Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రెండు దశాబ్దాలుగా గ్రామీణ మహిళలు, బాలికల జీవనశైలిని మెరుగుపరచడమే లక్ష్యంగా పని చేస్తున్న సంస్థ ఎంపవర్హర్. మహారాష్ట్రలోని పన్వెల్‌లోని 65 గ్రామాల్లోని మహిళలకు పారిశుధ్యం పట్ల అవగాహన కల్పిస్తూ విద్యను అందిస్తుంది. యుక్తవయసులో మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు కౌమారదశలో వారికి సరైన సదుపయాలు లేకపోవడమేనని గుర్తించారు. ఆ వైపుగా వారి కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు.
నిర్భరు జైన్ మహిళా సాధికత లక్ష్యంగా తన తల్లి జ్ఞాపకార్థం 'ఎస్కెఎస్ చక్షు ఫౌండేషన్' అనే స్వచ్ఛంద సంస్థను1993లో ముంబైలో ప్రారంభించారు. ముంబై సమీపంలోని పన్వెల్ తాలూకా గ్రామీణ ప్రాంతాల్లో కంటి సంరక్షణ కార్యక్రమాల ద్వారా మొదటగా తన సేవా కార్యక్రమాలను ఈ సంస్థ మొదలుపెట్టింది. ఇటీవల మే 28న జరిగిన రుతు పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా ఈ సంస్థ కర్జాత్ తాలూకా (రారుగడ్ జిల్లా, మహారాష్ట్ర) లోని గిరిజన బాలికలకు శానిటరీ న్యాప్కిన్లను పంపిణీ చేసింది. మహమ్మారి సమయంలో అక్కడి 600 గ్రామీణ గిరిజన బాలికలకు మూడు నెలలకు సరిపడా శానిటరీ ప్యాడ్లను అందించింది. దీని కోసం శానిటరీ ప్యాడ్లను తయారు చేసే పీ సేఫ్ చేత రాహో సేఫ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
లింగ సమానత్వానికై...
గత రెండు దశాబ్దాలుగా ఈ సంస్థ ముఖ్య ప్రయత్నం కౌమార బాలికల కోసం ప్రోగ్రామ్ (ఎజిపి)ను ఏర్పాటు చేయడం. దీని ద్వారా 10-19 సంవత్సరాల వయసు గల బాలికలకు లింగసమానత్వంపై అవగాహన కల్పించడం. 'ఎంపవర్హర్' ప్రస్తుతం కర్జాత్ అంతటా 600 మంది బాలికలతో కలిసి పనిచేస్తుంది. మహారాష్ట్ర అంతటా ఈ కార్యక్రమాన్ని విస్తృతం చేయాలని భావిస్తుంది. అంతే కాకుండా పన్వెల్, కర్జాత్ గ్రామాలలో 2500కి పైగా వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించింది. అలాగే పన్వెల్‌లోని రెండు గ్రామాలలో మంచినీటి ప్లాంట్లను ఏర్పాటు చేసింది.
రెండు దశల్లోనూ...
మహమ్మారి విజృంభించిన రెండు దశల్లోనూ మహారాష్ట్ర అంతటా ఈ సంస్థ తన సహాయ కార్యక్రమాలను కొనసాగించింది. కరోనా కాలంలో మెట్రో నగరాల్లో సహాయం చేయడానికి చాలా మంది ముందుకు వచ్చారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు చాలా తక్కువగా ఉన్నాయి. అందుకే కోవిడ్ రోగులకు ఆక్సిజన్ సిలిండర్లు, పడకలు, మందులు అందించారు. అలాగే గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులకు వైద్య సహాయం చేశారు. 2020లో ముంబైలోని ఓ ఆసుపత్రిలో పని చేసే వైద్య సిబ్బందికి కోవిడ్-19 సంబంధిత వైద్య సహాయం అందించడంలో ఎంపవర్హెర్ చురుకైన పాత్ర పోషించింది. ఈ సంస్థ 9,500 సాధారణ మాస్కులు, 450 కెఎన్ - 95 మాస్కులు, 450 జతల గ్లౌజులు, 180 పీపీఇ కిట్లు, 50 శానిటైజర్లు, ఆరు ధర్మల్ స్క్రీనింగ్ మిషన్లను అందజేశారు.
