతో ప్రజలు బతుకుతున్నారు. అసలే లాక్డౌన్తో ఇల్లు దాటని ప్రజలు మానసిక వ్యాకులతకు గురవుతున్నారు. దానికి తోడు టీవీల్లో వచ్చే కథనాలు రకరకాల వాదాలను పెంచి పోషిస్తున్నాయి. ఏ జాగ్రత్తలు తీసుకోవాలో, ఎలాంటి ఆహారం తినాలో, పిల్లల్ని ఎలా కట్టడి చేయాలో... ఇలా ఎన్నో సందేహాలతో ప్రజల మనసు సంతులనం కోల్పోతుంది. ఆత్మ విశ్వాసంతో ఈ కష్టాలను దాటవలసి ఉంటుంది. కరోనా అనే కంటికి కనబడని శత్రువుతో పోరాడాలంటే ఆత్మబలం ఎంతో అవసరమని గుర్తించారు. మానసిక ఆరోగ్యం, ఆనందం కోసం మనం చేసే బొమ్మలు కూడా ఉపయోగపడతాయి. కళను ఎంచుకుంటే ఆనందంగా ఉండవచ్చు. అందుకే మనమూ కొన్ని బొమ్మలు తయారుచేద్దాం...
గుల్మోహర్ పూలతో...
''డెలోనిక్స్ రీజియా'' అనే శాస్త్రీయనామం గల గుల్మోహర్ చెట్టు యొక్క పూలతో నేను కోడిని తయారు చేశాను. నేను తీసుకున్న పూలు అన్నీ ఎరుపురంగులో ఉండటం వలన కోడిపుంజును చేశాను. నెమలిని చెయ్యాలని పూలను కోసుకొచ్చాను. ఇందులో పసుపు, ఎరుపు, నారింజ రంగులన్నీ ఉంటాయి. అన్నీ దొరకక కోడిని చేయాల్సి వచ్చింది. గుల్మొహర్ పూలను తురాయి పూలంటారు గానీ ఎక్కువగా కోడి పుంజుల చెట్టు అనే పేరుతోనే పిలుస్తారు. ఈ పూలల్లోని వంపు తిరిగిన కేసరాలు తీసుకొని పిల్లలు ఒకదాని కొకటి పెనవేసి లాగే ఆట ఆడుకుంటారు. ఎవరి పుప్పొడి ముద్ద తెగిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు. ఈ చెట్లను ఎక్కువగా రోడ్డుకిరువైపులా పెంచుతారు. ఆ దారంట వెళ్ళే వాళ్ళకు పూలుచల్లి మరీ ఆహ్వానిస్తుంది. దాని వర్ణాలతో కండ్లను మిరుమిట్లుగొల్పుతుంది.చదువుకునేటపుడు 'ఫాబేసి' కుటుంబానికి ఉదాహరణగా ఈ తురాయి చెట్టులోని భాగాలనే డిసెక్షన్ చేశాం. మాకాలేజిలోని కొమ్మను తుంచి రికార్డుల్లో బొమ్మలు వేశాం. వీటిని అగ్నిపూలు అని కూడా అంటారు. ప్రపంచమంతా వ్యాపించి ఉన్న ఈ చెట్ల పూలు నాలుగు పెద్ద ఆకర్షణ పత్రాలతో ఉంటాయి. ఐదవ రెక్క పైకి వంగి ఉంటుంది. ఆకులు చక్కగా ఒకదాని ఎదురుగా ఒకటి అమర్చినట్టుగా ఉంటాయి. నేను ఈ పూలతో పాటు మొగ్గలు, తొడిమలు, రెమ్మలు అన్నీ వాడి కోడిని తయారుచేశాను. కొక్కొరకో కోడిపుంజు ఎంత అందంగా ఉందో చూడండి.
వడియాలతో...
ఎండాకాలంలో అందరూ వడియాలు పెట్టుకుంటారు. నేనేమో మొన్న వేసవికాలంలో వడియాలు కొనుక్కున్నాను. ఈ వడియాలు కొనుక్కున్కా తినటం కన్నా బొమ్మలు చేయడం ఎక్కువైంది. పైగా అందులో రంగులున్నాయోమో ఏ బొమ్మ చేసినా అందంగా ఉంటోంది. అందుకే వడియాలు వేయించుకు తినడం మానేసి బొమ్మలు చేసి ఫొటోలు తీసుకొని మురిసిపోతున్నాను. ఈరోజు కొక్కరకో కోడి బొమ్మను చేశాను. కోడి తన పిల్లలతో కలిసి ఎంగిలి మెతుకులు ఏరుకుని తింటూ కనిపించేది ఒకప్పుడు. ఇప్పుడు పట్నాలలో తినటానికి పెంచే బ్రాయిలర్ కోళ్ళు తప్ప మామూలు కోళ్ళు ఎక్కడా కనిపించటం లేదు. సంక్రాంతి పర్వదినాల్లో కోడి పందేలు లేకపోతే పండుగ జరిగినట్టే ఉండదు. ఇప్పుడు కోడి పందేలను నిషేధించినా ఎక్కడో దొంగ చాటుగా జరుగుతూనే ఉంటాయి. చిన్నతనంలో కోడి ఈకల్ని నెమలి ఫించాలతో కలిపి పెడితే ఇవి కూడా నెమలి ఫిచాలైపోతాయని నమ్మేవాళ్ళం. మగకోడిని 'కోడిపుంజు' అనీ, ఆడకోడిని 'కోడిపెట్ట' అనీ అంటారు. గుడ్ల ఉత్పత్తికై పెంచే సంకరజాతి కోళ్ళను ఫారం కోళ్ళు అంటారు. ఎరుపు, నారింజ, ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగుల ఈకలతో కోడిపుంజు తయారైంది. అరగదనే భయం లేకుండా వడియాల కోడిని ఎప్పుడైనా తినొచ్చు. కోడిని 'కుక్కుటం' అని కూడా అంటారు. 'ఫాసియానిడే' కుటుంబానికి చెందిన పక్షులే కోళ్ళు.
