Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాకరకాయ అనగానే చిన్న పిల్లలే కాదు పెద్ద వాళ్ళు కూడా అబ్బో చేదు అనేస్తారు. ఈ కూర తినడానికి ఎవ్వరూ అంతగా ఇష్టపడరు. ఆరోగ్యానికేమో ఎంతో మంచిది. తినకపోతే మనకే నష్టం. అందుకే చేదు లేకుండానే కాకరకాయను రకరకాల రుచుల్లో చేసుకోవచ్చు. ఆ వెరైటీలేంటో ఈరోజు మనమూ నేర్చుకుందాం...
స్టప్డ్ కర్రీ
కావల్సిన పదార్థాలు: చిన్న కాకరకాయలు - ఆరు, ఎండు కొబ్బరి తురుము - అరకప్పు, వేయించిన పల్లీల పొడి - అరకప్పు, వెల్లుల్లి ముద్ద - రెండు చెంచాలు, పసుపు - అరచెంచా, జీలకర్రపొడి - చెంచా, కారం- రెండు చెంచాలు, నిమ్మకాయ - ఒకటి, చక్కెర - చెంచా, ఉప్పు - తగినంత.
తయారు చేసే విధానం: కాకరకాయలు, నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నింటినీ ఓ గిన్నెలో వేసి బాగా కలపాలి. తర్వాత కాకరకాయల చెక్కు తీసి మధ్యలో చీల్చినట్టుగా గాటు పెట్టుకుని ఈ మసాలాను వాటిల్లో కూరాలి. ఇప్పుడు స్టౌమీద బాణలి పెట్టి నూనె వేసి కాకరకాయల్ని అందులో ఉంచి స్టౌని మీడియంలో పెట్టి మధ్యమధ్య కలుపుతూ ఉండాలి. కాకరకాయలు బాగా వేగాయనుకున్నాక దింపేయాలి.
మసాలా కూర
కావల్సిన పదార్థాలు: కాకరకాయలు పెద్దవి - మూడు, ఉల్లిగడ్డలు చిన్నవి - పది, పసుపు - అరచెంచా, చింతపండురసం - టేబుల్‌స్పూను, ఉప్పు - తగినంత, మెంతులు - అరచెంచా, దనియాలు - టేబుల్‌స్పూను, ఎండుమిర్చి - నాలుగు, పచ్చి కొబ్బరి తురుము - కప్పు, నూనె - రెండు చెంచాలు, ఆవాలు - పావుచెంచా, కరివేపాకు - రెండు రెబ్బలు.
తయారు చేసే విధానం: ముందుగా కాకరకాయల్ని ముక్కల్లా కోసి కుక్కర్లో వేసుకోవాలి. తరువాత చింతపండు రసం, తగినంత ఉప్పు, పసుపు, పొట్టుతీసిన ఉల్లిపాయల్ని కూడా వేసి మూత పెట్టి రెండు కూతలు వచ్చేవరకూ ఉడికించుకుని తీసుకోవాలి. స్టౌమీద బాణలి పెట్టి మెంతులు, దనియాలు, మూడు ఎండుమిర్చి వేసి ఎర్రగా వేయించి మిక్సీలో వేసుకోవాలి. ఇందులో కొబ్బరిపొడి కూడా వేసి కాసిని నీళ్లు పోసి ముద్దలా చేసుకోవాలి. కుక్కర్‌ని మళ్లీ స్టౌమీద పెట్టి కాసిని నీళ్లు పోయాలి. అయిదు నిమిషాలయ్యాక తగినంత ఉప్పు, ముందుగా చేసుకున్న మసాలా వేయాలి. ఇది చిక్కగా అయ్యాక దింపేయాలి. స్టౌమీద బాణలి పెట్టి నూనె వేసి ఆవాలు, మిగిలిన ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించి, కర్రీపైన వేసి ఓసారి కలిపితే సరి.
పులుసు
కావల్సిన పదార్థాలు: కాకరకాయలు - రెండు పెద్దవి, నూనె - మూడు టేబుల్‌స్పూన్లు, ఆవాలు - చెంచా, మినప్పప్పు - చెంచా, సెనగపప్పు - చెంచా, జీలకర్ర - అరచెంచా, ఇంగువ - చిటికెడు, ఎండుమిర్చి - ఒకటి, అల్లంవెల్లుల్లి ముద్ద - చెంచా, పసుపు- అరచెంచా, ఉప్పు - తగినంత, చింతపండురసం - కప్పు, బెల్లం తరుగు - టేబుల్‌స్పూను, కొత్తిమీర - కట్ట, ఉల్లిగడ్డ - రెండు. మసాలాకోసం: పల్లీలు - రెండు టేబుల్‌స్పూన్లు, నువ్వులు - రెండు టేబుల్‌స్పూన్లు, సెనగపప్పు - చెంచా, మినప్పప్పు - చెంచా, జీలకర్ర - చెంచా, దనియాలు - చెంచా, మెంతులు - పావుచెంచా, ఎండుమిర్చి - నాలుగు.
తయారు చేసే విధానం: కాకరకాయల్ని చక్రాల్లా కోసి గింజలు తీసేయాలి. తర్వాత ఆ ముక్కలపైన చెంచా ఉప్పు వేసి.. పది నిమిషాలయ్యాక ఆ ముక్కల్లోని నీటిని గట్టిగా పిండి ఓ గిన్నెలో వేసుకోవాలి. స్టౌమీద పాన్‌పెట్టి టేబుల్‌స్పూను నూనె వేసి మసాలాకోసం పెట్టుకున్న పదార్థాలన్నింటినీ వేసి ఎర్రగా వేయించుకుని చల్లగా అయ్యాక మిక్సీలో పొడిలా చేసుకోవాలి. అదే బాణలిలో మిగిలిన నూనె వేసి ఆవాలు, మినప్పప్పు సెనగపప్పు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి వేసి వేయించాలి. తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు, అల్లంవెల్లుల్లి ముద్ద, కాకరకాయ ముక్కలు, పసుపు, చింతపండు రసం, తగినంత ఉప్పు, బెల్లం తరుగు, అరకప్పు నీళ్లు పోసి అన్నింటినీ ఉడకనివ్వాలి. కాకరకాయ ముక్కలు మెత్తగా అయ్యాక ముందుగా చేసుకున్న మసాలా వేసి బాగా కలపాలి. పులుసు చిక్కగా అవుతున్నప్పుడు కొత్తిమీర వేసి దింపేయాలి.
వేపుడు
కావల్సిన పదార్థాలు: పెద్ద కాకరకాయలు - రెండు, సెనగపిండి - మూడు టేబుల్‌స్పూన్లు, బియ్యప్పిండి: - టేబుల్‌స్పూను, కారం - చెంచా, ఇంగువ - పావుచెంచా, ఉప్పు - తగినంత, పసుపు - పావుచెంచా, నీళ్లు - కప్పు, నూనె - వేయించేందుకు సరిపడా.
తయారు చేసే విధానం: కాకరకాయల్ని చక్రాల్లా కోసి ఓ గిన్నెలో వేయాలి. వీటిపైన చెంచా ఉప్పు, పసుపు, నీళ్లు పోయాలి. పావుగంటయ్యాక నీళ్లు గట్టిగా పిండి ఈ ముక్కల్ని మరో గిన్నెలోకి తీసుకోవాలి. వీటిపైన నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టౌమీద బాణలి పెట్టి వేయించేందుకు సరిపడా నూనె వేయాలి. అది కాగాక కాకరకాయ ముక్కల్ని నాలుగైదు చొప్పున వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.