Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏదో సాధించాలని అందరూ కలలు కంటారు... కానీ ఆ కలలు నిజం చేసుకోవాలంటే ఎంతో కష్టపడాలి. ఇక మహిళలకైతే ఏం చేయాలనే ఎన్నో అడ్డంకులు. వాటన్నింటినీ దాటుకుని అనుకున్నది చేయడమంటే మామూలు విషయం కాదు. అందుకే ఎంతో మంది కలలు కలలుగానే మిగిలిపోతున్నాయి. అదే కుటుంబం సహకరించి.. తోడై నిలిస్తే... అది కూడా పెండ్లి తర్వాత... ఉన్నత శిఖరాలను అధిరోహించడం సులభం. దానికి నిదర్శనమే నితీషా రెడ్డి. పెండ్లి తర్వాత తన లక్ష్యాన్ని చేరునేందుకు అహర్నిశలూ శ్రమిస్తున్న ఆమె గురించి మానవి పాఠకుల కోసం...
మనిషి అన్నాక కష్టాలు సుఖాలు బాధలు సంతోషాలు అన్ని ఉంటాయి. కానీ నా బాల్యం ఎక్కడా పూలపాన్పులా లేదు. కరీంనగర్లో మధ్య తరగతి కుటుంబంలో పుట్టాను. ఇంట్లో కొన్ని ఇబ్బందుల వల్ల తొమ్మిది నెలల పాపగా ఉన్నప్పటి నుండి మా అమ్మమ్మ దగ్గరే పెరిగాను. నా ఆలనా పాలన మొత్తం మా అమ్మమ్మ, మా పిన్ని చూసుకున్నారు. తల్లిదండ్రుల దగ్గర గడిపిన సందర్భాలు చాలా తక్కువ. నాకు రెండేండ్లు ఉన్నప్పుడు నాన్నగారి కాళ్లు పడిపోయాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా బెడ్‌కే పరిమితమై ఉన్నారు. ఆ కారణంతో మా నాన్న జాబ్ పోయింది. దాంతో ఇంట్లోనే ఉంటూ మా గ్రామంలో కేబుల్ మొదలుపెట్టారు. అలాగే పిండి గిర్ని స్టార్ట్ చేశారు. మా అమ్మ పిండి గిర్ని, కేబుల్ చూసుకుంటూనే బీడీలు చేస్తూ, బట్టలు కుడుతూ చాలా కష్టపడింది. మా తాతలు ఇచ్చిన భూములు ఉన్నా అమ్మకుండా నన్నూ, తమ్ముడిని కష్టపడి పెంచారు. బీటెక్ పూర్తి చేసిన తర్వాత నాకు పెండ్లి చేశారు. నాకు ఓ పాప, బాబు ఉన్నారు.
ఫ్యాషన్ అంటే ఇష్టం
చిన్నప్పటి నుండి యాంకరింగ్, డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. స్కూల్లో ఏ ప్రోగ్రామైనా ముందుండి చేసేదాన్ని. కాలేజీలో కూడా అంతే. ఫ్యాషన్‌గా తయారయ్యేదాన్ని. మా బంధువుల్లో చాలా మంది ఆ డ్రెస్సేంటీ, జుట్టేంటి అంటూ తిట్టే వారు. కానీ ఇప్పుడు వాళ్ళ పిల్లలకు అవే పెడుతున్నారు. డ్రెస్సింగ్ విషయానికి వస్తే చాలా కొత్తదనాన్ని కోరుకునే దాన్ని. ఇప్పుడు ఉన్నట్టుగా ఆ టైంలో బోటిక్స్ గానీ, డిజైనర్ వేర్స్ నేనున్న ప్రాంతంలో లేవు. కాకపోతే నా సొంత ఆలోచనలతో పేపర్ పైన డ్రా చేసుకుని మా ఇంటి దగ్గర ఉన్న టైలర్‌తో కుట్టించుకునే దాన్ని. కానీ వాళ్ళు చాలా డ్రెస్సులు పాడు చేసేవారు. మా మేనత్త నాకోసం డిజైన్ డ్రెస్సులు తానే సొంతగా కుట్టేది. ఆమె ప్రభావం నా పైన బాగా పడింది. మా అమ్మ కూడా కుట్లు, అల్లికలు నేర్చుకుంది. అప్పుడప్పుడు నేను కూడా అమ్మతో పాటు ప్రాక్టీస్ చేస్తుండేదాన్ని.
