Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నళిని పీజీ పూర్తి చేసింది. ఆమెకు ఓ తమ్ముడు. బాధ్యత తెలిసిన అమ్మాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం చాలా ప్రయత్నించింది. కానీ రాలేదు. దాంతో ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్‌గా చేరింది. అయితే ప్రభుత్వ ఉద్యోగం వచ్చే వరకు పెండ్లి చేసుకోకూడదనుకుంది. అలా ముఫ్పై ఏండ్లు వచ్చేశాయి. దాంతో ఇంట్లో కచ్చితంగా పెండ్లి చేసుకోవల్సిందేనని పట్టుబట్టారు. తల్లిదండ్రులను ఇక ఇబ్బంది పెట్టలేక చివరకు ఒప్పుకుంది. ఓ సంబంధం వస్తే పెండ్లి చూపులు ఏర్పాటు చేశారు. అతని పేరు శ్రీకాంత్. అతను ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా చేస్తున్నాడు.
పెండ్లి చూపులకు వచ్చినప్పుడు తనకు ఎవరూ లేరని, ఒంటరి వాడినని చెప్పాడు. 'నా' అనే వాళ్ళు లేని వ్యక్తికి పిల్లలను ఇవ్వడం ఇష్టం లేక ఇంట్లో పెండ్లికి వద్దన్నారు. అయితే శ్రీకాంత్ మాత్రం పెండ్లి చూపుల తర్వాత నళినితో రెగ్యులర్‌గా ఫోన్లో మాట్లాడేవాడు. అతను పని చేస్తున్న స్కూల్‌కి ఆమె ఓ సారి వెళ్ళింది. అక్కడి వాళ్ళు కూడా శ్రీకాంత్ చాలా మంచివాడని చెప్పారు. దాంతో నళినికి అతనిపై ఇష్టం పెరిగిపోయింది. కూతురు ఇష్టాన్ని కాదనలేక తల్లిదండ్రులు వెంటనే నిశ్చితార్థం చేసేశారు.
పెండ్లి వారం ఉందనగా శ్రీకాంత్ తనకు అక్క, మామయ్య ఉన్నారని, కానీ వాళ్ళకూ తనకు పడదని, పెండ్లికి పిలవనని చెప్పాడు. అలా చేయడం మంచిది కాదనీ, వాళ్ళను కూడా పెండ్లికి పిలవాల్సిందిగా నళినీ ఎంద చెప్పినా అతను వినిపించుకోలేదు. ఎవరి కోసమో పెండ్లికి ముందు శ్రీకాంత్‌తో గొడవలెందుకని నళినీ వదిలేసింది. తర్వాత ఈ విషయాన్ని ఆమె కూడా పెద్దగా పట్టించుకోలేదు.
పెండ్లి తర్వాత శ్రీకాంత్‌లో చాలా మార్పు వచ్చింది. భార్యా ఎవరితో మాట్లాడినా అనుమానించే వాడు. ఎవ్వరితో మాట్లాడొద్దని షరతు పెట్టేవాడు. చివరకు సొంత తమ్ముడితో కూడా మాట్లాడనిచ్చే వాడు కాదు. ఇంకా చెప్పాలంటే ఇంటి పక్కన ఉండే చిన్నపిల్లలతో మాట్లాడినా అతనికి అనుమానమే. నళితో మాత్రం చాలా ప్రేమగా ఉండేవాడు.
చిన్నప్పటి నుండి ఒంటరిగా పెరిగాడు, బంధాల గురించి తెలీదు, చిన్నగా అతనే అర్థం చేసుకుంటాడులే అనుకుంది. కాని అతని ప్రవర్తన రోజురోజుకూ మితిమీరిపోయింది. పెండ్లయిన మూడు నెలలకు స్కూల్‌కి వెళ్ళడం మానేశాడు. ఎందుకు మానేశావని అడిగితే సమాధానం చెప్పడు. మరీ గట్టిగా అడిగితే ఇంట్లో నుంచి వెళ్ళిపోయేవాడు. ఉదయం వెళ్ళి అర్థ రాత్రి వచ్చే వాడు. చివరకు నళినీ ఓ రోజు ఉద్యోగం విషయంలో శ్రీకాంత్‌తో గొడవపెట్టుకుంది. దాంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పదిరోజుల వరకు రాలేదు. ఇలా రెండు సార్లు చేశాడు. చుట్టుపక్కల వారికి విషయం తెలిస్తే పరువు పోతుందని నళిని, శ్రీకాంత్‌ని ఏమీ అనేది కాదు. ఇంటి ఖర్చులన్నీ తనే చూసుకునేది.
