Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనసు నిత్యం సంతోషంగా ఉంటే.. అదే సగం బలం. ఎక్కువ సంతోషంగా ఉండే వారికి ఎలాంటి అనారోగ్యాలూ దరిచేరవని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎటువంటి ఆరోగ్య సమస్యలనైనా దరికిరాకుండా చేయగలిగే మంత్రం లాంటి సంతోషంతో కలిగే ప్రయోజనాలెన్నో!
నైపుణ్యాలు: ప్రతి క్షణం సంతోషంగా ఉండే వారిలో నైపుణ్యాలు పెరుగుతాయట. విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని కలిగించి, జ్ఞాపకశక్తిని పెంచుతుంది. భవిష్యత్తులో ఎదురయ్యే ఎటువంటి అడ్డంకినైనా నవ్వుతూ దాటేయగలిగే సామర్థ్యాన్ని పెంచుతుంది. సంతోషంగా, ఉత్సాహంగా ఉండేవారిలో స్ట్రెస్ కలిగించే హార్మోన్ తక్కువగా విడుదలై, కష్ట సమయాల్లో వారిని త్వరగా కోలుకునేలా చేస్తుంది. ఒత్తిడి కూడా తగ్గుతుంది.
ఆలోచనలు: సంతోషంగా ఉంటే ప్రతికూల ఆలోచనలు దరిచేరవు. ఎంతటి క్లిష్ట పరిస్థితులోనైనా పాజిటివ్‌గా ఆలోచించేలా చేస్తుంది. ఇలా ఉండేవారు సంపూర్ణ ఆరోగ్యంతో ఎక్కువకాలం జీవిస్తారు. అలా కాకుండా నెగెటివ్‌గా ఉంటే మాత్రం భవిష్యత్తులో ముప్పుగా మారుతుంది. వారి లైఫ్టైంను కూడా తగ్గిస్తుంది. అందుకే వీలైనంతగా మనసును ప్రశాంతంగా, ఆనందంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి.
వ్యాధినిరోధక శక్తి: ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి ఉత్సాహంగా ఉండేవారికి వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం, క్రమశిక్షణ, సమయపాలన వంటి అలవాట్లు అలవడతాయి. ఆరోగ్యకరమైన ఆహారంతో శరీరంలో వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది. ఇది నిత్యం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అలాగే లక్ష్యాలను చేరుకోవడానికి కావాల్సినన్ని శక్తిసామర్థ్యాలను ఇస్తుంది. దీంతో జీవితంలో ఉన్నతస్థాయిని అందుకోవడమే కాదు, మరికొందరికి చేయూతగా నిల్చి అందులోనూ సంతోషాన్ని పొందొచ్చు.