Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అమ్మాయిని అత్తారింట్లో వదిలి మూడు రోజులే. ఇంకా పెండ్లి పనుల అలసట కూడా తీరలేదు. ఇప్పుడు ఎందుకు ఉన్నట్టుండి ఫోన్ చేసి అర్జెంట్‌గా రమ్మన్నాడు. అమ్మాయి వల్ల ఏమైనా తప్పు జరిగిందా. సంధ్య అలా చేసేది కాదా? అసలే వియ్యంకుడు అదో తరహా మనిషి. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో అర్థం కాదు. ఏం జరిగిందో ఏమో' అనుకుంటూ కంగారుగా ట్రైన్ ఎక్కి బయలు దేరింది పద్మ.
ట్రైన్లో కూర్చుంటే ఎన్నో ఆలోచనలు. మనసును కలచివేస్తున్నాయి. పెండ్లి రోజు రోడ్డుపై నిలబడి ఎంత గొడవ చేశాడు. ఇంట్లోకి రానంటే రానని మొండి కేశాడు. ఆ తండ్రీ కొడుల భాషేంటి? ఆ తిట్లేంటి. ఒక పక్క పెండ్లి జరుగుతుంది, బంధువులంతా ఉన్నారు. ఇవేవీ వాళ్ళకు పట్టవు. అప్పుడే పద్మకు అనుమానం వచ్చింది. అలాంటి మనుషుల మధ్య అమాయకు రాలైన తన సంధ్య ఎలా బతుకుదుందో అని. అనుకున్నట్టే మూడు రోజులకే వియ్యంకుడు ఫోన్ చేసి రమ్మన్నాడు.
పద్మ వాళ్ళకు పెద్ద కిరాణా షాప్ ఉంది. భర్త మెతక మనిషి. దాంతో ఇంటా, బయట అన్నీ పద్మనే చూసుకునేది. పద్మకు ఇద్దరు కూతుళ్ళు. పెద్దమ్మాయి సంధ్య. డిగ్రీ చదువుతోంది. రెండో అమ్మాయి ఇంజనీరింగ్. అనుకోకుండా సంధ్యకు ఓ సంబంధం వచ్చింది. అబ్బాయి సాఫ్ట్వేర్. మంచి జీతం. పేరు కార్తిక్. బిడ్డ చదువు పూర్తయ్యే వరకు అమ్మాయికి పెండ్లి చేయకూడదనుకుంది పద్మ. కానీ మంచి సంబంధం అని ఒప్పుకుంది.
రెండు లక్షల కట్నంతో పాటు ఇంటికి కావల్సిన అన్ని సామాన్లు ఇచ్చి పెండ్లి ఘనంగా చేసింది. వియ్యంకుడు ఎంతో గౌరవంగా మాట్లాడేవాడు. అతని మాట తీరు చూసి మంచి వ్యక్తే అనుకుంది. కానీ అతనే పెండ్లి రోజు పెద్ద సమస్య తెచ్చాడు. కొడుక్కి, తండ్రికి అస్సలు పడదు. పెండ్లి రోజు తండ్రి చొక్కా వేసుకోకపోతే కొడుకు కోప్పడ్డాడు. దాంతో అతను ఇంట్లోకి రానని మొండిగా బయటే కూర్చున్నాడు. దాంతో తండ్రీ, కొడుకులకు పెద్ద గొడవే జరిగింది. పెండ్లి రోజు ఇదేం గొడవ అనుకొని పద్మ వెళ్ళి వియ్యంకుడిని బతిమలాడి ఇంట్లోకి పిలిచింది. చివరకు అతను రావడంతో సమస్య పరిష్కారమయింది. కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత పద్మ, సంధ్యను అత్తారింట్లో వదిలిపెట్టి పిన్ని, బాబాయిని తోడుంచి వెళ్ళిపోయింది.
అలా వెళ్ళిందో లేదో మూడో రోజే వియ్యంకుడు పద్మకు ఫోన్ చేసి 'ఒక్కసారి నువ్వు మా ఊరికి రా, నీ కూతురు ఏం చేసిందో చెబుతా' అని ఫోన్ పెట్టాడు. పద్మ కంగారుగా సంధ్యకు ఫోన్ చేసింది. ఎందుకు రమ్మన్నాడో సంధ్యకు కూడా తెలియదు. దాంతో పద్మ కంగారుగా ఇప్పుడు అక్కడికే బయలే దేరింది.
