Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చాలా మంది చిన్న విషయాలకే కండ్ల నీళ్లు పెట్టుకుంటుంటారు. అలాగని బాధలన్నీ మనసులో పెట్టేసుకోమని కాదు... ఉద్వేగాలను ప్రదర్శించే తీరుపై మనకు అదుపు ఉండాలనేది నిపుణుల భావన. అదెలాగంటే...!
వాస్తవాన్ని అంగీకరించండి: అన్నీ మనం అనుకున్నట్లే జరగకపోవచ్చు. అంతమాత్రాన ప్రపంచమంతా మనకి వ్యతిరేకమని అనుకోవద్దు. చుట్టూ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోవడంలో విఫలం అయినప్పుడే భావోద్వేగాలు అదుపు తప్పుతాయి. మాటతూలడం, ఏడవడం వంటివి చేస్తారు. వాటి వల్ల లాభమేమీ ఉండదు. దానికి బదులు ఆ ఇబ్బంది నుంచి బయటపడటానికి దారులు వెతకండి. సన్నిహితుల సాయం తీసుకోండి. బలాలు, బలహీనతల్ని గమనించుకుని కొత్త ఆలోచనలు చేయగలిగితేనే... భావోద్వేగాలపై పట్టు తెచ్చుకోగలరు.
మనసు విప్పి మాట్లాడండి: ఏం మాట్లాడితే ఎవరేం అనుకుంటారో? నేను చేసేది సరైందో కాదో... అంటూ మీకు మీరే అన్నీ ఊహించుకోవద్దు. మీ ఇబ్బందులు, అనుమానాలు వంటివి సీనియర్లనో, కుటుంబంలో పెద్దవారినో అడిగి తెలుసుకోండి. ఒకవేళ పొరబాటు జరుగుతుంటే... వారి హెచ్చరికల ఆధారంగా మీరు మార్చుకోవచ్చు. దీనివల్ల ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఆందోళన, వాటి తాలూకు ఉద్వేగాలు అదుపులో ఉంటాయి.
ఆధారపడొద్దు: కొందరు ప్రతి చిన్నదానికీ ఎవరో ఒకరి మీద ఆధారపడుతుంటారు. తీరా ఎప్పుడైనా అవతలివారి సహాయ సహకారాలు అందకపోయినా... ఇతరత్రా ఏ ఇబ్బందులు వచ్చినా కుంగిపోతుంటారు. అలా చేయొద్దు. ప్రతి పనీ స్వతంత్రంగా చేయగల నేర్పుని అలవరుచుకోండి. మీ జీవనశైలిలో మార్పులు చేసుకోండి. పోషకాహారం తీసుకోండి. ధ్యానం, యోగా వంటివాటిని మీ దినచర్యలో భాగం చేసుకోండి. ఇవన్నీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి. అప్పుడు ఉద్వేగాల మీద మీకు అదుపూ వస్తుంది.