Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుత జీవనశైలి వల్ల చాలామందిలో చిన్న తనంలోనే అనేక ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. వీటిలో ఒకటి చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు కనిపించడం. ఈ సమస్యను కప్పిపుచ్చుకునేందుకు జుట్టుకు రంగు వేస్తూ, వెంట్రుకలను మరింత పాడుచేసుకుంటారు చాలామంది. అయితే చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుంటే.. అందుకు గల కారణాలను విశ్లేషించుకొని, దానికి తగినట్టుగా జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి.
లైఫ్ స్టైల్: చాలామంది చిన్న వయసులోనే ఎక్కువగా ఒత్తిడి, ఆందోళనకు గురవడం, ధూమ పానం, మద్యపానం వంటి అలవాట్లు, పోషకాహార లేమి.. వంటి కారణాల వల్ల జుట్టు తెల్లబడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.
అనారోగ్యకరమైన ఆహారం: మనం ప్రతి రోజు తీసుకునే ఆహారంలో అన్ని రకాల పోషకాలు తప్పక ఉండాల్సిందే. అలా కాకుండా పోషకరహితమైన జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటే.. మన శరీరంలోని న్యూట్రియంట్లు తగ్గిపోతాయి. ఫలితంగా జుట్టు కూడా తెల్లబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
జన్యువులు: కొన్ని సార్లు మనం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ కొనసాగిస్తున్నా సరే.. జుట్టు తెల్లబడుతుంది. దీనికి కారణం జెనెటిక్స్ లేదా జన్యువులు కూడా కావచ్చు. జుట్టు ఏ వయసులో తెల్లబడాలన్నది మన జన్యు క్రమంపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీ తల్లిదండ్రుల్లో ఎవరికైనా చిన్న వయసులోనే తెల్ల జుట్టు కనిపిస్తే.. మీకు కూడా ఆ సమస్య ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది.
ఎలా అరికట్టాలి?
- మీరు తీసుకునే ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండేలా చూసుకోవాలి. విటమిన్లు, మినరల్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, క్యాల్షియం, ఇతర సూక్ష్మ పోషకాలు ఉండే ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి. దీంతో పాటు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని వీలైనంత తక్కువగా తీసుకోవాలి.
- జుట్టు తెల్లబడడానికి ముఖ్యమైన కారణాల్లో ఒత్తిడి కూడా ఒకటి. అందుకే ఒత్తిడిని వీలైనంత తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. మెడిటేషన్, యోగా వంటివి చేయడంతో పాటు ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలను వెతికి ఆనందంగా ఉండేలా చూసుకోవాలి.
మనం ఉపయోగించే షాంపూలు, కండిషనర్స్ ఇతర వస్తువుల్లోని కెమికల్స్ మన జుట్టును పాడు చేస్తాయి. అందుకే వీలైనంత వరకు కెమికల్ ఫ్రీ ఉత్పత్తులను ఉపయోగించడానికి ప్రయత్నించాలి. జుట్టుకు సంబంధించిన ఏదైనా సమస్యను తగ్గించుకోవడానికి ఇంటి చిట్కాలను ఉపయోగించాలే తప్ప కెమికల్స్ వాడకూడదు.
- జుట్టును జాగ్రత్తగా చూసుకోవాలి. దీని కోసం తరచూ నూనె పెట్టడం, దువ్వుకోవడం, వారానికి రెండు సార్లైనా తలస్నానం చేయడం, మాడును మసాజ్ చేస్తూ ఉండడం, కాలుష్యం నుంచి జుట్టును వీలైనంతగా కాపాడుకోవడం వంటివి చేస్తుండాలి.