ఇలాంటి పరిస్థితుల్లోనే నళిని నెల తప్పింది. ఇటు ఇంటి ఖర్చులు, అటు ఆస్పత్రి ఖర్చులు. మొత్తానికి ఆమె జీతం ఇంట్లో సరిపోయేది కాదు. ఇప్పటికైనా భర్త మారతాడని చాలా ఆశపడింది. కానీ అతనికి బాధ్యత పట్టదు. ఉద్యోగం చూసుకోమని బతిమలాడింది. చివరకు ఆమె బాధ భరించలేక ఓ స్కూల్లో చేరాడు. వారం రోజులు వెళ్ళి మానేశాడు. నళికి ఐదో నెల వచ్చింది. ఓరోజు శ్రీకాంత్‌ను కూర్చోబెట్టి 'నాకు ఎనిమిదో నెల వస్తే కాలేజీకి వెళ్లలేను. డెలివరీ తర్వాత కూడా కనీసం ఆరునెలలు సెలవు పెట్టాలి. నువ్వు ఉద్యోగం చూసుకోకపోతే ఇల్లు గడవడం కష్టం' అని చెప్పి కాలేజీకి వెళ్ళిపోయింది.
అలా భార్య కాలేజీకి వెళ్ళిందో లేదో అతను కూడా బయటకు వెళ్ళిపోయాడు. రాత్రి పదిగంటలైనా ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే ఎత్తలేదు. తర్వాత రోజు కూడా ఇదే పరిస్థితి. ఇది అతనికి అలవాటే కదా, వారం పోతే తనే వస్తాడులే అనుకుంది నళిని. కానీ నెల గడిచినా రాలేదు. ఇంట్లో వెదికితే అతని సర్టిఫికేట్లు, ఆధార్‌కార్డు కూడా తీసుకెళ్ళిపోయాడు. దాంతో వాళ్ళకు అనుమానం వచ్చింది. నళినీ తమ్ముడు బావ కోసం చాలా తిరిగాడు. అయినా దొరకలేదు. ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్. ఇక ఏమీ చేయలేక ఊరుకున్నారు. నళినీకి నెలలు నిండాయి. బాబు పుట్టాడు. అయినా అతని నుండి ఫోన్ లేదు. ఇప్పుడు బాబుకు నాలుగో నెల. అతని జాడ తెలీదు. కేసు పెడదామంటే పరువు పోతుందని ఇంట్లో ఒప్పుకోవడం లేదు. ఆ మనిషిని ఏం చేయాలో, ఎలా బతకాలో ఆమెకు తెలియలేదు. అందుకే ఇంట్లో ఎవరికీ తెలియకుండా నాలుగు నెలల బాబును తీసుకుని నళినీ ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చింది.
'పెండ్లి చేసుకొని, ఓ బిడ్డకు తల్లిని చేసి మోసం చేసి వెళ్ళిపోయాడు. అతన్ని ఊరికే వదలను. పెండ్లికి ముందే అబద్దాలు చెప్పాడు. అతని మాయమాటలు నమ్మి మోసపోయాను. అప్పుడే మా అమ్మానాన్న చెప్పినట్టు వింటే నా జీవితం ఇలా ఉండేది కాదు. ఇప్పుడు నేను అతన్ని వదలను. అందుకే అమ్మతో కాలేజీకి వెళ్ళస్తానని చెప్పి మీ దగ్గరకు వచ్చాను. మీరే నాకు సాయం చేయాలి' అంటూ ఏడ్చేసింది.
నళిని చెప్పింది విన్న సభ్యులు 'నీ భర్త చిన్నప్పటి నుండి బాధ్యతలు తెలీకుండా పెరిగాడు. గతంలో ఎక్కడెక్కడో తిరుగుతుండేవాడు. ఇప్పుడు పెండ్లి చేసుకొని ఓదగ్గర ఉండలేకపోతున్నాడు. అందుకే ఇలా చేస్తున్నాడు. నువ్వు ఉద్యోగం గురించి అడిగిన ప్రతిసారి ఇంట్లో నుండి పారిపోయి నిన్ను భయపెడుతున్నాడు. నీకు ప్రెగెన్సీ కన్ఫామైన తర్వాత కచ్చితంగా ఉద్యోగం చేయాల్సి వచ్చింది. దాంతో నీకు పూర్తిగా కనిపించకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడతను ఎక్కడ ఉన్నాడో తెలియాలంటే పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి కేసుపెట్టాల్సిందే. ఈ విషయంలో నీకు మా వాళ్ళు సాయం చేస్తారు. వెంటనే నువ్వు కేసు పెట్టు. అలాగే మీ ఇంట్లో కూడా ఈ విషయాలు చెప్పు. ఒంటరిగా బాబుతో తిరగం చాలా కష్టం' అని చెప్పి పంపారు.
తర్వాతి రోజు నళిని, ఐద్వా వాళ్ళ సాయంతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్ళి కేసు పెట్టింది. పోలీసులు వెంటనే స్పందించి అతని మేనమామను పట్టుకొచ్చారు. అతను మాట్లాడుతూ 'సార్ నెల రోజుల కిందట శ్రీకాంత్ నాకు ఫోన్ చేశాడు. కాని ఎక్కడ ఉన్నాడో తెలీదు. అసలు వాడు భార్యను వదిలిపెట్టి వెళ్ళిపోయిన సంగతి కూడా నాకు తెలీదు. మళ్ళీ నాకు ఫోన్ చేస్తే వివరాలు కనుక్కొని చెబుతా' అని చెప్పి వెళ్ళిపోయాడు.
