Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇప్పుడు లాక్డౌన్ ఎత్తేశారు. అందరూ బయట తిరుగుతున్నారు. ఎక్కడా పోలీసులు అడ్డుకోరు. కానీ మనకు మనమే లాక్డౌన్ విధించుకోవాలి. ఎందుకంటే డెల్టా, డెల్టా ప్లస్ అనే వేరియంట్లతో కరోనా వైరస్ మానవుల కోసం ఎదురు చూస్తోంది. ప్రస్తుతం మనుష్యులందరూ వ్యాక్సిన్లు వేయించుకుంటున్నారు. కొన్ని లక్షల మంది మొదటి డోసు, మరి కొన్ని లక్షల మంది రెండవ డోసు వేయించుకుని ఉన్నారు. అందుకే కరోనా వైరస్ కూడా తెలివిగా ఒకడుగు ముందుకేసి కొత్త మ్యుటేషన్స్ చేసుకొని డెల్టా, డెల్టాప్లస్గా తయారై మనముందుకొస్తోంది. యుద్ధంలో కొత్త శక్తుల్ని తెచ్చుకుంటున్నది. మరి మనమేం చేయాలి. దానికి దొరక్కుండా ఉండేందుకు మనం ఇంట్లోనే ఉన్నామనుకోండి... ఏం చేస్తుంది కరోనా. తోక ముడుస్తుంది ఆహారం లేక. ఎవరూ పని లేకుండా బయటికి వెళ్ళి దానికి ఆహారం అందించవద్దు. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకండి. ఒకవేళ వెళ్ళినా మాస్క్, శానిటైజర్ అనే ఆయుధాలు ధరించండి. ఇంట్లోనే ఉండి మంచి బొమ్మలు చేసుకోండి.
ఇంజక్షన్ సీసాల మూతలతో...
బయోటాక్స్, మెగాసివి, డెకడ్రాన్ వంటి అనేక ఇంజక్షన్ల సీసాలకు సెఫ్టీగా ప్లాస్టిక్ మూతలతో సీల్ చేయబడి ఉంటాయి. ఈ ప్లాస్టిక్ మూతలతో నేను ఈసారి నీళ్ళలోని జీవిని తయారు చేశాను. మనం ఎప్పుడూ భూమి పైన నివసించే జంతువుల బొమ్మల్నే చేసుకుంటున్నాం. అందుకే ఈసారి నీటిలో నివసించే వాటిని ఎన్నుకున్నాను. చిన్నప్పుడు ప్రతివారూ ''అనగనగా ఒక రాజు. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు. వారు వేటకు వెళ్ళి ఏడు చేపలు తెచ్చారు. ఈరోజు ఆ ఎండని ఏదో చేప గురించి తెలుసుకుందాం. దాన్ని తయారు చేద్దాం. చేపలు, తాబేళ్ళు, మొసళ్ళు వంటి జంతువులన్నింటిని ''ఆక్వాటిక్ యానిమల్స్'' అంటారు. చేపలు ఉప్పునీటిలోనూ, మంచినీటి సరస్సులలోనూ జీవిస్తాయి. ఇవి ప్రధానంగా శీతల రక్త జీవులు. ఇవి మెత్తటి శరీరం గల జీవులు. చేపల్లో ఎన్నో రకాలు ఉంటాయి. వీటిలో విద్యుత్ చేపలు కూడా ఉంటాయి. ఎవరైనా పట్టుకోవడానికి చేపను తాకినప్పుడు షాక్ కొడుతుంది. కొద్దిసేపు అచేతనంగా పడిపోతారు. చేప తన ఆత్మరక్షణకు ఇలా ఏర్పాటు చేసుకుంది. చేపలు కార్టేటా వర్గానికి చెందిన జీవులు. సరే ఇంతకీ రంగుల మూతలతో చేపను చక్కగా తయారు చేసి నీళ్ళలో ఈదుతున్నట్టుగా కూడా చూపించాం. మీరు ప్రయత్నించండి.
పాపడాలతో...
రంగురంగుల పాపడాలు. రకరకాల ఆకారాలతో ఎన్నో మార్కెట్లో దొరుకుతున్నాయి. పెండిండ్లలో ఇలా కనువిందు చేసే పాపడాలనే ఎక్కువగా వాడుతున్నారు. ఈ పాపడాలతో ఎన్నో రకాల బొమ్మలు చేశాం. ఈరోజు చేపను చేశాను. వెజిటేరియన్ వాళ్ళకు ఇలా వడియాల చేపను, కోడిని వండి పెడదాం. వడియాలలో రింగులు, వీల్స్, బ్యాట్స్, బెండకాయలు, గొట్టాలు అంటూ ఎన్నో ఆకారాల్లో లభ్యమవుతున్నాయి. సైన్స్‌లోని పరిణామ సిద్ధాంతం ప్రకారం జీవం మొదటిగా నీటిలోనే పుట్టింది. అలా నీటిలో పుట్టిన జలపుష్పాలనే చేపల్ని తయారు చేద్దాం. ఇది కేవలం నీటిలోనే జీవించగలవు. దాదాపు నలభై రకాల చేపలను మానవులు తినడానికి వాడుతున్నారు. చేపలు పట్టటమనే వృత్తిలో ఎక్కువ మంది ఉపాధి పొందుతున్నారు. సముద్రాలలోనూ, చెరువులలోనూ, వాగులలోనూ వలలు తీసుకొని వేటాడుతుంటారు. పాముల్లాంటి చేపలు 'ఈల్'లు, ఎగిరే చేపలు 'ఎక్సోసీటస్'లు, పొడవు ముక్కు చేప 'ప్రిస్టిస్'లు వంటి ఎన్నో విచిత్ర చేపలున్నాయి. సాలమన్‌లు, కాడ్లు, క్యాట్‌ఫిష్‌లు, గ్రూపర్, ఎనాబాస్, యాంకోవీ, స్కేట్ఫిష్, గోబీఫిష్, స్నాపర్, బెట్టా, బటర్‌ఫ్లై ఫిష్, క్లోన్‌ఫిష్ వంటి ఎన్నో రకాల చేపలున్నాయి.