ట్రైన్ దిగి ఆటో మాట్లాడుకొని వియ్యాల వారి ఇంటికి వెళ్ళింది. వెళ్ళీ వెళ్ళగానే ''ఆ వచ్చావా.. రామ్మా రా.. ఇదేనా మీ సంస్కారం. నీ కూతురు చూడు ఎంత నీచమైన పని చేసిందో అన్నాడు'. చిన్న పిల్ల తెలియక ఏమైనా పొరపాటు చేస్తే క్షమించండి అన్నయ్య గారు, అమ్మాయితో నేను మాట్లాడతాను' అంటూ పద్మ అతడిని బతిమలాడుకుంది.
ఇంతకీ సంధ్య చేసిన తప్పేంటని అడిగితే 'మీ అమ్మాయి వంటింట్లో వంట చేస్తుంటే, మా వాడు వెళ్ళి ఆమె నడుము పట్టుకున్నాడు' అని చెప్పాడు. అది విని పద్మకు నోట మాట రాలేదు. ఏం చేయాలో అసలే తోచలేదు. ఈ విషయం తెలిసి కొడుకు మళ్ళీ తండ్రితో పెద్ద గొడవ పెట్టుకుని అక్కడి నుంచి భార్యను తీసుకుని సిటీకి వచ్చేసి వేరు కాపురం పెట్టాడు.
వేరు కాపురం పెట్టిన తర్వాతైనా కూతురు, అల్లుడు సంతోషంగా ఉంటాను కుంది. కానీ సమస్య అప్పుడే మొదలయింది. తండ్రికి తగ్గ కొడుకులా ఉన్నాడు కార్తిక్. సంధ్యను ఎప్పుడూ సూటి పోటి మాటలు అంటాడు. చేతికి ఒక్కపైసా ఇవ్వడు. పైగా అంతెందుక తింటున్నావు. ఇదెందుకు వండావు' అని ప్రతి దానికీ లెక్కలు తీస్తాడు. గంటలు గంటలు ఎవరితోనో ఫోన్లు మాట్లాడతాడు. అర్థరాత్రి అయినా నిద్రపోడు. సంధ్యతో తన పని అయిపోయిన తర్వాత ఓ పక్కకు తిరిగి పడుకుంటాడు.
'ఎవరితో మాట్లాడుతున్నావంటే నీకెందు' అని కొడతాడు. ఆ ఇంట్లో సంధ్యకు ఎలాంటి భద్రతా లేదు. అలాంటి పరిస్థితుల్లోనే నెల తప్పింది. అప్పటి నుంచి కార్తిక్ ఆమెను అస్సలు పట్టించుకోడు. 'నీకే తిండి దండగ అనుకుంటే మళ్ళీ నీ కడుపులో బిడ్డ ఒకటా' అనేవాడు. ఇదంతా సంధ్యకు ఏమీ అర్ధమయ్యేది కాదు. ఈలోపు అతను కంపెనీ పనిపై ఆమెరికా వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు కార్తిక్, తండ్రిపై ఉన్న అనుమానంతో భార్యను పుట్టింట్లో వదిలి వెళ్ళాడు. మళ్ళీ మూడు నెలలకు వచ్చాడు. కానీ సంధ్యను మాత్రం పుట్టింట్లోనే ఉంచాడు.
పాప పుట్టిన తొమ్మిది రోజలకు కార్తిక్ ఆఫీస్ పనిపై మళ్ళీ అమెరికా వెళ్ళాడు. మూడు నెలల తర్వాత తిరిగి వచ్చాడు. కానీ ఎంతకీ సంధ్యనూ, పాపను తీసుకెళ్ళడు. దాంతో పద్మనే కూతురినీ, మనవరాలినీ వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళింది. అప్పటి నుంచి సంధ్యకు కష్టాలు మొదలయ్యాయి. పాపకు పాలు కావాలంటే 'ఇద్దరూ కలిసి ఎన్ని పాలు తాగుతారు' అంటాడు. పాపను కనీసం ఎత్తుకోడు. భర్త ప్రవర్తన, మాటలు సంధ్య భరించలేక పోయేది. ఇంట్లో తిండి కూడా సరిగా ఉండేది కాదు. కార్తిక్ అస్సలు పట్టించుకునే వాడు కాదు. అదంతా భరించలేక ఆమె పుట్టింటికి వచ్చేసింది.
