Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంట్లో అత్త సూటిపోటి మాటలు. భర్తకు చెప్పుకుందామంటే వినడు. పైగా వీటి నుండి తప్పిచుకోవడానికి తెల్లవారక ముందే బయటకు వెళతాడు, అంతా నిద్రపోయాక వస్తాడు. దాంతో ఇంట్లో ఆమెకు మనశ్శాంతి లేదు. అందుకే తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. అయినా భర్తలో మార్పురాలేదు. దాంతో ఆమె తన తమ్ముడిని, తల్లిని వెంటబెట్టుకొని ఐద్వా లీగల్సెల్కు వచ్చి తన సమస్యను ఇలా చెప్పుకొచ్చింది.
'మేడమ్ నా పేరు రాణి. నా భర్త పేరు రవి. మాకు ఇద్దరు పిల్లలు. మా అత్తగారిది పెద్ద కుటుంబం. మొదటి నుండి అక్కడ నాకు గౌరవం లేదు. సూటిపోటి మాటలు అంటారు. ఆయన ఉదయం ఐదు గంటలకు బయటకు వెళతాడు. రాత్రి పదకొండు, పన్నెండు గంటలకు వస్తాడు. తను వెళ్ళేటప్పటికి పిల్లలు నిద్ర లేవరు. మళ్ళీ వచ్చేసరికి నిద్రపోతారు. పిల్లలు వాళ్ళ నాన్నను అడుగుతుంటారు. ఇదే విషయం ఆయనకు చెబితే ఎప్పుడూ నీ ఎదుటే కూర్చోవాలా అంటాడు. మా అత్తమామలకు చెబితే నన్నే తిడతారు. కనీసం ఒక్క ఫోన్ కూడా చేయడు. నేను చేద్దామన్నా ఆయన దగ్గర ఫోన్ ఉంచుకోడు. మా అత్తగారితో మాత్రం మాట్లాడతాడు. ఎప్పుడన్నా మేము సంతోషంగా ఉన్నా మా అత్తగారు అసలు భరించలేదు. నన్ను బూతులు తిడతారు.
ఆయన నా గురించి పట్టించుకోవడం లేదని పుట్టింటికి వచ్చేశాను. అయినా ఆయనలో మార్పు రాలేదు. అందుకే మీరే ఆయన్ని పిలిచి మాట్లాడాలి. ఎలాగైనా మమ్మల్ని కలపండి'. అని రాణి సభ్యులకు తన సమస్య చెప్పుకుంది.
రాణి చెప్పింది విన్న సభ్యులు వచ్చే శనివారం రవిని, అతని తల్లిదండ్రులను తీసుకొని రమ్మని లెటర్ పంపారు. చెప్పిన ప్రకారమే రవి తల్లిని, తండ్రిని వెంటబెట్టుకొని వచ్చాడు. సభ్యులు రవిని కూర్చోబెట్టి ''రాణికీ, నీకూ సమస్య ఏంటి'' అని అడిగారు. దానికి రవి ''నేను ఐదు రోజుల ముందు రాణి వాళ్ళ బందువుల పెండ్లికి వెళ్ళాను. అప్పుడు తనని కలిసి వేరే ఇల్లు చూసి తనని తీసుకుపోతానని చెప్పా. కాని నాకు ఈ లెటర్ పంపింది. ఇంత పొగరు. నేను చెబితే వినదా?'' అంటూ రాణిపై కోపంగా మాట్లాడాడు.
రాణిపై కోపంగా ఉన్న రవితో సభ్యులు'చూడు రవి... నీ భార్య ఇక్కడికి వచ్చినందుకు తప్పుగా అనుకోవద్దు. అందరూ తమ తమ సమస్యలు పరిష్కరించు కోవడానికే మా దగ్గరకు వస్తారు. మేము మీ కుటుంబం సభ్యులమే అనుకోండి. గతంలో మీ వల్ల ఆమె చాలాసార్లు ఇబ్బంది పడింది. అయినా నువ్వు మారలేదు. ఇప్పటికైనా నిన్ను మార్చుకోవాలనే ఉద్దేశంతో మా దగ్గరకు వచ్చింది. తనని తప్పు పట్టకు. అసలు నువ్వు ఉదయం వెళ్ళి రాత్రి ఎప్పుడో వస్తావు. ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలుసా? మీ అమ్మకూ రాణికీ ఇంట్లో ఎటువంటి గొడవలు జరుగుతున్నాయో ముందు తెలుసుకో. ఆడవాళ్ళ సమస్యలు నాకెందుకులే అనుకుంటున్నావు. అందుకే ఇప్పుడు మీ సమస్య ఇంత పెద్దదయింది. ముందే నువ్వు నీ భార్యకు, అమ్మకు మధ్య వచ్చిన సమస్యలను పట్టించుకొని ఉన్నట్టయితే మీ సమస్య ఇంతవరకు వచ్చేది కాదు. నీలాగే చాలామంది మగవాళ్ళు ఇంటి సమస్యల నుండి తప్పించుతిరుగుతారు. ఇది ఎంతవరకు సరైనది. ఒక్కసారి ఆలోచించు. నువ్వు సమయానికి ఇంటికి రావు. ఇంట్లో పరిస్థితి బాగోలేదు. అందుకే మీ మధ్య వచ్చినవి చిన్న చిన్న సమస్యలైనా పెద్దగా కనిపిస్తున్నాయి.