పెన్సిల్ పొట్టుతో...
పిల్లలకు పెన్సిల్ చెక్కడమంటే చాలా ఇష్టం. అదీ షార్పెనర్తో చెక్కుతుంటే గుండ్రంగా మెలికలు తిరుగుతూ పొట్టు వస్తుంటే చాలా సంతోషం. అందుకే పెన్సిల్ ముక్కు విరగ్గొట్టి మరీ చెక్కుతూ ఉంటారు. అస్పర పెన్సిళ్ళు నెమలి ఫించం రంగుతో బాగుంటాయి. అలాగే నటరాజ్ పెన్సిళ్ళు ఎరుపు నలుపు చారలతో ఉంటాయి. వీటిని చెక్కినపుడు వచ్చే పొట్టు డిజైన్లుగా వస్తుంది. అయితే ప్రస్తుతం మనం చేయబయే చేపకు చాలా రంగుల పెన్సిళ్ళ పొట్టు వాడాను. కొన్ని పెన్సిళ్ళు అన్ని రంగులతో సాదాగా గుండ్రంగా ఉంటాయి. హిమాలయా షాప్‌లో ఇంటి అరుదైన వెరైటీలు దొరుకుతాయి. ముందుగా ఒక డ్రాయింగ్ షీటుపై చేప బొమ్మను గీసి ఉంచుకోవాలి. దానిపై వరుసల్లో రంగురంగుల పొట్టును వరసగా అతికించుకుంటూ పోవాలి. చేపలకు మొప్పలు ఉంటాయి. ఇవి మొప్పల ద్వారానే గాలి తీసుకుంటాయి. వాటికి మనలాగా ఊపిరితిత్తులు ఉండవు. చేపలు మొదటగా కేంబ్రియన్ యుగంలో కనిపించాయి. తర్వాత పరిణామం చెంది పేలియోజోయిక్ యుగంలో నివసించాయి.
ఆకులతో...
ఈ మధ్య బెంగుళూరులో ఉండటం వల్ల ఎక్కువగా ఆకులు, పువ్వులతోనే జంతువులిన రూపొందిస్తున్నారు. ఈరోజు ఒక చేపను ఆకులతో చేశాను. దీర్ఘ అండాకారంలో ఉన్న ఒక పెద్ద ఆకును తీసుకొని తెల్లని కాగితంపై అతికించాను. దానిలో తల భాగాన్ని వేరు చేస్తూ కరివేపాకు రెమ్మల పుల్లను వంచి అతికించాను. కన్ను కోసం స్కెచ్ పెన్నుతో దిద్దాను. ఇక మొప్పలు, తోక మాత్రమే పెట్టాలి. మొప్పల కోసం క్రోటన్ మొక్కల ఆకుల్ని తుంచి అమర్చాను. తోకకు ఏ ఆకులు పెడదామా అని ఆలోచిస్తుండగా డ్రౌండ్లో ఉన్న వేపచెట్టు కనిపించింది. ఈ ఆకుకు ఒకవైపకకు రంపపు పళ్ళలాగా ఉన్నాయి. ఇది తోకకు బాగుంటుందని అతికించాను. ఆకులతో చేప తయారైంది. కాడ్ చేపలు ఎక్కువ సంఖ్యలో గుడ్లను పెడుతుంది. అందులో ఒకటి రెండు మాత్రమే బతుకుతాయి. పెట్టిన గుడ్లన్నీ ఏ అటంకం లేకుండా చేపలుగా అయితే ప్రపంచం మొత్తం కాడ్ చేపలతోనే నిండిపోతుందంట.
మాస్కులతో...
మాస్కే మన ఆయుధం. మాస్క్ లేకుండా ఎవరూ కనిపించటం లేదు. కరోనాతో పోరాడటానికి మాస్క్నే వజ్రకవచంలా ధరించాలి. నేను ఇలా వాడేసిన మాస్కులతో బొమ్మల్ని చేస్తున్నాను. ఇంట్లో వారికి ఏ జబ్బులూ లేకుండా, ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే పెట్టుకునే మాస్కులను వాడుతున్నారు. బయటికి వెళ్ళివచ్చే వారి మాస్కుల్ని వాడరాదు. దాని మీద వైరస్ ఉండే అవకాశముంది. మాస్క్ రెండు చివరలు కత్తిరించేసి, దానిని మడిచి పువ్వులా కుట్టాలి. ఇలాంటి పూలతో చేప ఆకారాన్ని తీసుకువచ్చాను. చేపల్లో గోల్డ్‌ఫిష్ చాలా అందంగా ఉంటుంది కదా! ఇప్పుడు అందరూ ఇళ్ళలో యాక్వేరియమ్లు పెట్టి చేపల్ని పెంచుకుంటున్నారు. వాటిలో ఆరెంజ్ ఫిష్ కూడా ఉన్నత స్థానంలోనే ఉంది. ఈ విధంగా చేపలు కూడా పెంపుడు జంతువులే.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్