శ్రీకాంత్ వాళ్ళ అక్క అడ్రస్ తెలుసుకొని ఆమె దగ్గరకు కూడా వెళ్ళి రమ్మని సభ్యులు నళినికి చెప్పారు. తన తమ్ముడినీ, బాబును తీసుకొని నళినీ ఆమె దగ్గరకు వెళ్ళింది. ఆమెకు కూడా అతను ఎక్కడ ఉన్నాడో తెలీదని, తెలిస్తే ఫోన్ చేస్తానంది. అప్పటి నుండి శ్రీకాంత్ వాళ్ళ అక్కకు నళినీ రెగ్యులర్‌గా ఫోన్ చేసేది. మూడు వారాల తర్వాత నళినీ మళ్ళీ లీగల్‌సెల్‌కు వచ్చి 'శ్రీకాంత్ ఈ వారం రోజుల్లో నాకు రెండు సార్లు ఫోన్ చేశాడు. పదిహేను రోజుల్లో వస్తానన్నాడు.
కాని తనతో ఎలాంటి గొడవలు పెట్టుకోనంటేనే వస్తానంటున్నాడు. నేను కూడా సరే అన్నా. మీ దగ్గరికి వచ్చానని తెలిసే అతను నాకు ఫోన్ చేశాడు. అతను వచ్చాక మీ దగ్గకు తీసుకొస్తా. ఓసారి గట్టిగా వార్నింగ్ ఇస్తే చాలు. ఈ విషయమే మీకు చెప్పాలని వచ్చాను' అంది. దానికి సభ్యులు నళినితో 'నువ్వు చెప్పింది బాగానే ఉంది. అతను వచ్చాక తీసుకురా. అతనితో మేం మాట్లాడతాం. అవసరమనుకుంటే పోలీసులతో కూడా మాట్లాడిద్దాం' అని చెప్పి పంపారు. చెప్పిన ప్రకారమే శ్రీకాంత్ పదిహేను రోజుల్లో ఇంటికి వచ్చాడు. వారం రోజుల తర్వాత, నళినీ అతన్ని తీసుకొని లీగల్‌సెల్‌కు వచ్చింది.
'చూడు శ్రీకాంత్ నీ భార్య బాధ్యత తెలిసిన అమ్మాయి. ఇద్దరూ చదువుకున్న వాళ్ళు. బాబు ఉన్నాడు. ఇంత ఆనందాన్ని వదులుకొని ఎక్కడెక్కడో తిరుగుతున్నావు. కుటుంబ సంబంధాలు మనుషుల్ని ఓ దగ్గరకు చేరుస్తాయి. కాని నువ్వు ఆ బంధాలకు దూరంగా తిరుగుతున్నావు. అనవసరంగా మంచి సంసారాన్ని పాడుచేసుకోకు. నీ భార్యను, బాబును ప్రేమగా చూసుకో. ఈ రోజుల్లో ఇద్దరూ కష్టపడితేనే ఇల్లు గడవడం కష్టం. నళినితో పాటు నువ్వూ ఉద్యోగం చూసుకో' అన్నారు. ఇలా దాదాపు మూడు నెలల పాటు శ్రీకాంత్‌కు కౌన్సెలింగ్ ఇచ్చారు. కానీ శ్రీకాంత్ మాత్రం నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడేవాడు కాదు.
చివరకు శ్రీకాంత్ ఓరోజు 'మేడమ్, మీరు మా మంచి కోసం ఎన్నో విషయాలు చెప్పారు. మీ దగ్గరికి ఎంతో మంది వస్తున్నారు. అందరితో ఎంతో ఓపికతో మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా మారకపోతే నేను మనిషినే కాను. ఇకపై నా భార్యను, బాబును ప్రేమగా చూసుకుంటా' అన్నాడు.
దానికి సభ్యులు 'నీలో మార్పు వచ్చినందుకు చాలా సంతోషం. నువ్వంటే నీ భార్యకు చాలా ఇష్టం. అలాంటి ఆమెను ఇంకెప్పుడు బాధపెట్టకు' అన్నారు. సభ్యులు చెప్పిన దానికి శ్రీకాంత్ సరేనని భార్యను, బాబును తీసుకొని సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. రెండు నెలల తర్వాత నళినీ లీగల్‌సెల్‌కు ఫోన్ చేసి 'శ్రీకాంత్ ఓ స్కూల్లో ఆన్లైన్ క్లాసులు చెప్పడానికి చేరాడు. చాలా బాధ్యతగా ఉంటున్నాడు. చాలా సంతోషంగా ఉంది. ఇదంతా మీ వల్లనే జరిగింది' అని చెప్పి సంతోషంగా ఫోన్ పెట్టేసింది.
- సలీమ