Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఒకటే జననం.. ఒకటే మరణం... అలుపు లేదు మనకూ... గెలుపు పొందు వరకు...'' అంటూ పట్టుదలతో చదివి మంచి ఉద్యోగం సంపాదించాలనే లక్ష్యంతో నగరానికి వచ్చింది రచన. అసలే పేదరికం... ఇక కరోనా సృష్టించిన సంక్షోభంతో ఆర్థికంగా మరింత ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. కన్నీళ్లు ఉబికి వస్తున్నా ఉన్నత చదువుల కోసం వాటిని పంటి బిగువన భరించింది. కష్టాలను చూసి కుంగిపోలేదు. ఇబ్బందులు వచ్చినా వెనకడుగు వేయలేదు. పురుషులు మాత్రమే పనిచేస్తున్న పుడ్ డెలివరీ పనిలో చేరింది. అమ్మాయిలు అన్నీ చేయగలరని మరోసారి నిరూపించింది. రాష్ట్రంలో తొలి ఫుడ్ డెలివరీ గర్ల్‌గా పనిచేస్తూనే చదువునూ కొనసాగిస్తూ తనలాంటి యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. ఆమె స్ఫూర్తిదాయక ప్రయాణం గురించి మానవి పాఠకుల కోసం...
షాకయ్యారు...
నిత్యం పుడ్ డెలివరీ చేయడం... ఆన్లైన్లో చదువుకోవడం నాకు దినచర్యగా మారింది. ఒకరోజు పుడ్ డెలివరీకి వెళ్లొస్తున్న సమయంలో నన్ను చూసి యూట్యూబర్ ఇమ్రాన్ ఖాన్ షాకయ్యారు. వెంటనే నా వద్దకు వచ్చి కేవలం మగవాళ్లు మాత్రమే చేసే పుడ్ డెలివరీ పనిని ఎలా చేస్తున్నావని అడిగారు. నా కుటుంబ పరిస్థితులు.. చదువుకు కావాల్సిన ఫీజుల కోసం ఇలా చేయాల్సి వస్తుందని చెప్పడంతో చలించిపోయారు. తక్షణం రూ.10వేల ఆర్థిక సాయం చేశారు. ఆ మరుసటి రోజు వచ్చి ఓ స్కూటీని ఇచ్చారు. ఇప్పుడు సంతోషంగా డెలివరీ చేస్తున్నాను.
- రచన
రచన సొంత ఊరు వరంగల్ అర్బన్ జిల్లా, బాలసముద్రంలోని అంబేడ్కర్ నగర్. తండ్రి మామిడిపల్లి రవి.. మేస్త్రీ పని చేస్తుంటాడు. తల్లి సాంబ కూలీకి పోతుంది. రచన వీరికి చిన్న కూతురు. పెద్ద బిడ్డకు ఏదో కొద్దిగ చదివించి పెండ్లి చేసేశారు. రచన మాత్రం ఇంటర్ పూర్తి చేసింది. ఆర్థిక స్థోమత లేకపోయినా ఇంకా చదువుకోవాలనే కోరిక మాత్రం ఆమెలో బలంగా ఉంది.
కన్నవారికి భారం కాకుండా...
రచన కోరిక తీర్చే శక్తి ఆ తల్లిదండ్రులకు లేదు. పై చదువులంటే ఆ పేద దంపతులకు తలకుమించిన భారం. రచన మాత్రం తన తల్లిదండ్రులు పెద్దగా చదువుకోకున్నా తాను మాత్రం బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకుంది. తన లక్ష్య సాధన తల్లిదండ్రులకు భారం కాకూడదని నిర్ణయించుకుంది. వాళ్ళ మాదిరిగానే రెక్కల కష్టాన్నే నమ్ముకుంది. పని చేస్తూనే చదువునూ కొనసాగించాలనుకుంది.
