Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెండ్లి, పిల్లలు, కుటుంబ బాధ్యతలు వంటి కారణాలతో చాలామంది అమ్మాయిలు కెరీర్లో విరామం తీసుకోవాలనుకుంటారు. కానీ తర్వాత తిరిగి ఉద్యోగంలో కుదురుకోగలమో లేదో, ఆర్థిక ఇబ్బందుల మాటేంటో అనే సందేహాలూ వస్తుంటాయి. ఇలాంటప్పుడు కొంత ముందు చూపూ అవసరం. అదెలాగంటే...
స్పష్టత ముఖ్యం: ఉద్యోగంలో అసంతృప్తి, బాధ్యతలు...కొత్త కెరీర్‌పై ఆసక్తి ఇలా మీరు ఏ కారణంతో బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నారో స్పష్టత తెచ్చుకోండి. కేవలం ఇంటి బాధ్యతలు, విధుల్ని సమన్వయం చేసుకోవడంలోనే సమస్య ఉందనుకుంటే...వర్క్‌ఫ్రమ్ హోమ్, పార్ట్‌టైమ్ పని వంటి అవకాశాలేమైనా కల్పిస్తారేమో అని మీ యజమాన్యాన్ని అడగండి. అవకాశం దొరికితే మంచిదే కదా! అలాకాకుండా కెరీర్లో అసంతృప్తే కారణం అయితే...మీ బలం, బలహీనతల్ని లెక్కేసుకోండి. వాస్తవికంగా అంచనా వేసుకోకుండా అతివిశ్వాసంతోనో, ఆత్మన్యూనతతోనో ఆ పనిచేస్తే మాత్రం భవిష్యత్తులో ఇబ్బందిపడక తప్పదు. దేనికైనా కనీసం ఏడాది ముందుగా ప్రణాళిక వేసుకుంటే మంచిది.
ముందే ఏర్పాటు: మీ మనసులో బ్రేక్ తీసుకోవాలన్న ఆలోచన ఉన్నప్పుడు కొన్నినెలలకు సరిపడా ఆర్థిక వనరుల్ని సమకూర్చుకోవాలి. ఇతరుల మీద ఆధారపడకూడదన్నా, మిమ్మల్ని మీరు మరింత మెరుగుపరుచుకోవాలి అనుకున్నా ఇది చాలా అవసరం.
ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు: విరామం తర్వాత కొన్నాళ్లకే చాలామందికి వాస్తవ స్థితిగతులు అర్థమవుతాయి. అప్పుడు అవకాశాలు రావడం లేదనో, గతంలో దానికంటే మెరుగైనది కాదనో బాధపడే పరిస్థితి వద్దు. అందుకే ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోవాలి. అందుకోసం ఆ కాలంలో కొత్త కోర్సులూ, భాష వంటివి నేర్చుకోవాలి. ఇవన్నీ తిరిగి మీరు ఉద్యోగంలో కుదురుకోవడానికి తోడ్పడతాయి.