నీ పనిరీత్యా ఉదయాన్నే వెళ్ళడం తప్పేం కాదు. కాని మధ్యాహం భోజనానికి ఇంటికి రావాలి లేదా కనీసం ఫోన్ చేయాలి. కాని నువ్వు ఇలా చేయడం లేదు. మీకు ఇద్దరు పిల్లలున్నారు. నువ్వు కనిపించకపోతే వాళ్లు నీకోసం దిగులుపెట్టుకోరా'' అని సభ్యులు అంటే దానికి రవి మాట్లాడుతూ ''కరోనా వచ్చినప్పటి నుండి మాకు జీతం తక్కువ వస్తుంది. అందుకే మధ్యాహ్నం నుంచి నా పని పూర్తవగానే వేరే పని చేసుకుంటున్నా. అందుకే ఇంటికి రావడం కుదరడం లేదు'' అన్నాడు.
''మరి ఈ విషయాలేమీ నువ్వు రాణికి చెప్పడం లేదు. నువ్వు చెప్పకపోతే ఆమెకు ఎలా అర్థమవుతుంది. ఇలాంటి విషయాలు భార్యాభర్తలు ఇద్దరూ చర్చించుకోవాలి. మీ మధ్య అలాంటిదేమీ లేదు. అందుకే మీ మధ్య దూరం రోజురోజుకూ పెరిగిపోతుంది. ఇప్పటికైనా ఏదో ఒక సమయంలో కాసేపు ఇంటికి వెళ్ళు'' అని సభ్యులు అంటుండగానే రవి కల్పించుకొని ''నేను ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి మా అమ్మ మీద, ఇంట్లోవాళ్ళ మీదే రాణి ఏదో ఒకటి చెబుతూనే ఉంటుంది. అందుకే ఇంటికి వెళ్ళాలనిపించదు'' అన్నాడు.
''నువ్వు ఇలా ఆలోచించడం మంచిది కాదు. ఇలా ఇంటి సమస్యను అశ్రద్ద చేస్తే ఎవరికీ ప్రశాంతత ఉండదు. రాణికీ, మీ అమ్మకూ నచ్చజెప్పాల్సిన బాధ్యత నీదే. నువ్వు రోజూ బయట గడుపుతూ ఇంటి సమస్యలను అసలు పట్టించుకోవడం లేదు. కుటుంబ సంబంధాలు నిలబడాలంటే ఇద్దరూ బాధ్యత తీసుకోవాలి'' అని రవికి చెప్పారు.
తర్వాత రవి తల్లిని పిలిచి ''మీకూ, మీ కోడలికి గొడవలు జరగడానికి కారణం మీ అబ్బాయి. అతను ఎప్పుడో తెల్లవారు జామున వెళ్ళి రాత్రికి వస్తాడు. అప్పటి వరకు భర్త కోసం భార్య ఎదురు చూడదా? ఏ ఆడపిల్లకైనా భర్తతో కాసేపు సరదాగా మాట్లాడాలని ఉంటుంది. మీరే ఈ విషయం మీ అబ్బాయికి అర్థమయ్యేలా చెప్పండి. మీ అబ్బాయి తన భార్యకు, పిల్లలకు కాస్త సమయం కేటాయిస్తే మీ కుటుంబం హాయిగా ఉంటుంది'' అని ఆమెకు నచ్చజెప్పారు.
తర్వాత రాణిని, రవిని కూర్చోబెట్టి ''రాణి నువ్వు ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని నీ భర్తకు చెప్పకు. కొన్ని సమస్యలను నువ్వే పరిష్కరించుకో. ఒకవేళ ఏమైనా రవికి చెప్పాలనుకుంటే సమయం చూసి చెప్పు. తను బయట నుండి వచ్చీరాగానే సమస్యలు చెబుతుంటే ఇలాగే పారిపోతాడు. అలాగే రవి నువ్వు కూడా మధ్యాహ్నం కచ్చితంగా ఇంటికిరావాలి. ఒకవేళ ఎప్పుడైనా రావడం కుదరకపోతే కనీసం ఫోన్లోనైనా రాణితో మాట్లాడు. రాణి కోరుకుంటుంది కూడా ఇదే. భార్యగా తను ఇలా కోరుకోవడంలో తప్పు లేదు. కాబట్టి నువ్వు కూడా అర్థం చేసుకో. వీలైనపుడల్లా రాణినీ, పిల్లల్ని బయటకు తీసుకెళ్ళు. ఇక మీదట మీకు ఎలాంటి సమస్య వచ్చినా మాదగ్గరకు రండి'' అని సభ్యులు చెప్పారు.
సభ్యులు చెప్పిన ప్రకారమే చేస్తామని ఇద్దరూ రిజిస్టర్లో సంతకాలు చేసి వెళ్ళారు. పదిహేను రోజుల తర్వాత రాణి లీగల్సెల్కు ఫోన్ చేసింది. రాజులో మార్పు వచ్చిందని చాలా సంతోషంగా చెప్పింది. కాని అత్త కాస్త కోపంగా ఉంటుందని చెప్పి బాధపడింది. దానికి సభ్యులు ''నువ్వు ఆమెతో మంచిగా ఉండు చిన్నచిన్నగా తను కూడా మారుతుంది'' అని రాణికి ధైర్యం చెప్పారు. సరే అంటూ రాణి ఫోన్పెట్టేసింది.
- సలీమ