ముఖ్యమైన వస్తువే...
రెండవ దశ సమయంలో మహారాష్ట్రలో కోవిడ్-19 కేసులు పెరిగినందున దానికి సంబంధిచిన సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు వీరు తమ ప్రయత్నాలను కొనసాగించారు. ''మహమ్మారి సమయంలో మేము ఇప్పటికే అవసరమైన వారికి వైద్య సామాగ్రిని అందిస్తున్నాము. అలాగే శానిటరీ న్యాప్కిన్లు కూడా ఓ ముఖ్యమైన వస్తువుగా చేర్చాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాము'' అని అనామరా అంటున్నారు.
ప్రారంభ రోజులు...
ఇరవై ఏండ్ల కిందట నిర్భరు ఈ సంస్థను ప్రారంభించినప్పుడు ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవలసి వచ్చింది. మొదట్లో అతను తన రోటరీ పరిచయాల ద్వారా నిధులను సేకరించారు. నిర్భరు సేవా కార్యక్రమాలు చేయడం కోసం మోకాలి లోతైన నీరు, చెత్త ఉన్న కొన్ని గ్రామాలకు తరచూ వెళుతుండేవారు. ఆ గ్రామస్తులకు వ్యవసాయం తప్ప మరేమీ తెలియదు. ''అలాంటి ఓ గ్రామీణాభివృద్ధి కోసం కార్యక్రమాలు ప్రారంభించాం. అక్కడి పేదలకు కంటిశుక్లాలు తీయించడం, స్థానికంగా ఆస్పత్రులు ఏర్పాటు చేయడం, పక్కా రోడ్లు నిర్మించడం, బావులను తవ్వడం వంటి మౌలిక సదుపాయాల కార్యక్రమాలు చేపట్టాం. తద్వారా గ్రామస్తులకు నీరు అందుబాటులో ఉంటుంది'' అని చెప్పారు అనామరా.
విద్యా సౌకర్యాలు
గ్రామీణ పిల్లలకు విద్యా సౌకర్యాలు లేవని తెలుసుకుని 40 మంది పిల్లలతో ఒక చిన్న పాఠశాలను ప్రారంభించారు. నేడు ఈ పాఠశాల ఆ ప్రాంతానికి మాత్రమే కాకుండా 450 మందికి పైగా విద్యార్థులు చేరిన రారుగడ్ జిల్లా మొత్తానికి ఓ నమూనా పాఠశాలగా గుర్తింపు పొందింది. కెంట్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీ పొందిన అనామారా, ఎంపవర్హెర్లో చేరడానికి ముందు ప్రథం ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌లో పని చేశారు.
ఆర్థికంగా శక్తివంతం...
''మా కార్యకలాపాలన్నీ కింది స్థాయి నుండి ఉన్నాయి. స్థానిక మహిళల కోసం స్వయం సహాయక బృందం (ఎస్‌హెచ్‌జి) కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇది ఓ దశాబ్దానికి పైగా సంస్థకు ప్రధాన కేంద్రంగా మారింది. స్వయం సహాయక సంఘాల ద్వారా 2500 మందికి పైగా మహిళల నెట్‌వర్క్‌ను సృష్టించగలిగాం. వారిని ఆర్థికంగా శక్తివంతం చేసాము. ఈ మహిళలు సరైన పారిశుద్ధ్య సదుపాయాలు కావాలని కోరారు. అందుకే వారి కోసం 2500 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాం. ఇది మాకు ఎంతో సంతోషంగా ఉంది'' అని అనామరా చెప్పారు.
