Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉద్యోగినులకు ఇంటి పనులు, ఆఫీస్ ఒత్తిళ్లు సర్వసాధారణమే అయినా.. కొంతమంది వీటిని అదుపు చేసుకోలేక ఒక్కోసారి పని ప్రదేశంలోనే ఎదుటివారిపై విరుచుకుపడుతుంటారు. దీన్నే 'వర్క్‌ప్లేస్ బర్నవుట్'గా పేర్కొంటున్నారు నిపుణులు. నిజానికి ఇలాంటి దీర్ఘకాలిక ఒత్తిడి ఆరోగ్యానికే కాదు.. కెరీర్ పైనా ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు. అందుకే దీన్ని ఆదిలోనే గుర్తించి మేనేజ్ చేసుకోవాలి.
ఆఫీస్ పని అన్నివేళలా మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు. అలాగే రోజురోజుకీ పనులు, బాధ్యతలు పెరుగుతుంటాయి. ఈ క్రమంలో రోజువారీ పనులు పూర్తి చేయడానికి తగిన ప్రణాళిక వేసుకోలేకపోవడం, సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గిపోయినప్పుడు పని భారమవుతుంది. ఇది క్రమంగా దీర్ఘకాలిక ఒత్తిడికి దారి తీస్తుంది.
మీరు నిర్దేశించుకున్న పనిని పూర్తి చేస్తామో లేదో అన్న సందిగ్ధం నెలకొన్నప్పుడు పనిపై ఏకాగ్రత క్రమంగా సన్నగిల్లుతుంది. వర్క్‌ప్లేస్ బర్నవుట్కి ఇదీ ఓ కారణమే!
ఉద్యోగుల మధ్య, ఉద్యోగులు-పై అధికారుల మధ్య పని విషయంలో పరస్పర అవగాహన ఉన్నప్పుడు ఎలాంటి ఆటంకం లేకుండా పనులు పూర్తవుతాయి. అదే తమ నుంచి పైఅధికారులు ఎలాంటి పనితనాన్ని ఆశిస్తున్నారో సంపూర్ణ అవగాహన కొరవడినప్పుడు మాత్రం పనిప్రదేశంలో దీర్ఘకాలిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సిందేనట!
పనిలో పోటీతత్వం మంచిదే కానీ.. ఈ క్రమంలో సహోద్యోగుల మధ్యలో తలెత్తే ఈర్ష్యాద్వేషాలు పని
వాతావరణాన్నే దెబ్బతీస్తాయి. దీంతో ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకోవడం, మన గురించి బాస్‌కు నెగెటివ్‌గా చెప్పడం.. వంటివి జరుగుతాయి. ఇలాంటివి భరించలేక ఒక్కోసారి విపరీతమైన ఒత్తిడికిలోనై ఆ కోపాన్ని ఇతరులపై చూపించే ప్రమాదం ఉంది.
ఇటు ఇంటి పనిని, అటు ఆఫీస్ పనుల్ని సమన్వయం చేసుకోలేక చాలామంది మహిళలు ఒత్తిడికి గురవుతుంటారు. తమ శక్తినంతా ఈ పనులకే వెచ్చించి తమకంటూ ప్రత్యేకంగా సమయం కేటాయించుకోవడమే మర్చిపోతుంటారు. ఇదీ పని ప్రదేశంలో దీర్ఘకాలిక ఒత్తిడికి దారి తీస్తుందట.
అదనపు పని భారం కూడా వర్క్‌ప్లేస్ బర్నవుట్‌కు కారణమవుతుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో అత్యుత్సాహంతో తలకు మించిన పని భారాన్ని నెత్తిన వేసుకోవడం, అన్ని పనులు నేనే చేస్తానన్న అతివిశ్వాసం శారీరకంగా, మానసికంగా ఒత్తిడిని పెంచుతాయి. తద్వారా పనిలో నాణ్యత సైతం తగ్గిపోతుంది.