నగరానికి వచ్చి
ఉన్నత చదువుల కోసం రచన హైదరాబాద్ వచ్చేసింది. హైదరాబాద్‌లో ఉన్న బంధువులు తనకు సహకరిస్తారనే నమ్మకంతో అడుగులు ముందుకు వేసింది. కానీ తాను ఎంచుకున్న చదువు చదవాలంటే లక్షలు ఖర్చవుతుంది. చేతిలో చిల్లిగవ్వలేదు. అయినా ఏమాత్రం అధైర్యపడలేదు. తన లక్ష్యం ముందు తనకు అన్నీ చిన్నవిగానే అనిపించాయి. ఏదైనా పార్ట్‌టైం జాబ్ చూపించమని నగరంలో ఉండే తన మామయ్యని అడిగింది.
జొమాటోలో తొలి అమ్మాయిగా...
మొదట ఆమె తార్నాకాలోని ఓ పాలకేంద్రంలో పనికి చేరింది. కానీ ఆ వచ్చే ఆదాయం ఇంటి అద్దెకే సరిపోవడంలేదు. దాంతో ఓ కిరాణ షాపులో చేరింది. అక్కడ నెలకు రూ.9వేలకు పైగా ఆదాయం వచ్చేదిద. కాని అవి తన చదువులకు ఏమాత్రం సరిపోవు. ఏం చేయాలో తోచలేదు. అలాంటి పరిస్థితుల్లో ఓ రోజు దుకాణం నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంటే జొమాటో డెలివరీ బార్సు పుడ్ డెలివరీ కోసం వేగంగా వెళుతుంటే చూసింది. ఒకరోజు అనుకోకుండా ఓ డెలివరీ బారుని కలిసి తనకు డెలివరీ గర్ల్‌గా పనిచేయాలని ఉందని చెప్పింది. అందుకు ఏం చేయాలో అతడు వివరించాడు. ఆ విధంగా జొమాటో ఆఫీసుకు వెళ్లి రూ.200ల ఫీజు చెల్లించి టీషర్ట్, పుడ్ బ్యాగ్‌ను తీసుకుంది. డెలివరీ గర్ల్‌కు కావాల్సిన శిక్షణ తీసుకుంది. అలా మే 22న తొలి జొమాటో పుడ్ డెలివరీ గర్ల్‌గా చేరింది.
పరిస్థితిని గమనించి
జొమాటోలో అయితే చేరింది కానీ రచన వద్ద టూ వీలర్ లేదు. దాంతో తాను పనిచేస్తున్న కిరాణషాపు యజమాని వద్ద ఉన్న స్కూటీని వాడుకుంటానని అడిగింది. అందుకు అతను అంగీకరించడంతో పుడ్ డెలివరీ చేయడం ప్రారంభించింది. ప్రస్తుతం నాచారం, మల్లాపూర్, మల్కాజ్ గిరి, హబ్సిగూడ, సీతాఫల్ మండీ ప్రాంతాల్లోని వినియోగదారులకు ఆహారం సరఫరా చేస్తోంది. ఒకవైపు డెలివరీ గర్ల్‌గా పనిచేస్తూనే మరోవైపు బల్కంపేట్‌లోని చెన్నరు అమృత హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో చేరి ఆన్లైన్లో చదువుకుంటోంది. ఫీజు రూ.2.50లక్షలు అయినప్పటికీ తన పరిస్థితిని కళాశాల యాజమాన్యానికి వివరించడంతో మూడు దఫాల్లో చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించింది.
ఎంత కష్టమైనా...
లాక్డౌన్ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే మినహాయింపు ఇచ్చిన సమయంలో దుకాణాలు నడపడం కష్టమయింది. తనకు జీతం చెల్లించడం కష్టమని యజమాని చెప్పడంతో ఆ పనిమానేసి.. పుడ్ డెలివరీపైనే దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఫుడ్ డెలివరీ చేసినందకు ఆమెకు రోజుకి సుమారుగా రూ.400 వరకు వస్తాయని రచన అంటుంది. వచ్చిన డబ్బుల్లో కొంత తల్లిదండ్రులకు పంపిస్తుంది. మిగిలిన దాంట్లో కొంత కాలేజీ ఫీజు కట్టుకుంటుంది. ఎంతకష్టమైనా హోటల్ మేనేజ్మెంట్ పూర్తిచేసి... మంచి ఉద్యోగం సంపాదిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేస్తోంది. అంతేకాదు ఉద్యోగం వచ్చిన తర్వాత తన లాంటి వారికి సాయం చేస్తానని అంటోంది.