Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బిడ్డ పుట్టిన ఆరునెలల వరకూ కేవలం తల్లి పాలు మాత్రమే పట్టించగలిగితే అది బిడ్డకీ తల్లికీ కూడా ఎంతో మంచిది. ఆ తర్వాత నెమ్మదిగా ఘన పదార్ధాలు మొదలు పెట్టాలి. ఆ తర్వాత కూడా సంవత్సరం వరకూ తల్లిపాలు కూడా ఇవ్వగలిగితే మరీ మంచిది. ప్రపంచ ఆరోగ్య సంస్థ బిడ్డ పుట్టిన రెండేండ్ల వరకూ తల్లి పాలు కూడా ఇవ్వవచ్చని చెబుతోంది. తల్లి పాలు తాగడం వల్ల బిడ్డ పొందే ప్రయోజనాలేమిటో చూద్దాం.
మంచి పోషణ: బిడ్డ పుట్టిన ఆరునెలల వరకూ కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వడం మంచిది. బిడ్డ పుట్టిన ఆరునెలల వరకూ బిడ్డకి కావాల్సిన ప్రతీదీ సరైన మోతాదులో తల్లిపాల నుండి లభిస్తుంది. బిడ్డ పుట్టిన దగ్గర నుండీ బిడ్డకి ఆరునెలలు వచ్చే వరకూ బిడ్డ అవసరాలకి తగినట్టుగా తల్లిపాలలో పోషకాలు కూడా మారుతూ ఉంటాయి. బిడ్డ పుట్టిన వెంటనే తల్లికి మొదటిసారిగా వచ్చే పాలని కొలోస్ట్రమ్ అంటారు. ఇది బిడ్డకి చాలా మంచిది. ఇందులో ప్రొటీన్ ఎక్కువగా, షుగర్ తక్కువగా ఉంటుంది, బిడ్డకి కావాల్సిన ప్రతీదీ ఈ కొలోస్ట్రమ్‌లో ఉంటుంది. ఈ కొలోస్ట్రమ్ని ఎలాంటి ఫార్ములా కూడా రీప్లేస్ చేయలేదు. ఈ కొలోస్ట్రమ్ బిడ్డ డైజెస్టివ్ ట్రాక్ట్ డెవలప్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది.
తల్లి పాలలో యాంటీ బాడీస్: బిడ్డ పుట్టిన మొదటి నెలల్లో బిడ్డకి వైరస్‌లతో, బ్యాక్టీరియాతో పోరాడే శక్తిని తల్లి పాలలో ఉండే యాంటీ బాడీస్ అందిస్తాయి. ప్రత్యేకించి కొలోస్ట్రమ్‌లో ఈ యాంటీ బాడీస్ బాగా ఉంటాయి. కొలోస్ట్రమ్‌లో ఇమ్యునోగ్లాబ్యులిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది బేబీ ముక్కు, గొంతు, జీర్ణశక్తి మీద ఒక ప్రొటెక్టివ్ లేయర్‌ని ఏర్పరుస్తుంది. ఈ లేయర్ బిడ్డని జబ్బు పడకుండా కాపాడుతుంది.
వ్యాధుల నుండి రక్షణ: మొదటి ఆరు నెలలు కేవలం తల్లి పాలు మాత్రమే బిడ్డ తాగినట్లైతే బిడ్డకి రకరకాల చిన్న పెద్ద వ్యాధుల నుండి ఎక్కువ ప్రొటెక్షన్ లభిస్తుంది. చెవి, గొంతు, సైనస్ ఇంఫెక్షన్స్ నుండి బిడ్డ కొంచెం పెద్దయ్యే వరకూ రక్షణ లభిస్తుంది. ఈ సమయంలో జలుబు వచ్చే ఛాన్స్ దాదాపు లేనట్టే. ఇంకా వివిధ రకాల ఎలర్జీల నుండి డయాబెటీస్ వరకూ తల్లి పాలు బిడ్డని ప్రొటెక్ట్ చేస్తాయి.
మంచి బరువు: తల్లి పాలు బిడ్డని సరైన బరువులో ఉంచుతాయి. చైల్డ్‌హుడ్ ఒబెసిటీని ప్రివెంట్ చేస్తాయి. తల్లి పాలు తాగిన పిల్లలకి మేలు చేసే గట్ బ్యాక్టీరియా ఫార్మ్ అవుతుంది. ఇది ఫ్యాట్ స్టోరేజ్‌ని నిరోధిస్తుంది. తల్లి పాలని పిల్లలు వారికి ఆకలి వేసినప్పుడు మాత్రమే తాగుతారు. ఆకలి తీరగానే తాగడం ఆపేస్తారు. దీని వల్ల పిల్లలు పెద్దైన తర్వాత కూడా హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్‌ని డెవలప్ చేసుకోగలుగుతారు.
పిల్లలు స్మార్ట్‌గా: తల్లి పాలు తాగిన పిల్లలు ఎక్కువ స్మార్ట్‌గా ఉంటారని కొన్ని స్టడీస్ చెబుతున్నాయి. తల్లి పాలలో ఉండే పోషకాలతో పాటు తల్లితో ఏర్పడే అనుబంధం, ఫిజికల్ టచ్, తల్లితో ఉండే ఐ కాంటాక్ట్ వంటివి ఇందుకు హెల్ప్ చేస్తాయని చెబుతున్నారు. అలాగే వీరికి తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటాయనీ దేన్నైనా నేర్చుకునేప్పుడు త్వరగా నేర్చుకుంటారని కూడా ఈ స్టడీస్ చెబుతున్నాయి.
అయితే... బిడ్డకి పాలివ్వడం వల్ల బిడ్డకి మాత్రమే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయనుకుంటే పొరపాటు.. తల్లికి కూడా ఇది మేలు చేస్తుంది. అదేమిటంటే:
బిడ్డకి పాలివ్వడం బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. గర్భం ధరించినప్పుడు పెరిగిన బరువుని తగ్గించుకోవడానికి బిడ్డకి పాలివ్వడం హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే బ్రెస్ట్ ఫీడింగ్ క్యాలరీలని కరిగిస్తుంది.
బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల గర్భ సంచి మళ్ళీ మామూలు సైజ్‌లోకి వచ్చేస్తుంది. అలాగే బ్రెస్ట్ ఫీడ్ చేసే తల్లులకి డెలివరీ తర్వాత తక్కువ బ్లడ్ లాస్ జరుగుతుందనీ, గర్భ సంచి త్వరగా ఇంతకు ముందున్న సైజ్‌లోకి వస్తుందనీ నిపుణులు చెబుతున్నారు.
ప్రసవానంతరం కొంత మంది స్త్రీలు డిప్రెషన్లోకి జారుకుంటారు. దీన్ని పోస్ట్ పార్టం డిప్రెషన్ అని అంటారు. బిడ్డకి పాలిచ్చే తల్లులు ఈ డిప్రెషన్ బారిన పడే అవకాశాలు చాలా తక్కువ.
బ్రెస్ట్ ఫీడ్ చేసే తల్లులకి హైబీపీ, ఆర్థ్రరైటిస్, హై బ్లడ్ ఫ్యాట్స్, హార్ట్ డిసీజ్, టైప్ 2 డయాబెటీస్ వంటివి వచ్చే రిస్క్ బాగా తగ్గుతుంది.
బిడ్డకి పాలిస్తున్నప్పుడు వెంటనే పీరియడ్ వచ్చే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. మీరు మీ బేబీతో హ్యాపీగా టైమ్ స్పెండ్ చేసుకోవచ్చు.