క్రోటాన్ మొక్కలతో...
కుండీలలో పెంచుకునే క్రోటన్ మొక్కల్లో కొన్ని ఆకులే పూల వలె అందంగా ఉంటాయి. వీటిని ''ఆర్నమెంటల్ ప్లాంట్స్'' అంటారు. ఈ ఆకులు ఎరుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ, గోధుమరంగుల వర్ణాలతో అందంగా ఉంటాయి. పువ్వులు పూయని లోటు తీరుస్తాయి. ఒక పెద్ద ఆకును, చిన్న ఆకును తీసుకొని కోడిలా అమర్చాను. కన్ను పెట్టాను. కాళ్ళు పెట్టాను. కరివేపాకు రెమ్మకు ఆకులు తీసేసి పుల్లను తీసుకొని కాళ్ళుగా అమర్చాను. శాకాహారులకు ప్రోటీన్లను అత్యధికంగా అందించే ఆహారపదార్థం కోడిగుడ్లే. వీటితో అనేక కూరలు చేసుకుంటారు. కోడి శాస్త్రీయనామం ''గాలస్ గాలస్'' అని అంటారు. మాంసం కోసమై పెంచే కోళ్ళను బ్రాయిలర్ కోళ్ళు అంటారు. ఇలా మాంసం కోసమై పెంచే కోళ్ళ ఎముకలు చాలా మృదువుగా ఉంటాయి. కోళ్ళలో ఎన్నో రకాల జాతులున్నాయి. వీటి జీవితకాలం ఐదు నుంచి పది సంవత్సరాలు.
స్కెచ్ పెన్నులతో...
స్కెచ్ పెన్నుల్లో మామూలు సైజువి కాకుండా పిల్లల కోసం సగం సైజుతోనే ఉంటాయి. మా పిల్లలు చిన్నప్పుడు కొన్నాను. అవి బొమ్మచేద్దామని దాచాను గానీ అప్పుడు చెయ్యలేదు. ఇల్లు సర్దుతుంటే మొన్న కనిపించాయి. సరే కోడిని చేద్దామని తీశాను. చిన్నచిన్న స్కెచ్ పెన్నులతో కోడి బొమ్మ రంగుల్లో బాగుంది. కోడి పుంజుల్ని ఎక్కువగా పందేలలో వాడతారు. పందేల కోసం జీడిపప్పు, బాదం, పిస్తా పప్పులు పెట్టి పెంచుతారు. ఇంకా వీటికి పౌరుషం పెరిగేందుకు మిర్చి కూడా తినిపిస్తారు. తూర్పుగోదావరి, పచ్చిమగోదావరి జిల్లాల్లో సంక్రాంతికి కోడి పందేలు ఎక్కువగా నిర్వహిస్తుంటారు.
పిస్తాపప్పు పొట్టుతో...
పిస్తా పప్పు ఒలుచుకుని తిన్న తర్వాత పొట్టు వస్తుంది. ఈ పొట్టు బలంగా పెంకు మాదిరిగా విరగకుండా ఉంటుంది. అందువలన వీటితో ఎన్ని బొమ్మలైనా చేసుకోవచ్చు. నాకీరోజు ఇంకో కోడి అవసరమై పిస్తా పప్పుతో చేశాను. ఈమధ్య మాఫ్రెండ్స్ తోటలో పండిని జీడికాయలు తెచ్చిచ్చారు. జీడికాయలు తినేశాక జీడిగింజల్ని దాచాను. ఈ బొమ్మలో జీడిగింజల్ని, చింత గింజల్ని సైతం ఉపయోగించాను. ఇది కోడి పెట్టలా కనిపిస్తోంది. నాటుకోడి పెట్టే గుడ్లు పునరుత్పత్తి శక్తి గలిగి పిల్లలుగా మారతాయి. ఇవి ఎక్కువగా ఇళ్ళలో పెంచుకునే దేశవాళీ రకాలు. వ్యాపారాత్మకంగా పెంచుకునే వాళ్ళు తప్ప ఇప్పుడు కోళ్ళను పెంచుకునే వారు లేరు.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్