ఓపక్క కార్తిక్ అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడే ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో కూతురి పరిస్థితి ఏమిటో అర్థం కాక తెలిసిన వాళ్ళు చెబితే పద్మ, సంధ్యను తీసుకుని ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చింది.
పరిస్థితి అంతా తెలుసుకున్న సభ్యులు కార్తిక్‌కి లెటర్ పంపారు. అతను ఒక్కడే వచ్చి 'సంధ్యకు ఇంట్లో పనులు ఏమీ రావు. ఏం చేస్తుందో ఆమెకే తెలియదు. అన్నీ వేస్ట్ చేస్తుంది. ఎంత చెప్పినా వినిపించుకోదు. అందుకే అప్పుడప్పుడు కోప్పడతాను. దానికే ఆమె పుట్టింటికి వెళ్ళి కూర్చుంటుంది. దానికి నేనేం చేయాలి. తప్పంత ఆమెదే' అన్నాడు.
'నీ బిడ్డ పాలు తాగుతుంటే లెక్కలు కడతావు. గంటలు గంటలు ఎవరితోనే ఫోన్లో మాట్లాడతావు. భార్య, బిడ్డ అనే ప్రేమే లేదు. ఇప్పటి వరకు నీ బిడ్డను ఒక్కసారైనా ప్రేమతో ఎత్తుకున్నావా? ప్రతి చిన్న విషయానికీ సంధ్యను అనుమానించి కొడతావు. తప్పులన్నీ నీ దగ్గర ఉంచుకుని ఆమెను అంటావా? ఏవో మాయ మాటలు చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నావా? సంధ్యను వదిలిపెట్టి హాయిగా అమెరికా వెళ్ళిపోదామనుకుంటున్నావా? ఆమె ఇప్పుడు నీ పై పోలీస్ స్టేషన్లో కేసుపెడితే రాష్ట్రం వదిలి ఎక్కడీ వెళ్ళలేవు. నీ వీసా కూడా రద్దవుతుంది. వాళ్ళకు అండ ఎవరూ లేరని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. భార్యా పిల్లల్ని ఇబ్బంది పెట్టి నువ్వు మాత్రం ఏం సుఖంగా ఉంటావు. ఇంట్లో ప్రశాంతత ఉంటేనే నువ్వూ హాయిగా ఉద్యోగం చేసుకోగలవు. ఇప్పటికైనా నువ్వు మారకపోతే నీపై కేసు పెట్టడానికి సంధ్య సిద్దంగా ఉంది. ఇక నువ్వే ఆలోచించుకో, నిర్ణయం నీదే' అన్నారు సభ్యులు.
కేసనేసరికి కార్తిక్ భయపడి 'నేనేమీ ఇవన్నీ కావాలని చేయడం లేదు. సంధ్య వల్లనే ఇదంతా. ఆమె మంచిగా ఉంటే నేను మాత్రం ఎందుకు ప్రేమగా ఉండను. నాకు నా భార్యా, పాప కావాలి' అన్నాడు.
ఆమెతో మేము మాట్లాడతాం. ఇకపై తన వల్ల నీకు ఏమైనా ఇబ్బంది వస్తే మా దగ్గరకు వచ్చి చెప్పు. అంతేకానీ నువ్వు మాత్రం సంధ్యను కొట్టడానికి వీల్లేదు. ఇంట్లో వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. అయినా నీతో రావాలో వద్దో అని నిర్ణయించుకోవల్సింది సంధ్య' అన్నారు.
సభ్యులు సంధ్య అభిప్రాయం అడిగారు. 'అతను మంచిగా చూసుకుంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఆయన సంవత్సరం వరకు అమెరికా వెళ్ళకూడదు. నాకు అతనిపై నమ్మకం వస్తేనే వెళ్ళనిస్తాను' అంది. దానికి కార్తిక్ ఒప్పుకొని ఇకపై సంధ్యను, పాపను మంచిగా చూసుకుంటానని చెప్పి ఇద్దరినీ తనతో ఇంటికి తీసుకెళ్ళాడు.
రెండు వారాల తర్వాత పద్మ లీగల్‌సెల్‌కు వచ్చి 'మేడమ్ ప్రస్తుతం కార్తిక్ అమ్మాయినీ, పాపను బాగానే చూసుకుంటున్నాడు. ఇదంతా మీ వల్లనే జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను' అని ఆనందంగా చెప్పి వెళ్ళిపోయింది.
- సలీమ