Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పిల్లల అవసరాలను తీర్చడం, చదువు చెప్పించడంతో అమ్మానాన్నల బాధ్యత తీరిపోదంటున్నారు మానసిక నిపుణులు. వారిని మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దాలి. అందుకు ఈ సూత్రాలను పాఠాలుగా చెప్పమంటున్నారు అవేంటో చూద్దాం.
డబ్బు నిర్వహణ: పిల్లలకు అడిగినవీ, అడగనివీ... అన్నీ కొనివ్వడం వారి మీద ఉన్న ప్రేమ అనుకుంటున్నారు చాలామంది. అలా చేస్తే వారికి డబ్బు విలువ, దాని నిర్వహణ తెలియదు. రూపాయి సంపాదించాలన్నా... ఎంతో కష్టపడాలన్న విషయం వారికి అర్థమయ్యేలా చేయాలి. అంతేకాదు.. ఇంటి ఖర్చులను వారితో రాయించండి. అవసరాలు, సౌకర్యాలు, విలాసాల మధ్య తేడా అర్థమయ్యేలా చేయండి.
కథలు చెప్పండి: భార్యాభర్తలిద్దరూ రోజంతా ఎంత తీరిక లేకుండా గడిపేసినా రాత్రి మాత్రం వారితో గడపండి. ముఖ్యంగా నిద్రకు ముందు పిల్ల్లల్లో ఆలోచనా శక్తిని, స్ఫూర్తిని అందించే కథలను ఆసక్తికరంగా చెప్పండి. ఓ మంచి విషయాన్ని చర్చించండి.
బాధ్యత: పిల్లలు ఏ పనిచేసినా దానికి సంబంధించిన బాధ్యత వారే తీసుకునేలా అలవాటు చేయాలి. పెద్దలు కూడా చిన్నారులు చేసే పొరబాట్లను సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాలి. అప్పుడే వారు బాధ్యతాయుతమైన వ్యక్తులుగా మారతారు. తప్పు చేసినప్పుడు క్షమించమని అడగడం, ఇతరులకు సందర్భానుసారం 'కృతజ్ఞత' చెప్పడం, అలాగే తాను చేయాల్సిన పనికి సంకోచించకుండా 'ఎస్' అని అనగలగాలి. తను చేయలేని పనికి 'నో' చెప్పగలగడం చిన్నారులకు బాల్యం నుంచి నేర్పించాలి. దీంతోపాటు 'ప్లీజ్..దయచేసి' అనే పదం వారిలో ఇగో పెరగకుండా కాపాడుతుంది.
స్పందించే గుణం: తల్లిదండ్రులను చూసే పసివాళ్లు నేర్చుకుంటారు. మన్నన, సున్నితంగా మాట్లాడటం, ఇతరుల కష్టానికి స్పందించడం వంటివి తెలుసుకునేలా చేయాలి. అప్పుడే వారు అందరికీ ఆదర్శంగా ఉండగలుగుతారు.