Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోజురోజుకీ అభివద్ధి చెందుతున్న టెక్నాలజీతో పాటు దాని దుష్ప్రభావాలు సైతం విపరీతంగా పెరిగిపోతున్నాయి. మన దేశంలో ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ల వాడకం పెరిగిన తరువాత మహిళలపై వేధింపులు, సైబర్ నేరాలు పెరిగినట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలు వెల్లడించాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫాంలలో మహిళల అకౌంట్లను హ్యాక్ చేయడం, వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం, ఫోటోలను సేకరించి అసభ్యకరంగా మార్పులు చేయడం, వీటి ద్వారా డబ్బు డిమాండ్ చేయడం, వేధింపులకు పాల్పడటం... వంటివి పెరిగిపోతున్నాయి. సామాజిక పరిస్థితులను దష్టిలో పెట్టుకొని యువతులు, మహిళలు ఈ సైబర్ నేరాల గురించి ఫిర్యాదు చేయడానికి వెనుకాడుతున్నారు. చాలామందికి వీటిపై ఎవరికి ఫిర్యాదు చేయాలో కూడా తెలియట్లేదు. ఇలాంటి సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సైబర్ సెక్యూరిటీపై యువతులు, మహిళలు అవగాహన పెంచుకునేందుకు కొన్ని చిట్కాలు...
దొంగలించే అవకాశం
ఉచిత వైఫై, ఇతర ఓపెన్ నెట్‌వర్క్‌ల ద్వారా ఇంటర్నెట్ ఉపయోగించి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలకు లాగ్ఇన్ కావద్దు. వీటి ద్వారా నేరగాళ్లు వ్యక్తుల అకౌంట్, పాస్‌వర్డ్స్‌ను దొంగతనంగా హ్యకింగ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పబ్లిక్ ప్లేస్‌లలో ఉండే ఓపెన్ నెట్వర్క్ వాడుతూ ఈ-కామర్స్ సైట్లలో షాపింగ్, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ అస్సలు చేయకూడదు. ఓపెన్ నెట్వర్క్స్ ద్వారా వ్యక్తుల బ్యాంకు వివరాలు, పాస్‌వర్డ్‌లను సైబర్ నేరగాళ్లు మనకు తెలియకుండానే దొంగిలించే అవకాశం ఉంది. అందువల్ల ఎలాంటి అవసరాలకైనా సెక్యూరిటీ కోడ్, సేఫ్టీ ఎక్కువగా ఉండే వైఫై నెట్‌వర్క్‌లనే ఉపయోగించాలి.
ఫొటోలు పెట్టొద్దు
సైబర్ నేరస్తులు ఫొటోలను వివిధ రకాలుగా దుర్వినియోగం చేస్తున్నారు. సోషల్ మీడియా నుంచి మహిళలు, యువతుల ఫోటోలు సేకరించి, వాటిని మార్ఫింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫోటోలో ఉన్నవారి ముఖాన్ని వేరే వ్యక్తి శరీరానికి జత చేసి, అసభ్యంగా మార్పులు చేస్తున్నారు. వీటిని పోర్న్ వెబ్సైట్లలో అప్లోడ్ చేస్తామని బెదిరిస్తున్నారు. వారికి తెలియకుండానే కొంతమంది ఈ ఫోటోలను కొన్ని డార్క్ వెబ్సైట్లకు అమ్ముకుంటున్నారు. అందువల్ల సోషల్ నెట్వర్క్ సైట్లలో మహిళలు ప్రైవసీకి ప్రాధాన్యం ఇవ్వాలి. వ్యక్తిగత ఫోటోలను ఎవరితోనూ పంచుకోకపోవడమే మంచిది. కొంతమంది మొబైల్ ఫోన్లో తీసిన ఫోటోలను గూగుల్ డ్రైవ్, ఐక్లౌడ్ అకౌంట్లకు బ్యాకప్ చేసుకుంటారు. వీటికి బలమైన పాస్‌వర్డ్‌లను పెట్టుకోవడం ద్వారా హ్యాకింగ్‌కు గురికాకుండా జాగ్రత్తపడవచ్చు.
యాంటీ డేటా రికవరీ
ప్రస్తుతం వాడుతున్న ఫోన్లు, ఇతర డివైజ్‌లను ఇతరులకు అమ్మాలనుకున్నప్పుడు యాంటీ డేటా రికవరీ సొల్యూషన్‌ను ఉపయోగించాలి. దీనివల్ల డివైజ్‌లలో ఇంతకు ముందు స్టోర్ చేసి డిలీట్ చేసిన డేటాను రికవరీ చేయలేరు. కొన్ని రకాల సాఫ్ట్వేర్లను ఉపయోగించి డేటా రీస్టోర్ చేసి, దాన్ని బ్లాక్ వెబ్‌లో అమ్ముకుంటున్న కేసులు ఇంతకు ముందు వెలుగు చూశాయి. అందువల్ల డేటా దుర్వినియోగం కాకుండా యాంటీ డేటా రికవరీ సొల్యూషన్ని ఉపయోగించాలి.
అదనపు భద్రత
జీ మెయిల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా అకౌంట్లను యాక్సెస్ చేయడానికి టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. దీనివల్ల హ్యాకర్లు రెండుసార్లు అకౌంట్లను అక్రమంగా యాక్సెస్ చేయడం కష్టంగా మారుతుంది. యూజర్లకు అదనపు భద్రత లభిస్తుంది.
లాక్ చేయడం
వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులు తెలుసుకోలేని విధంగా డివైజ్‌లను ఎల్లప్పుడూ లాక్ చేసి ఉంచాలి. ఇప్పుడు తయారు చేస్తున్న స్మార్ట్ఫోన్లలో ఇన్‌బిల్ట్‌గానే సెక్యూరిటీ సిస్టమ్‌ను అభివద్ధి చేస్తున్నారు. దీంతో పాటు ఆన్లైన్లో డివైజ్ సెక్యూరిటీ కోసం ఎన్నో ఉచిత యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏదో ఒక యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని వాడుకోవాలి. ఇవి డేటా భద్రతకు భరోసా ఇస్తాయి.
బలమైన పాస్వర్డ్
యూజర్లు పాస్‌వర్డ్‌లను ఎప్పటికప్పుడూ మారుస్తూ ఉండాలి. దీనివల్ల ఇతరులు సులభంగా పాస్‌వర్డ్స్‌ను యాక్సెస్ చేయడం కష్టమవుతుంది. సోషల్ మీడియా సైట్లలో అయితే వాటి పాస్వర్డ్ పాలసీకి అనుగుణంగా బలమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించాలి. వివిధ రకాల ఆన్లైన్ అకౌంట్ల కోసం విభిన్న పాస్వర్డ్స్ పెట్టుకోవాలి. అన్నింటికీ ఒకటే పాస్‌వర్డ్‌ను పెట్టకూడదు.
బ్లాక్ చేయాలి
యువతులు, మహిళలు సోషల్ మీడియా అకౌంట్ సెట్టింగ్స్‌ను పబ్లిక్ నుంచి ప్రైవేట్‌కు మార్చుకోవాలి. అకౌంట్ సెక్యూరిటీ స్థాయులను ఎప్పటికప్పుడూ పరిశీలించుకోవాలి. యూజర్లు తమకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదు. సమాచారాన్ని పరిమితంగానే షేర్ చేయాలి. అసభ్యకరంగా మెసేజ్‌లు చేసేవారు, సైబర్ వేధింపులకు పాల్పడేవారి అకౌంట్లను బ్లాక్ చేయాలి. అవసరమైతే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలి.