Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆగస్టు నెలలో కరోనా వైరస్ థర్డ్ వేవ్ వస్తుందని సూచిస్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ తన విశ్వ రూపాన్ని ఇప్పుడే శాంతపరిచింది. ఇప్పటి దాకా రెచ్చిపోయి తను చూపిన విశ్వరూపం వల్ల ఎన్నో ప్రాణాలు గాల్లో కలసిపోయాయి. మార్చి నుంచి ఎండలతో పాటుగా మేనెల దాకా భయోత్పాతాన్ని సృష్టించింది. మొదటివేవ్ కన్నా రెండవ వేవ్‌లో కరోనా తన ప్రతాపాన్ని ఎక్కువగా చూపించింది. అలాగే ఇప్పుడూ కొద్దిగా తగ్గినట్టే తగ్గి మరల కరోనా విజృంభిస్తుందని అనుకుంటున్నారు. కొత్త వేరియంట్లతో కొత్త శక్తిని పుంజుకుని మూడవ వేవ్‌లో తన తడాఖా చూపించడానికి వస్తుందట. ఆగస్టులో తన సమరం మొదలుపెట్టి అక్టోబరు, నవంబరు నెలల్లో ఎక్కువ అవ్వొచ్చని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. రెండోవేవ్ కన్నా బలంగా, శక్తివంతంగా కరోనా ఉండబోతున్నట్టుగా ఊహిస్తున్నారు. కరోనా వేస్తున్న వ్యూహాలను మనం శానిటైజర్, మాస్క్‌లతో భగం చేయాలి. బయటకు వెళితేనే మన మీద కరోనా యుద్ధం చేస్తుంది. కాబట్టి మనం బయటకు వెళ్ళకపోతే సురక్షితంగా ఉండవచ్చు. ఇంట్లో ఉండి కళాత్మకతకు స్థానం కల్పించండి.
సూది మందు సీసాలపై తళుకులతో...
సుమారు 15, 20 ఏండ్ల కిందట సూది మందు సీసాలపై అల్యూమినిమం ప్యాక్ ఉండేది. దాని మీద గుండ్రంగా తియ్యడానికి వీలుగా గీత గీసినట్టుగా ఉంటుంది. ఈ గుండ్రని అల్యూమినియం బిళ్ళను తీసి సూది రబ్బరు మూతలోకి గుచ్చి మందును తీసేవారు. ఇలాంటి గుండ్రని బిళ్ళల్ని సేకరించి బొమ్మలు చేశాను. చాలా వరకు ఇవి తెల్లగానే ఉంటాయి. కానీ పిల్లలకు వేసే డీపీటీ ఇంజక్షన్ల సీసాలకు కృష్ణ బులుగు రంగులో ఉంటాయి. అలాగే పిల్లల విరోచనాలకు ఇచ్చే ఇంజక్షన్ల సీసాలకు బంగారు రంగులో ఉంటాయి. ఇవి మన బొట్టు బిళ్ళంత సైజులో ఉంటాయి. ఇటువంటివి ఎన్ని సేకరిస్తే బొమ్మ అవుతుంది. నేను దాదాపు రెండు ఫీట్ల బొమ్మను చేశాను. సరే ఇంతకీ ఈవారం ఏం చేసుకోబోతున్నాం? సప్తవర్ణాల సీతాకోక చిలుకలను. హిమాలయాల్లో ఉండే కొన్ని రకాల సీతాకోక చిలుకలు ప్రస్తుతం అంతరించిపోయే దశలో ఉన్నాయి. సీతాకోక చిలుకలు అనబడే కీటకాల జీవిత చరిత్రలో నాలుగు దశలుంటాయి. గుడ్డు, లార్వా, ప్యూపా, ప్రౌఢజీవి. గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారినట్టు అని మనం తక్కువ స్థాయి నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళిన వారి గురించి సామెతగా చెప్పుకుంటాం. గోల్డ్, సిల్వర్, బ్లూ రంగుల తళుకులతో సీతాకోక చిలుకను తయారు చేశాను. వీటిని కార్డు బోర్డుపై ఫెవికాల్తో అతికించాను. 'లెపిడోప్టీరా' క్రమానికి చెందిన కీటకాలే సీతాకోక చిలుకలు. ఇవి కూడా పక్షుల వలె సుదూర ప్రాంతాలకు వలస వెళుతుంటాయి.
పాచికలతో...
పిల్లలు పాలు తాగుతారు. పాలసీసాలకు పాలపీకలకు, వాటికి మూతలు ఉంటాయి. పాలపీకకు ఉండే మూతలు పసుపు, పింక్, బ్లూ, గ్రీన్, వైట్ కలర్లలో ఉంటాయి. పిల్లలను ఆకర్షించేందుకే ఇలా రంగుల్లో తయారు చేస్తారనుకుంటా. నేను ఈ వాడేసిన పాలపీకలను సేకరించాను. నేను ఈ పీకలతో సీతాకోక చిలుకను తయారు చేశాను. సీతాకోక చిలుకను చాలా పెద్దగా నేల మీద చేశాను. దాని తల కోసం ఇరవై లీటర్ల ప్లాస్టిక్ క్యాన్ మూతను పెట్టాను. కండ్లు నేను తయారు చేసి పెట్టుకున్నాను. అన్నిటికీ అవే కండ్లు పెడుతుంటాను. సీతాకోక చిలుక తల మీదుండే యాంటిన్నాలుగా చెట్ల పుల్లల్ని పెట్టాను. సీతాకోక చిలుకలు ఎక్కువగా పగటిపూట ఎగురుతూ కనువిందు చేస్తాయి. అదీ రెక్కలు టపటపలాడిస్తూ, రెక్కలను ఆర్పుతూ తెరుస్తూ ఎగురుతాయి. ఇందులో నిజమైన సీతాకోక చిలుకలు, స్కిప్పర్స్, పురుగు సీతాకోక చిలుకలు అని మూడు రకాలు ఉంటాయి. ఇవి ఇతర కీటకాలతో, సహకారం, పరాన్న జీవిగ సంబంధాలు కలిగి ఉంటాయి. వ్యవసాయ విస్తరణకు, వృక్ష సంపదకు సహకరిస్తాయి. చిత్రకారులకు సీతాకోక చిలుకలను చూస్తే పెద్ద పండుగ. వాటి రెక్కలలోని వర్ణాలను గీయాలని తపన పడుతుంటారు. కీటకాలకు రాణి వంటివి సీతాకోక చిలుకలు. వృక్షాల పాలినేషన్కు ఇవి సహకరిస్తాయి.
వడియాలతో...
విందు భోజనంలో అప్పడాలు, వడియాలు లేకుంటే పెద్దలోటే. తెలుగు వారి భోజనంలో మినప అప్పడాలు, బూడిద గుమ్మడి వడియాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇప్పుడు వాటి స్థానంలో కొత్తరకాలు ఎన్నో వచ్చాయి. ఇప్పుడు ప్రతిదీ ఇన్‌స్టాంట్‌గా తెచ్చి తినేయడమే కదా! కరకరలాడే ఆలూచిప్స్ వంటివి తెచ్చుకొని తినేయడంతో అందరూ ఒబేసిటీ సమస్యతో బాధపడుతున్నారు. తీసుకునే ఆహారానికి తగినంతగా శారీరక శ్రమ లేక నానా అవస్థలూ పడుతున్నారు. బజార్లో దొరికే వడియాలతో రంగురంగుల సీతాకోక చిలుకను తయారు చేశాను. ఆరెంజ్, రెడ్, ఎల్లో, గ్రీన్, వైట్ రంగులతో చక్రాలు, గొట్టాలు, డైమండ్లు, బ్యాట్లు, రింగులు వంటి ఆకారాలున్న వడియాలతో సీతాకోక చిలుక ఎంత అందంగా ఉందో చూడండి. వీటికి 'లెపిడోప్టీరా' అనే పేరు ప్రాచీన గ్రీకు భాష నుంచి వచ్చింది. సీతాకోక చిలుకలకు నాలుగు రంగురంగుల రెక్కలు ఉంటాయి. ఈ రెక్కలు సీలియా అనే సన్నటి వెంట్రుకల నూగుతో కప్పబడి ఉంటుంది. మెలనిన్ అనే వర్ణక ద్రవ్యాల వలన నలుపు, బ్రౌన్ రంగుల్ని, యూరిక్ యాసిడ్ వలన పసుపు రంగులు, స్కేల్స్, హెయిర్స్ వలన ఎరుపు, బులుగు, ఆకుపచ్చ రంగులు వస్తాయి. ఇలాంటి కీటకాలకు శరీరం మూడు, భాగాలుగా విభజింపబడి ఉంటుంది. తల, రొమ్ము, ఉదరం అనే మూడు భాగాలు ఉంటాయి సీతాకోక చిలుకలో.
చింతగింజలతో...
చింతకాయల నుండి చింతపండు వస్తుందని తెలుసుకదా! చింతపండులో వచ్చే చింత గింజలు నలుపు లేదా ముందురు గోధుమ రంగులో ఉంటాయి. మన వంటింట్లో రోజూ వాడుకునే చింతపండులో వచ్చే చింతగింజల్ని కడిగి దాచి పెట్టుకుంటే ఇలా బొమ్మలు చేయడానికి పనికి వస్తాయి. గతంలో ఇలా సేకరించిన చింతగింజలతో వైకుంటపాళీ, పచ్చీసు ఆటలు ఆడేవారు. ఈ చింతగింజల్ని బండల మీద అరగదీసి గవ్వల్ని వాడినట్టుగా పాచికలు ఆడేవారు. చింత గింజను అరగదీస్తే తెల్లగా కనిపిస్తుంది. అప్పుడు ఒకవైపు తెల్లగా, ఒకవైపు నల్లగా ఉంటుంది. బోర్లాగా పడితే ఎనిమిది, వెల్లకిలా పడితే నాలుగుగా లెక్కిస్తారు. నేను చింతగింజలతో సీతాకోక చిలుకను తయారు చేసి దానిలోపల ధర్మోకాల్ బాల్స్‌ను వేశాను. ధర్మోకాల్ బాల్స్ వలన రెక్కలలో ఉండే రంగులను చూపించటానికి పనికొచ్చింది.
పిస్తాపప్పు పొట్టుతో...
పిస్తాపప్పు పైన ఉండే గట్టి పెంకు లాంటి నిర్మాణాలు పారేసేవే. వాటితో సీతాకోక చిలుకను తయారు చేశాను. ఒక్కో పప్పుకు రెండు షెల్స్ వస్తాయి. ఇవి చాలా గట్టిగా లేత పసుపు రంగుతో అందంగా ఉండటం వలన ఎన్ని బొమ్మలైనా చేయవచ్చు. సీతాకోక చిలకలకు మూడు జతల కాళ్ళుంటాయి. థొరాక్స్ మూడు ఖండితాలుగా విభజింపబడి ఉంటుంది. ఒక్కో ఖండితానికి ఒక్కో జత కాళ్ళు అతకబడి ఉంటాయి. ఈ కీటకాలకు ఒక కజత శృంగాలు ఉంటాయి. వీటిలోని మరో జాతి 'మాత్'లలో ఈ శృంగాలు దారంలాగా ఉంటాయి. దీనికి పొడవైన తొండము ఉంటుంది. దానితోనే పూవులలోని మకరందాన్ని తాగుతాయి. వీటిలో 18,500 జాతులు ఉన్నాయి. ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాయి. సింగపూర్‌లో బటర్ ఫ్లై మ్యూజియం బాగుంటుంది. ఒక్క అంటార్కిటికాలో మాత్రం సీతాకోక చిలుకలు నివసించవు.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్