Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంతా బావుంది అనిపించినంతసేపూ మనం కొత్తగా ఏమీ ఆలోచించలేము. కాబట్టి జీవితంలో కొత్తగా ఏ మార్పూ రాదు. ఉన్నదాన్ని ఉన్నట్టు అంతా ఇష్టపడటం ఎంతోకాలం చేయలేం. ఏదో ఓ రోజున 'బోర్' అనిపిస్తుంది. ఇంకేదో కావాలనిపిస్తుంది. ఓ బ్రేక్, ఓ మార్పు కావాలని అనిపిస్తుంది. అదిగో అలా అనిపించింది అంటే అది లైఫ్‌లో సరికొత్త మార్పుకి శ్రీకారమే కదా అంటున్నారు నిపుణులు. మరి అలా బ్రేక్ కావాలి, మార్పు కావాలి అనిపిస్తే అందుకు ఏం చేయాలి?
అనుకున్న దిశగా అడుగులు: మనం గడిపే జీవితంలో కొత్తగా ఇంకేమన్నా మార్పులు జరిగితే బావుండును అనిపించగానే చాలామంది ఏముంది- ఇంతే, ఈ లైఫ్ ఇలా గడవాల్సిందే వంటి నైరాశ్యంలో పడిపోతారు ముందు. ఆ తర్వాత నెమ్మదిగా ఏం చేయొచ్చు అన్న విషయం కోసం ఆలోచిస్తారు. నిజానికి అందులో కొద్దిమంది మాత్రమే అనుకున్న దిశగా అడుగులు వేస్తారు. తాము కోరుకున్న మార్పుని తమ జీవితాల్లోకి ఆహ్వానిస్తారు. దానినుంచి లభించే ఆనందాన్ని రుచి చూస్తారు. ఆ కొద్దిమందిలో మీరూ వున్నారా.. లేరా? అయితే ఆ లిస్ట్‌లో చేరాలంటే మనమేం చేయాలనేది నిపుణులు చెబుతున్నారు.
మనలోనే రావాలి: లైఫ్‌లో మార్పు కావాలని అనిపిస్తే ఆ మార్పు బయట ఎక్కడినుంచో రాదు. అది మనలో రావాలి అంటున్నారు నిపుణులు. ముందుగా మన పరిధులు, పరిమితులు, పరిస్థితులు, వయసు వంటి వాటి గురించి ఆలోచించడం, భయపడటం, సందేహపడటం మానేయాలి. వీటన్నిటినీ పక్కన పెట్టి ఏ మార్పు అయితే మీకు ఆనందాన్నిస్తుందని మీరు ప్రగాఢంగా నమ్ముతున్నారో ఆ మార్పు గురించి ఆలోచించండి. ఆ తర్వాత దాన్ని అమలు చేయడమెలాగో చూడండి. ప్రయత్నించండి. గట్టి సంకల్పం వుంటే ఏదీ అసాధ్యం కాదని గుర్తుంచుకోండి.
నచ్చిన పనిపై దృష్టి: మీకు నచ్చిన ఓ కోర్స్ చేయడం, సగంలో ఆపేసిన హాబీని తిరిగి నేర్చుకోవడం, కొత్తగా ఓ హాబీని అలవర్చుకోవడం, ఈవినింగ్ కాలేజీలో చేరడం లేదా ఓ కొత్త భాషను నేర్చుకోవడం, సమాజసేవ, ఓ వ్యాపారం.. ఇలా ఏదైనా కావచ్చు. తప్పకుండా ఓ మంచి ప్రయత్నే అవుతుంది.. జీవితాన్ని ఇప్పటికంటే అందంగా మారుస్తుంది. నచ్చడం లేదంటూ పరిస్థితులను, జీవితాన్ని తిట్టుకుంటూ గడపటం, ఆ అసంతృప్తిని ఇంట్లోవారిపై చూపించడం, మనల్ని మనం బాధపెట్టుకోవడం కంటే జీవితాన్ని నచ్చినట్టు మార్చుకోవడం ఎంతో సులువు.
స్ఫూర్తిగా నిలవండి: మన గట్టి సంకల్పం ముందు కొండలైనా తలవంచాల్సిందే. అందుకు ఉదాహరణగా నిత్యం మనకు ఎంతోమంది స్త్రీలు విజయబావుటా ఎగరేస్తూ కనిపిస్తూ వుంటారు. వారిని చూసి ఆనందపడి, అచ్చెరువొందే మనం రేపటి రోజున మరొకరికి స్ఫూర్తిగా నిలవగలం. చిన్న ప్రయత్నం, గట్టి సంకల్పం, మరింత తపన చాలు జీవితాన్ని కొత్తగా ఆవిష్కరించుకోవడానికి.