Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఇల్లు.. పనిచేసే చోటు.. ఈ రెండు చోట్లా విజయం సాధించడం అన్నది మహిళల వల్ల అయ్యే పనికాదు. ఆ రెండిటి మధ్య సమతూకాన్ని పాటించటం ఏంతో పెద్ద సవాలు. నా పిల్లలకి అవసరమైనప్పుడు వారి దగ్గర లేకపోయానే అన్న అపరాధ భావం ఇబ్బంది పెట్టేది. కానీ క్రమంగా నన్ను నేను సమాధానపరుచుకున్నాను'... ఈ మాటలు అచ్చంగా మీ మనసులోని మాటలులా అనిపిస్తున్నాయా, నిజానికి ఉద్యోగం చేసే అమ్మలందరి భావం ఇదే. ఇలా అమ్మ మనసుకి అద్దం పట్టేలా తన భావాలని పైకి చెప్పిన మహిళ సాదాసీదా ఉద్యోగిని కాదు. అమెరికాలో ప్రతిష్టాత్మక కంపెనీలలో ఒకటైన పెప్సికోకు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా పని చేసిన శ్రీమతి ఇంద్ర నూయి భావాలు అవి.
- ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన, సఫలమైన మహిళల్లో ఒకరిగా పేరుపొందిన ఈమె ఓ సందర్బంలో ఇలా తన మనసులోని భావాలు బయటపెట్టారు. ఆమె భావాలూ, అనుభవాలు అన్ని చదువుతుంటే....ఒక్కసారిగా ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరికినట్టు అనిపిస్తుంది. రెండు చోట్లా చక్కగా బాధ్యతలు నిర్వహించాలి. ఎవరినీ నొప్పించకూడదు, పిల్లలకు ఎప్పుడూ అందుబాటులో వుండాలి. 'పిల్లలు' నాప్రాధాన్యతగా వుండాలి. ఇలా మదనపడే ఉద్యోగస్తులైన అమ్మలు.. ఒక్క విషయం మరచిపోతున్నారు అంటారు సైకాలజిస్టులు.
- 'మీరేం సూపర్ పవర్ కాదు, మీకూ కొన్ని పరిధులు, పరిమితులు వుంటాయి. అవి అర్ధం చేసుకోండి. లేదంటే అన్నీ చోట్ల ఉత్తమంగా నిలవాలనే తాపత్రయంలో మీరు మానసికంగా, శారీరకంగా అలసిపోతారు. మిమ్మల్ని మీరు పోగొట్టుకుంటారు. ఇకప్పుడు మీరు చేయగలిగేదేం వుండదు'. ఇంద్రనూయి మాటలు ఈ భావాన్నే చెప్పినట్టు అనిపిస్తుంది. ఆమె ఆ స్థాయిలో విజయం సాధించటానికి ఎక్కడో అక్కడ కొంత రాజీపడి వుండక తప్పదు. అయితే ఆ రాజీపడడాన్ని ఓటమిగాకాక పరిస్థితులకు తగ్గట్టు సర్దుకుపోవటంగా అగీకరించారు కాబట్టే, ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉన్నారు. ఒత్తిడి లేనప్పుడే ఎవరైనా తమ సామర్ధ్యాన్ని పూర్తిగా వినియోగించగలరు. అలా పూర్తి సామర్ధ్యానికి ప్రతిఫలం విజయమే.
- అందుకే మనం సూపర్ పవర్‌గా నిలవాలి అనుకోకుండా మన పాత్రని సమర్ధవంతంగా, అర్ధవంతంగా వీలయినంత నిజాయితీగా పోషిద్దాం. 'నిజాయితీకి' గౌరవం బహుమానంగా తప్పక అందుతుంది. అది ఇంటి నుంచీ అవ్వచ్చు, అటు ప్రపంచం నుంచీ కావచ్చు. కృంగదీసే అపరాధభావాన్ని దూరంగా నెట్టేసి... హాయిగా గుండెల నిండా గాలి పీల్చి, మిమల్ని మీరు శభాష్ అనుకోండి ఓసారి. ఇకప్పుడు చూడండి.. మీ జర్నీ మీరు ఎంత ఎంజారు చేస్తారో...