ఆమెలో మార్పు వస్తే...
స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేసే సమయంలో ఎంతో ఇబ్బంది అయ్యింది. సాధారణంగా మహిళలు తమ ఇళ్ళ నుండి బయటపడటానికి, స్వతంత్రంగా ఉండటానికి అనుమతి దొరకదు. వారి కుటుంబ సభ్యులను ఒప్పించడం మాకెంతో కష్టమైన పనిగా అనిపించింది. మహిళల సాధికారతే ప్రధానాంశంగా మా కార్యక్రమాలను ప్రారంభించాము. ఎందుకంటే మహిళల జీవితాల్లో మార్పు వస్తే అది సమాజ మార్పుగా రూపుదిద్దుకుంటుందని నా నమ్మకం. అందుకే మన మహిళలను శక్తివంతం చేయగలిగితే, మా సంఘాలు రూపాంతరం చెందుతాయి. మహిళలతో కలిసి పదేండ్లు పని పని చేసిన తర్వాత సమాజంలో శాశ్వత మార్పు రావాలంటే టీనేజ్ అమ్మాయిలతో కలిసి పని చేయగలని మేం నిర్ణయించుకున్నాం.
పాఠశాల నుండి తప్పకోకుండా...
2020లో సంస్థ ''కౌమార బాలికలను సాధికారపరచడం'' అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. వారికి జీవిత నైపుణ్యాలను బోధించడం, మానసిక, శారీరక ఆరోగ్యంపై సమాచారాన్ని అందించడంపై దృష్టి పెడుతుంది. వారి భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడుతూ, బాలికలు పాఠశాల నుండి తప్పుకోకుండా ఉండటానికి, ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య సౌకర్యాలను నిర్మించడమే ఎంపవర్హెర్ లక్ష్యం. ముఖ్యంగా బాలికలు రుతుస్రావం ప్రారంభమైన తర్వాత పారిశుద్ధ్య సదుపాయాలు లేకపోవడం వల్ల పెద్ద సంఖ్యలో చదువు మానేస్తున్నారు. అందుకే రాబోయే మూడేండ్లలో రారుగడ్ జిల్లా అంతటా వీరి కార్యక్రమాలను పెంచాలని భావిస్తున్నారు.
మహమ్మారి నుండి పాఠాలు
కరోనా మహమ్మారి నుండి మేము నేర్చుకున్న ముఖ్య పాఠాలలో ఒకటి కౌమారదశలో ఉన్న అమ్మాయిలు ఎదుర్కొన్న తీవ్ర సమస్యలు. లాక్‌డన్ వల్ల బయటకు వెళ్ళలేకపోవడంతో మానసిక సమస్యలు బాగా ఎక్కువయ్యాయి. అలాగే స్త్రీలు తమ శారీరక పరిశుభ్రత కోసం ఉపయోగించే శానిటరీ న్యాప్కిన్లు వంటి ఉత్పత్తులు పూర్తిగా ఆగిపోయాయి. పేదరికం అనేది మన దేశంలోని ప్రజలు ఎప్పుడూ ఎదుర్కొనే ఓ సమస్య. అయితే కోవిడ్ ఈ సమస్యను మరింత తీవ్రతరం చేసింది. లాక్డౌన్ సమయంలో గ్రామీణ మహిళలకు శానిటరీ నాప్కిన్లు అందుబాటులో లేవు. అందుకే మహిళలు, అమ్మాయిలు రుతుస్రావ సమయంలో బట్టలు ఉపయోగిస్తున్నారు. ఆ బట్టలను సరిగ్గా శుభ్రం చేయలేకపోవడం, జాగ్రత్తగా ఉంచుకోకపోవడంతో అనేక రకాల ఇన్ఫెక్షన్లతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే మేము నాప్కిన్లు పంపిణీ చేశాము.
- అనామరా బేగ్
ఎంపవర్హెర్ ఫౌండేషన్ సిఇఒ