Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒకప్పుడు పేదరికంతో శిక్షణకు దూరమైన ఆమె ఇప్పుడు మన దేశ చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పింది. వెనుకబడిన ప్రాంతంలో పుట్టిన ఈ ఆదివాసీ బిడ్డ దేశానికి మూడు స్వర్ణపతకాలు తెచ్చిపెట్టింది. ఒకే టోర్నమెంట్లో మూడు బంగారు పతకాలు సాధించి ఆర్చరీ చరిత్రలోనే తన పేరును సువర్ణ అక్షరాలతో రాయించుకుంది. ఆమే దీపికా కుమారి. ఇటీవల పారిస్‌లో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ టోర్నమెంట్లో అద్భుతమైన ప్రతిభను కనబరిచిన ఆమె గురించి...
దీపికా కుమారి జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ పట్టణానికి సమీపంలో ఉండే రాతు చట్టి అనే గ్రామంలో 1994, జూన్ 13న ఈమె పుట్టారు. తండ్రి శివనారాయణ్ మహాటో, ఆటో డ్రైవర్. తల్లి గీతా మెడికల్ కాలేజీలో నర్సుగా పని చేస్తున్నారు. దీపికా చిన్నతనంలో రాళ్ళతో మామిడి పండ్లను లక్ష్యంగా చేసుకుని విలువిద్యను నేర్చుకుంది. విలువద్య నేర్చుకోవాలనే ఆమె కలను నిజం చేసుకోవడానికి తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అడ్డంకిగా మారింది. శిక్షణ కోసం, అందుకు అవసరైన సామాగ్రి కొనడం అత్యంత కష్టంగా ఉండేది. అందుకే మొదట్లో దీపిక వెదురు విల్లు, బాణాలతో ఇంట్లోనే విలువిద్యను అభ్యసించింది. టాటా ఆర్చరీ అకాడమీలో ఉండే ఆర్చర్ విద్యా కుమారి, దీపికకు బంధువు. దీపికలోని ప్రతిభను గుర్తించిన విద్య ఆమెకు ఎంతో సహాకరించింది.
అకాడమీలో చేరిన తర్వాత...
విద్య అందించిన సహకారంతో 2005లో అర్జున్ ఆర్చరీ అకాడమీలో ప్రవేశించింది దీపిక. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మీరా ముండా ఈ అకాడమీని స్థాపించారు. 2006లో జంషెడ్‌పూర్‌లోని టాటా ఆర్చరీ అకాడమీలో చేరినప్పుడు విలువిద్యను ఆమె తన కెరీర్‌గా ఎంచుకుంది. పారంభమైంది. ఈ అకాడమీలో చేరిన తర్వాతనే ఆమెకు శిక్షణకు అవసరమైన సరైన పరికరాలతో పాటు యూనిఫాం దొరికాయి. అంతే కాకుండా స్టైఫెండ్‌గా రూ .500 కూడా వచ్చేవి. విలువిద్యలో శిక్షణ మొదలు పెట్టిన ఆమె నవంబర్ 2009లో క్యాడెట్ వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్‌ను గెలుచుకుంది. ఆ మూడు సంవత్సరాలు ఇంటికి కూడా వెళ్ళలేదు. తనతోటి ఆర్చర్ అయిన అతాను దాస్‌ను 30 జూన్ 2020న దీపిక వివాహం చేసుకుంది.
సాధించిన విజయాలు
2006లో మెక్సికోలోని మెరిడాలో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్‌లో పాల్టన్ హన్స్డా జూనియర్స్ పోటీలో గెలుపొందింది. ఆ టైటిల్ గెలుచుకున్న రెండవ భారతీయురాలు దీపిక. ఆమె తన పదిహేనేండ్ల వయసులో 2009లో యునైటెడ్ స్టేట్స్‌లోని ఉటాలోని ఓగ్డెన్లో జరిగిన 11వ యూత్ వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది. మహిళల టీం రికర్వ్ ఈవెంట్లో డోలా బెనర్జీ, బొంబాయల దేవిలతో కలిసి అదే పోటీలో బంగారు పతకాన్ని కూడా గెలుచుకుంది.
2010 ఢిల్లీ కామన్వెల్త్ క్రీడలల్లోనే దీపిక రెండు స్వర్ణ పతకాలను గెలుచుకుంది. ఒకటి వ్యక్తిగత ఈవెంట్లో, మరొకటి మహిళల జట్టు రికర్వ్ ఈవెంట్లో. ఇందుకుగాను ఆమెను 2010 సహారా స్పోర్ట్స్ అవార్డుల కార్యక్రమంలో సిడబ్ల్యుజి (ఫిమేల్) అవార్డులో అత్యుత్తమ ప్రదర్శనతో సత్కరించింది.