షార్ట్ ఫిలింమ్స్
నేను పుట్టి పెరిగిన కరీంనగర్లో సినిమాలన్నా సినిమా వాళ్ళన్న చిన్న చూపు ఉండేది. మా కాలేజీలో షార్ట్ ఫిలిం ఫెస్టివల్ జరిపారు. అప్పుడు నేను కూడా ట్రై చేద్దాం అనుకుని మా తమ్మునితో షేర్ చేసుకున్నా. మా తమ్ముడికి ఆ టైంలోనే ఎడిటింగ్, టెక్నాలజీపై పట్టు ఉండేది. అలా మా తమ్ముడు తన ఫ్రెండ్స్ సహాయంతో 'ఎఫ్బీ ఫెయిల్యూర్' అనే ఓ చిన్న షార్ట్ ఫిలిం చేశాము. ఎడిటింగ్ కెమెరా అంతా కూడా మా తమ్ముడు చూసుకున్నాడు. ఆ షార్ట్ ఫిలిం మా కాలేజ్ ఫెస్టివల్లో ప్లే చేశారు. అవార్డు రాలేదు కానీ చాలా మంది మెచ్చుకున్నారు. తర్వాత ఏడాది జరిగిప ఫెస్టివల్లో కూడా పాల్గొన్నాను. ఈసారి మాత్రం చాలా పెద్ద స్టోరీ. చాలామంది యాక్టర్స్ అంటే క్లాస్‌లో ఉన్న ఫ్రెండ్స్ కూడా ఇందులో నటించారు. దాని పేరు 'లాంగ్ లీవ్'. 30 నిమిషాల షార్ట్ ఫిలిం కేవలం రోజున్నరలో పూర్తి చేశాము. నా ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ చేశారు. కానీ ఎడిటింగ్ చేయించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. చివరకు నా షార్ట్ ఫిలిం ఫెస్టివల్లో ప్లే చేశారు. అందరి మన్ననలు పొందాను. ఈసారి అవార్డు కూడా వచ్చింది. డైరెక్టర్ కావాలని అప్పుడే నిర్ణయించుకున్నాను.
డిగ్రీ చేశాకే అన్నారు...
యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్ చేయడం మొదలుపెట్టాను. అప్పుడే మా టీవీలో కూడా కాంటెస్ట్ పెట్టారు. ఆ టైంలో ఫేస్బుక్లో పరిచయమైన కొందరు మిత్రుల ద్వారా ఓ షార్ట్ ఫిలిం, డెమో ఫిల్మ్‌లో నటించే అవకాశం వచ్చింది. ఇంట్లో చెబితే అస్సలు ఒప్పుకోరు అసలు వాళ్ళకి ఇష్టమే లేదు. అందుకే ఇంట్లో చెప్పకుండా ఉదయాన్నే కాలేజీకి వెళుతున్నట్టు బయటకి వచ్చి హైదరాబాద్ వచ్చేశాను. హైదరాబాద్ చేరే సరికి తొమ్మిది అయ్యేది. షూటింగ్ పూర్తి చేసుకుని మళ్లీ నాలుగ్గంటలకు మళ్ళీ కరీంనగర్ బయలుదేరేదాన్ని. షూటింగ్ ఉన్నని రోజులు ఇలాగే చేసేదాన్ని. ఆ తర్వాత రెండు సినిమాల్లో అవకాశం వచ్చింది. ఇంట్లో చెప్తే ఎలాగో పంపారు అందుకే ఇంట్లో ఎవ్వరికీ చెప్పలేదు. కానీ మా తమ్ముడు నాకు సపోర్ట్ చేసేవాడు. నా క్షేమ సమాచారాలు తనే తెలుసుకునేవాడు. కానీ ఒక రోజు బస్ దొరక్క ఇంటికి వచ్చేసరికి రాత్రి 12 అయ్యింది. ఛార్జింగ్ లేక ఫోన్ చేయలేకపోయా. మా తమ్ముడు కోపంతో ఆరోజు డోర్ తీయలేదు. రాత్రంతా చలిలో బయటే ఉండిపోయాను. అప్పటి నుండి మా తమ్మడు కూడా సినిమాలు వద్దు షూటింగ్‌లు వద్దు అని నాతో మాట్లాడం మానేశాడు. ఇంట్లో కూడా చెప్పేశాడు. బాగా తిట్టారు. ఆ బాధతో ఆత్మహత్యా ప్రయత్నం చేశా. కోలుకున్న తర్వాత ''నువ్వేం చేయాలనుకున్నా డిగ్రీ పూర్తి చెయ్యి. తర్వాత నీ ఇష్టమైనది చేసుకో'' అన్నారు. అందుకే మంచి పర్సంటేజ్‌తో ఇంజనీరింగ్ పూర్తి చేశా. ఆ సమయంలో నాన్న ఆరోగ్యం అస్సలు బాగాలేదు. చుట్టూ ఉన్న వాళ్ళు నా గురించి అమ్మతో ఏదో ఒకటి అంటుండేవారు. దాంతో ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే పెండ్లి చేశారు.
పెండ్లి తర్వాత...
మా మామయ్య గారు, మావారు చాలా సపోర్ట్ చేశారు. నా జీవితం గురించి ఎప్పుడైనా చెప్పుకోవాలంటే పెండ్లికి ముందు తర్వాత అని చెప్పుకుంటా. ఓ టీవీ ఛానల్లో ప్రోగ్రాం డైరెక్టర్‌గా, యాంకర్‌గా, న్యూస్ రీడర్‌గా చేశాను. పెండ్లి తర్వాతే చాలా షార్ట్ ఫిలిమ్స్ చేశాను. సినీ పరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా నా ఫ్రెండ్స్ సహాయంతో, నా కష్టంతో, నాకున్న టాలెంట్ ఈ స్థాయికి రాగలిగాను. ఆ తర్వాత కొన్ని ఆరోగ్య కారణాల వల్ల కొనసాగించలేకపోయాను. తర్వాత డిజైనింగ్ పైన ఉన్న ఆసక్తితో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్‌లో జాయిన్ అయ్యాను. అప్పటినుండి ఫ్యాషన్ డిజైనర్ అనే ఈ ప్రస్థానం మొదలైంది.
