Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిటపట చినుకులు తాకగానే ప్రకృతి పరవశించి పోతుంది... మన మనసు కొత్త ఉత్సాహాంతో ఊరకలేస్తుంది. ఒక్క మనసే కాదు... నాలుక కూడా కమ్మకమ్మని రుచులను కోరుకుంటుంది. టీ.. కాఫీతో పాటూ కాస్త కారంగా, వేడివేడిగా ఏమైనా తినాలని ఉవ్విళ్ళూరుతుంది. ఎప్పుడూ బజ్జీలు, పకోడీలేనా.. ఈసారి కాస్త కొత్తగా ప్రయత్నిద్దాం. అవేంటో మనమూ నేర్చుకుందాం... అటుకుల కబాబ్
కావల్సిన పదార్థాలు: అటుకులు - కప్పు, ఆలూ - నాలుగు, ఉల్లిగడ్డ ముక్కలు - ముప్పావుకప్పు, క్యారెట్ తురుము - పావుకప్పు, సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు - మూడు చెంచాలు, జీలకర్రపొడి - చెంచా, గరంమసాలా - చెంచా, చాట్‌మసాలా - చెంచా, ఉప్పు - తగినంత, శెనగపిండి - రెండు టేబుల్‌స్పూన్లు, నూనె - వేయించేందుకు సరిపడా.
తయారు చేసే విధానం: అటుకుల్ని శుభ్రంగా కడిగి నీళ్లు గట్టిగా పిండి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. వీటిలో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ ఒక్కొక్కటిగా వేసి ముద్దలా చేసుకుని... ఇనుపచువ్వలకు ఈ మిశ్రమాన్ని కబాబ్ వలె అద్దాలి. నాన్‌స్టిక్ పాన్ని స్టౌపైన పెట్టి ఈ కబాబ్‌లను ఉంచి నూనె వేస్తూ అన్నివైపులా ఎర్రగా కాల్చుకుంటే అటుకుల కబాబ్ సిద్ధం.
ఆలూ మురుకులు
కావల్సిన పదార్థాలు: ఉడికించిన ఆలూ - రెండు, వెల్లుల్లి ముద్ద - చెంచా, కారం - అరచెంచా, ఉప్పు - తగినంత, మొక్కజొన్నపిండి - మూడు టేబుల్‌స్పూన్లు, గుడ్డు - ఒకటి, చీజ్ తురుము - రెండు టేబుల్ స్పూన్లు, నూనె - వేయించేందుకు సరిపడా.
తయారు చేసే విధానం: ఉడికించిన ఆలూను తురిమి ఓ గిన్నెలో వేసుకోవాలి. ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ ఒక్కొక్కటిగా వేసి అన్నింటినీ కలిపి పావుగంట ఫ్రిజ్‌లో పెట్టాలి. తర్వాత నూనె రాసిన మురుకుల గొట్టంలోకి ఈ మిశ్రమాన్ని తీసుకుని వేడిచేసిన నూనెలో చక్రాల్లా వత్తి... ఎర్రగా వేగాక తీసుకోవాలి. వీటిని వేడివేడిగా సాస్‌తో కలిపి తినొచ్చు.
ఎగ్ 65
కావల్సిన పదార్థాలు: ఉడికించిన గుడ్లు - ఆరు, గుడ్డు - ఒకటి, మొక్కజొన్నపిండి - పావుకప్పు, కారం - రెండు చెంచాలు, గరంమసాలా - పావుచెంచా, ఉప్పు - తగినంత, అల్లం వెల్లుల్లి ముద్ద - అరచెంచా, నూనె - వేయించేందుకు సరిపడా, వెల్లుల్లి తరుగు - చెంచా, అల్లం తరుగు - చెంచా, కరివేపాకు రెబ్బలు - రెండు, పచ్చిమిర్చి తరుగు - చెంచా, పెరుగు - పావుకప్పు, కొత్తిమీర - కట్ట, బ్రెడ్‌పొడి - పావుకప్పు, చిల్లీసాస్ - ఒకటిన్నర చెంచా.
తయారు చేసే విధానం: ఉడికించిన గుడ్లను తురిమి దానిపైన మొక్కజొన్నపిండి, సగం కారం, గరంమసాలా, తగినంత ఉప్పు, అల్లంవెల్లులి ముద్ద, గుడ్డుసొన, బ్రెడ్‌పొడి వేసి బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల్లా చేసి వేడిగా ఉన్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. స్టౌమీద మరో బాణలి పెట్టి రెండు చెంచాల నూనె వేసి అల్లం, వెల్లుల్లి తరుగు, కరివేపాకు, పచ్చిమిర్చి వేయించి, పెరుగు, చిల్లీసాస్ కొద్దిగా ఉప్పు, మిగిలిన కారం, ముందుగా వేయించుకున్న ఉండల్ని కొత్తిమీర వేసి బాగా కలిపి రెండు నిమిషాలయ్యాక దింపేయాలి.
పనీర్ సమోసా
కావల్సిన పదార్థాలు: మైదా - రెండు కప్పులు, సోంపు- అరచెంచా, ఉప్పు - తగినంత, నూనె - వేయించేందుకు సరిపడా, సన్నని పనీర్ ముక్కలు - కప్పు, గరంమసాలా - పావుచెంచా, అల్లంవెల్లుల్లిముద్ద - చెంచా, క్యాప్సికమ్ తరుగు - పావుకప్పు, ఉల్లిగడ్డ ముక్కలు - పావుకప్పు, దనియాలపొడి - అరచెంచా, కొత్తిమీర - కట్ట, కారం - చెంచా, పచ్చిమిర్చి తరుగు - అరచెంచా, నిమ్మరసం - పావుచెంచా, జీడిపప్పు పలుకులు - రెండు చెంచాలు.
తయారు చేసే విధానం: మైదా, సోంపు, కొద్దిగా ఉప్పు ఓ గిన్నెలోకి తీసుకుని అన్నింటినీ కలపాలి. తర్వాత నీళ్లు పోస్తూ చపాతీపిండిలా కలిపి పైన చెంచా నూనె వేసి మరోసారి కలిపి మూత పెట్టాలి. స్టౌమీద కడాయి పెట్టి చెంచా నూనె వేయాలి. అది వేడయ్యాక ఉల్లిగడ్డ ముక్కలు, అల్లంవెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి. అవి వేగాక గరం మసాలా, క్యాప్సికమ్ తరుగు, దనియాలపొడి, కొత్తిమీర తరుగు, కారం, తగినంత ఉప్పు పనీర్‌ముక్కలు, జీడిపప్పు పలుకులు, నిమ్మరసం వేసి ఓసారి కలిపి దింపేయాలి. నానిన మైదాపిండిని మరోసారి కలిపి చిన్న ముద్దను తీసుకుని చపాతీలా వత్తాలి. దీన్ని మధ్యకు కోసి త్రికోణాకారంలో చుట్టుకుని అందులో చెంచా పనీర్ మిశ్రమం వేసి అంచుల్ని తడిచేత్తో మూసేయాలి. ఇలా అన్నింటినీ చేసుకుని కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించి తీసుకోవాలి.