Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తుంటారు చాలా మంది. మనలో చాలా మంది కనీసం ఒక్క సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ అయినా ఉపయోగిస్తున్నాం. అయితే సోషల్ మీడియాతో ఎన్ని ప్రయోజనాలున్నాయో, అన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని గుర్తుంచుకోవాలి. వీటి ద్వారా స్నేహితులు, బంధువులతో టచ్‌లో ఉండటం వినోదభరితంగా ఉంటుంది. కానీ ఇది మన ఆలోచనా విధానాన్నే పూర్తిగా మార్చేస్తుంది. మన రోజువారీ జీవితంపై ఎంతగానో ప్రభావం చూపుతుంది. ఈ సోషల్ మీడియా మనపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎటువంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.
దుర్వినియోగం, వేధింపులు
సోషల్ మీడియాలో ఉన్న అతి పెద్ద సమస్య ఏమిటంటే, డేటా దుర్వినియోగం, వేధింపులు. సైబర్ నేరగాళ్లు యూజర్ అకౌంట్ల నుంచి డేటా సేకరించి వేధింపులు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా మహిళల విషయంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. కొంతమంది కేటుగాళ్లు సోషల్ మీడియా ద్వారా యువతులతో పరిచయం పెంచుకొని తర్వాత వారిని వేధిస్తున్నారు. మరికొందరు డబ్బులు కాజేస్తున్నారు.
ఆందోళన, ఒంటరితనం
సోషల్ మీడియాతో ప్రపంచంతో కనెక్ట్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ, దీనితో నష్టాలు కూడా ఉన్నాయి. ఇది మీలో ఆందోళన, ఒంటరితనం భావాలను రేకెత్తిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మీ డేటాకు భద్రత ఉంటుందా? లేదా? అనే దానిపై ఎక్కువ ఆందోళన చెందుతుంటారు. మరోవైపు, ఎక్కువ సమయంలో సోషల్ మీడియాలో గడపడం వల్ల ఇతరులతో ప్రత్యక్షంగా సంబంధాలు ఏర్పర్చుకోలేరు. ఇది భవిష్యత్తులో మీ ఒంటరితనానికి దారి తీస్తుంది.
అసత్య ప్రచారం
సోషల్ మీడియాలో ఎన్నో అసత్య వార్తలు చక్కర్లు కొడుతుంటాయి. వాటిని నిజమేనని నమ్మి మోసపోతుంటాం. అంతేకాక, సోషల్ మీడియా మన కొత్త ఆలోచనలకు పరిమితం చేస్తుంది. తద్వారా మన ఆలోచనకు మద్ధతివ్వని వారిపై కోపం పెరుగుతుంది. ఇది క్రమంలో హింసకు దారితీస్తుంది.
వీటి నుంచి ఎలా బయటపడాలి?
సోషల్ మీడియాను ఉపయోగించడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. కాబట్టి ఈ ప్లాట్‌ఫారమ్‌లకు పూర్తిగా దూరం కాకూడదు. అయితే సోషల్ మీడియా మీకు హాని చేస్తుందా? లేదా? అనే విషయాన్ని అంచనా వేసుకోండి. వీటి ద్వారా మీకు ప్రయోజనాలకంటే దుష్రభావాలే ఎక్కువగా ఉన్నట్టు భావిస్తే వాటిని వెంటనే అన్ఇన్స్టాల్ చేయండి. అయితే మీ నుంచి సోషల్ మీడియాను పూర్తిగా వేరుచేయడం చాలా కష్టం. కానీ, ఇలా చేయడం ద్వారా అపారమైన సానుకూల ప్రయోజనాలు కలుగుతాయని గుర్తించుకోండి.