ఇది పోటీ ప్రపంచం
ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఫ్యాషన్ డిజైనింగ్ మామూలు విషయంలా మారిపోయింది. మూడు నాలుగేండ్ల నుండి ఫ్యాషన్‌లో చాలా మార్పులు వచ్చేశాయి. గల్లి గల్లికి ఓ బోటిక్ పెట్టేస్తున్నారు. ఇంత పోటీ ప్రపంచంలో మన పేరు ఉండాలి అంటే ఎప్పటికప్పుడు కొత్తదనం ట్రై చేయాలి. అదే విధంగా మన డిజైనింగ్‌లో కానీ వర్క్‌లో ఓ ప్రత్యేకత కనిపించాలి. అందుకే నేను చేసేదానిలో డిఫరెంట్ టైప్స్ కోరుకుంటాను. అదే విధంగా క్వాలిటీనీ కూడా మెయింటెన్ చేస్తాను.
ఎంతో కష్టపడ్డా...
ప్రసాద్ ల్యాబ్‌లో 'కర్మ' ప్రీమియర్ జరుగుతున్నప్పుడు నాకు ఆరో నెల. ప్రెగెంట్గా ఉండి ఫిలిం చేస్తున్నానని మా టీంలో ఇద్దరు ముగ్గురికి మాత్రమే తెలుసు. వాళ్లు చాలా కోప్పడ్డారు. వాళ్ళ మాట వినకుండా ఫిలిం పూర్తి చేశాను. ప్రీమియర్‌లో వాళ్లు నా స్ట్రగుల్ గురించి, పడ్డ కష్టం గురించి చెప్తూ ఉంటే చాలా గొప్పగా అనిపించింది. ఈ షార్ట్ ఫిలింకి వచ్చిన సెలబ్రిటీస్ అందరూ కూడా నన్ను చాలా మెచ్చుకున్నారు. వాళ్లు ఇచ్చిన దైర్యంతో ముందు ముందు ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేయబోతున్నాను.
అనాధపిల్లల కోసం...
తల్లిదండ్రులు ఉన్న పిల్లలకు ఏది కావాలంటే అది దొరుకుతుంది. కానీ అనాధ పిల్లలకి ఆ అవకాశం ఉండదు. అందుకే ప్రతి సంవత్సరం ఏదయినా ఓ అనాధ శరణాలయం చూసి ఆ పిల్లలకి నేనే స్వయంగా డ్రెస్ డిజైన్ చేసి ఫ్యాషన్ షో చేద్దాం అనుకున్నాను. నేను చేసినా డ్రెస్సెస్ సేల్‌లో పెట్టి వచ్చిన లాభం అంతా ఆశ్రమానికి ఇద్దాం అనుకున్నాను. అది ఈ సంవత్సరం నుండే మొదలుపెట్టాలనుకున్నా. కానీ కరోనా వల్ల నా ఆలోచనలు ముందుకు వెళ్లలేక పోయాయి. అంత సెట్ అయిన తర్వాత అనుకున్నది తప్పకుండా చేస్తాను.
ఇదే మా ప్రత్యేకత
ఎవరైనా కూడా క్వాలిటీ ప్రొడక్ట్స్‌ని వాడాలి అని చూస్తారు. అదే సూత్రాన్ని నేను పాటిస్తాను. లేబుల్ వేధాద్వి క్లోసెట్ ప్రత్యేకత ఏంటంటే కిడ్స్ వేర్. అప్పుడే పుట్టిన పసి పాప నుండి హ్యాపీగా ఎలాంటి ఇబ్బంది లేకుండా కంఫర్టబుల్‌గా ఉండేలా డిజైన్ చేయడం. దానికోసం ఏకో ఫ్రెండ్లీ ఆర్గానిక్ ఫాబ్రిక్స్, చేనేత బట్టతో చేసేటువంటివి వాటినే ఉపయోగిస్తాం. కేవలం పిల్లలకే కాకుండా టీనేజ్ అమ్మాయిలు, అబ్బాయిలు, పెద్దవాళ్ళు, వృద్ధులు ఇలా అందరు వేసుకునేలా డిజైన్ చేయడం మా ప్రత్యేకత. అలాగే ఎక్కువగా మాదగ్గర ఫ్యామిలీ కాంబో, కపుల్స్ డ్రెస్సెస్, బాల్ గౌన్స్, బ్రదర్ సిస్టర్ కాంబోస్, మామ్ అండ్ డాటర్ కాంబోస్ స్పెషల్‌గా చేస్తాం.