Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాస్క్ పెట్టుకునే ముందు, తొలగించిన తర్వాత సబ్బుతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. అలాగే మధ్యమధ్యలో ఒకట్రెండు సార్లు చల్లటి నీటితో ముఖం కడుక్కుంటే సరిపోతుంది.
మనం బయటికి వెళ్లినప్పుడు వర్షంలో లేదంటే చెమటకు మాస్క్ తడిసిపోతుంటుంది. ఇలా తడిగా ఉన్న మాస్క్నే ఎక్కువ సమయం పాటు ఉపయోగించడం వల్ల వాతావరణంలోని బ్యాక్టీరియా, క్రిములు మాస్క్ ద్వారా చర్మం పైకి చేరి పలు చర్మ సంబంధ సమస్యలకు కారణమవుతాయి. అలాగే తడి మాస్క్ వల్ల ఆ భాగంలో ఎరుపెక్కడం, పగుళ్లు రావడం.. వంటివి కూడా జరుగుతుంటాయి. కాబట్టి బయటికి వెళ్లేటప్పుడు అదనంగా మరో రెండు మాస్కులు బ్యాగ్లో వెంట తీసుకెళ్లడం మంచిది. అవి తిరిగి ఉపయోగించుకునేవైతే తీసిన మాస్క్ని విడిగా కవర్లో పెట్టుకొని ఇంటికొచ్చాక ఉతుక్కోవచ్చు.
మాస్క్ని వేడి నీళ్లలో ఉతకడం వల్ల వాటికి అంటుకున్న దుమ్ము-ధూళి, ఇతర క్రిములు, వైరస్లు నశిస్తాయి. లేదంటే వాటి వల్ల కూడా చర్మానికి ప్రమాదమే. అలాగే ఉతికిన మాస్క్ పొడిగా ఆరేంత వరకు ఆరుబయటే ఎండలో ఆరేయాలి.
మాస్క్ పెట్టుకునే ముందు, తీసేసిన తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకొని మాయిశ్చరైజర్ రాసుకోవాలి. అయితే ఆయింట్మెంట్ తరహా మాయిశ్చరైజర్స్ ముఖాన్ని జిడ్డుగా మార్చుతాయి. కాబట్టి వాటిని ఉపయోగించక పోవడం మంచిది.
మాస్క్ కారణంగా ముఖ చర్మం డ్యామేజ్ అయితే ఆయా భాగాల్లో ఎక్స్ఫోలియేటర్లు, స్క్రబ్బర్స్ ఉపయోగించక పోవడమే మంచిదంటున్నారు సౌందర్య నిపుణులు. ఎందుకంటే వీటి వల్ల చర్మం రాపిడికి గురై సమస్య తగ్గడం అటుంచి, మరింత పెరుగుతుంది.
రాత్రి పడుకునే ముందు ముఖమంతా పెట్రోలియం జెల్లీ రాసుకొని పడుకుంటే చర్మం పొడిబారే సమస్య నుంచి విముక్తి పొందచ్చు. అలాగే ముఖంపై గాయమైన ప్రదేశాల్లో దీన్ని రాయడం వల్ల అది త్వరగా మానిపోయే అవకాశం కూడా ఉంది.
చర్మం పొడిబారకుండా ఉండాలంటే నీళ్లు ఎక్కువగా తాగాలి.