మే 2012లో టర్కీలోని అంటాల్యలో దీపిక తన మొదటి ప్రపంచ కప్ వ్యక్తిగత దశ రికర్వ్ బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఆమె కొరియాకు చెందిన లీ సుంగ్-జిన్ను ఆరు సెట్ పాయింట్లతో ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. దాంతో 2012లో ప్రపంచ నంబర్‌గా నిలిచింది. 22 జూలై 2013న కొలంబియాలోని మెడెల్లిన్లో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ 3లో బంగారు పతకాన్ని గెలుచుకుంది. అక్కడ భారతదేశం నాల్గవ స్థానంలో నిలిచింది.
22 సెప్టెంబర్ 2013న దక్షిణ కొరియాకు చెందిన యున్ ఓక్-హీ చేతిలో 4-6 తేడాతో ఓడిపోయింది. 2013 ఫిటా ఆర్చరీ ప్రపంచ కప్‌లో రజత పతకం సాధించింది. 2014లో ఫోర్బ్స్ (ఇండియా) వారి '30 అండర్ 30'లో ఒకటిగా నిలిచింది.
2015లో ప్రపంచ కప్ రెండవ దశలో దీపికకు మొదటి పతకం వచ్చింది. అక్కడే వ్యక్తిగత ఈవెంట్లో కాంస్యం గెలుచుకుంది. కోపెన్‌హాగన్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రష్యాతో జరిగిన మ్యాచ్‌లో స్వర్ణం తృటిలో ఓడిపోయిన తర్వాత లక్ష్మీరానీ మాజి, రిమిల్ బురియులీలతో కలిసి రజతం గెలుచుకుంది. అదే ఏడాది చివర్లో ప్రపంచ కప్ ఫైనల్లో రజత పతకాన్ని గెలుచుకుంది.
2016 రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన జట్టులో దీపిక కూడా ఉంది. ర్యాంకింగ్ రౌండ్లో దీపికా కుమారి, బొంబాయిలా దేవి లైష్రామ్, లక్ష్మిరాణి మాజిలతో కూడిన భారత మహిళా జట్టు 7వ స్థానంలో నిలిచింది. రష్యాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోయే ముందు 16వ రౌండ్లో కొలంబియాతో జరిగిన మ్యాచ్‌లో వీరి జట్టు గెలిచింది. మహిళల వ్యక్తిగత విలువిద్యలో జార్జియాకు చెందిన క్రిస్టిన్ ఎసేబువాపై 64 రౌండ్లలో దీపిక మంచి ప్రతిభను కనబరిచింది. దీపిక 6-4 స్కోరుతో ఈ రౌండ్లో విజయం సాధించింది.
నవంబర్ 2019లో బ్యాంకాక్‌లో జరిగిన 21వ ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్ సందర్భంగా జరుగుతున్న కాంటినెంటల్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్లో ఒలింపిక్ కోటాను దక్కించుకుంది.
2021 పారిస్‌లో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ 3 టోర్నమెంట్లో దీపికా మన దేశానికి మూడు బంగారు పతకాలు సాధించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో నిలిచింది. ఈ విధంగా ఆమె 13వ ట్రిపుల్ స్వర్ణాన్ని నమోదు చేసింది. ఈ క్రీడల్లో ఈమె తను ఆడిన నాలుగు మ్యాచ్‌లలోనూ అద్భుత విజయాన్ని అందుకుంది. ముందుగా అంకిత భకత్, కోమలికతో కలిసి బరిలోకి దిగి పసిడి పతకం దక్కించుకుంది. మిక్స్డ్ విభాగంలో దీపిక తన భర్త అతాను దాస్‌తో కలిసి విజేతగా నిలిచింది. వ్యక్తిగత రకర్వ్లోనూన స్వర్ణ పతకాన్ని కౌవసం చేసుకుంది. దీంతో ఓకే ప్రపంచకప్ టీర్నోలో మూడు స్వర్ణాలు అందుకున్న తొలి ఆర్చర్‌గా గుర్తింపు పొందింది.
డాక్యుమెంటరీగా...
2017లో విడుదలైన 'లేడీస్ ఫస్ట్' అనే పేరుతో దీపిక జీవిత చరిత్ర డాక్యుమెంటరీని ఉరాజ్ బాV్‌ా్ల, అతని భార్య షానా లెవీ-బహల్ రూపొందించారు. ఈ చిత్రం లండన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్లో విజయం సాధించింది. అక్టోబర్ 2017లో మల్లోర్కా ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడింది. ఆస్కార్స్‌లో షార్ట్ డాక్యుమెంటరీ విభాగానికి లేడీస్ ఫస్ట్ కూడా సమర్పించబడింది. క్రీడలలో మహిళల గురించి జాతీయ అవగాహన పెంచే లక్ష్యంతో అప్పటి కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి మేనకా గాంధీతో కలిసి ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించారు. దీపికా 2012లో అర్జునా అవార్డును, 2014లో ఎఫ్ఐసీసీఐ ఆ ఏడాది స్పోర్ట్ పర్సన్ అవార్డును, 2016లో పద్మశ్రీ, 2017లో యంగ్ అచీవ్మెంట్ అవార్డులను అందుకుంది.
- సలీమ