Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చాలామంది ఈ కరోనా సమయంలో ఇంట్లోనే చిన్న చిన్న వ్యాయామాలు చేయడం అలవాటుగా చేసుకుంటున్నారు. ఇదో మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. మీరూ ఇలా ఇంట్లోనే వ్యాయామం చేయాలనుకుంటే ఎలాంటి పరికరాలు అవసరం లేకుండా చేయగలిగే ఈ వ్యాయామాలను ఓసారి ప్రయత్నించండి.
టక్ జంప్: మోకాళ్లపై చేతులు పెట్టి నిలబడాలి. మోకాళ్లను కొద్దిగా ముందు వైపు వంచాలి. కాళ్లను నేలకు వత్తి పెట్టి ఎగిరే ప్రయత్నం చేయాలి. చేతులను బాగా స్ట్రెచ్ చేయాల్సి ఉంటుంది. దీన్ని మీరు అలసిపోయే వరకు చేయాలి.
ప్లాంక్ పుషప్స్: దీనికోసం మీ శరీరాన్ని ముందు ప్లాంక్ పొజిషన్లోకి తీసుకురావాలి. అంటే కింద బోర్లా పడుకొని చేతులు, కాలి వేళ్లపై మీ బరువు ఉండేలా చూసుకోవాలి. అరచేతులు కింద పెట్టి శరీరం బరువు దానిపై ఉండేలా చూసుకోవాలి. మీ పొట్టపై ఒత్తిడి పడితే మీరు సరైన పొజిషన్లో ఉన్నట్టు లెక్క. మీరు ఎంత సేపు చేయగలుగుతారో అంతసేపు దాన్ని కొనసాగించండి. ఒక్కో చేతిపై భారం వేస్తూ మరో చేతిని వీపుపై పెడుతూ దీన్ని చేస్తుండాలి.
లంజెస్: ఈ వ్యాయామం చేయడం చాలా సులభం. మీ కాళ్లను భుజాల అంత వెడల్పుతో దూరంగా ఉంచి నిటారుగా నిలబడాలి. ఆ తర్వాత ఒక కాలిని ముందుకు జరపాలి. ఆ కాలిని మోకాలు దగ్గర వంటి 90 డిగ్రీల కోణంలో ఉండేలా చూసుకోవాలి. ఇలా చేస్తున్నప్పుడు మరో కాలిని పూర్తిగా నేలపై ఆనించకుండా కేవలం వేళ్లు మాత్రమే నేలపై ఆనేలా వంచాలి. నడుము నిటారుగా ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం అలవాటయ్యాక చేతుల్లో నీళ్ల బాటిల్స్ పట్టుకొని చేయడం వల్ల కష్టంగా మార్చుకుంటూ పోవచ్చు.
స్టెపప్: ప్రతి ఇంట్లోనూ మెట్లు ఉంటాయి. మరీ ఎత్తుగా కాకుండా కాస్త ఎత్తుగా ఉండే మెట్టును ఎంచుకోవాలి. ముందు ఎడమ కాలిని ఆ మెట్టుపై పెట్టి బరువంతా ఆ కాలిపై ఉంచి మరో కాలిని గాలిలో ఉంచాలి. ఆ తర్వాత ఇంకో కాలిని కూడా ఈ మెట్టుపై ఉంచి ఎడమ కాలిని కిందకి దింపాలి. ఇప్పుడు ఇదే పద్దతిని మరో కాలితో కూడా కొనసాగించాలి. ఇలా ఒక్కో కాలితో పది నుంచి పదిహేను సార్లు చేయాలి.
వాల్ సిట్: చిన్నప్పుడు స్కూల్లో గోడ కుర్చీ వేసే అలవాటు మీకుంటే ఇది మీకు సులువే. గోడకు వీపు ఆనించి నిలబడాలి. కాళ్లు ముందుకు జరిపి కుర్చీలో కూర్చున్నట్లుగా గోడకు ఆనించి పాదాలపై బరువు ఉండేలా చూసుకోవాలి. మీకు వీలైనంత సేపు ఈ పొజిషన్లో ఉండడం మంచిది.