Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓ తల్లి తన ఏడుగురు బిడ్డలతో కలిసి పితృస్వాయ్య భావజాలంపై పోరాడుతుంది. సంప్రదాయ సంకెళ్ళను తెంచుకుని అసమానతలకు వ్యతిరేకంగా తన వ్యాపారాన్ని కొనసాగిస్తుంది. ఎవరెన్ని మాటలు అంటున్నా బిడ్డల బంగారు భవిత కొరకు కష్టపడుతోంది. జోధ్‌పూర్‌లో మసాలా దినుసులు అమ్ముతూ గొప్ప 'స్పౖౖెస్ గర్ల్స్ ఆఫ్ ఇండియాగా' గుర్తింపు తెచ్చుకున్న ఆ స్ఫూర్తి దాయక కుటుంబం గురించి...
జోధ్‌పూర్‌లో ఎప్పుడూ సందడిగా ఉండే సర్దార్ మార్కెట్లోని 'స్పైస్ గర్ల్స్ ఆఫ్ ఇండియా' దుకాణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులను ఆప్యాయంగా పలకరిస్తుంది. వారి ట్రేడ్‌మార్క్ మసాలా చారు కప్పును వారి ఎంవి స్పైసెస్ స్టోర్ వద్ద రుచికంగా అందిస్తోంది. ప్రపంచం నలుమూలల నుండి నగరాన్ని సందర్శించే పర్యాటకులు వీరి మసాలా దినుసుల గురించి గొప్పగా చెబుతుంటారు. ఆ తల్లి అమ్మే సుగంధ ద్రవ్యాల కథ వెనుక కష్టం మాత్రమే కాదు తన ఏడుగురు కుమార్తెలకు ఈ సమాజంలో సమానత్వం, గౌరవం అందించేందుకు యుద్ధానికి సిద్ధమైన తల్లి కథ ఇది.
కొడుకు పుట్టలేదని
భగవంతి... తన భర్త మోహన్ లాల్ కన్నుమూసినప్పుడు అత్తగారి నుండి తీవ్ర వ్యతిరేకతకు గురయింది. భర్త లేని ఓ మహిళ ఆడపిల్లల సహకారంతో వ్యాపారాన్ని చూసుకోవడం ఏంటి అని ఎన్నో విమర్శకు గురయింది. అజ్మీర్‌లో పెరిగిన భగవంతి ఉన్నత విద్యను అభ్యసించి మంచి ఉద్యోగం సంపాదించాలని చిన్నతనం నుండి కలలు కనేది. కాని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో చదువును మధ్యలోనే ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది. 22 సంవత్సరాల వయసులో జోధ్‌పూర్‌కు చెందిన మోహన్‌లాల్‌ను వివాహం చేసుకుంది. వరుసగా ముగ్గురు కుమార్తెలకు జన్మనిచ్చింది. కొడుకు పుట్టకపోవటంతో అత్తమామలకు శత్రువయ్యింది. ఆడపిల్లలు కుటుంబానికి ''భారం'' అంటూ ఆమెను సూటిపోటి మాటలతో వేధించేవారు.
ఇంటి నుండి వచ్చేసి
''నా భర్త బాగా చదువుకున్న మంచి మనసున్న వ్యక్తి. మా అత్తమామలతో ఎటువంటి గొడవలు లేకుండా సామరస్యంగా కలిసి జీవించడానికి ఎంతో ప్రయత్నించారు. కానీ వీలుకాలేదు... దాంతో మేము మా అమ్మాయిలతో ఇంటి నుండి బయటకు వచ్చేశాము'' అంటూ భగవంతి గుర్తు చేసుకుంది.
బెడ్‌షీట్ వేసి అమ్మేవారు
కిరాణా దుకాణం నడిపే మోహన్ లాల్‌కు భగవంతి వంటలంటే ఎంతో ఇష్టం. దాని కోసం ఆమె ఉపయోగించే మసాలా దినుసుల గురించి తెలుసుకున్నాడు. ఓ రోజు ఈ జంట వివిధ రకాల మసాలా దినుసులను తయారు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. రాత్రి వరకు పని చేస్తారు. మరుసటి రోజు ఉదయం మోహన్ లాల్ ఆ మసాలా దినుసులను మెహరంగర్ కోట సమీపంలో ఓ బెడ్‌షీట్ వేసి అమ్మడం మొదలుపెట్టాడు. ఓ రోజు అతని వద్దకు కోట గార్డు వచ్చి జోధ్‌పూర్ మహారాజా తనను పిలిచాడని చెప్పాడు.
రాజాగారికి లేఖ
''మొదట నా భర్త భయపడ్డాడు. బయట సుగంధ ద్రవ్యాలు అమ్మే వ్యక్తిని కలవాలని రాజాగారు కోరినట్టు ఆ గార్డు చెప్పడంతో ఆయనలో కాస్త భయం తగ్గింది. అంతకు ముందు ఓ ఫ్రెంచ్ పర్యాటకుడు మా సుగంధ ద్రవ్యాలు కొన్నాడు. వాటిని అతను చాలా ఇష్టపడ్డాడు. అతనే రాజాకు ఓ లేఖ రాశారు. అందుకే రాజా మా పనిని ప్రశంసించి నగరానికి మీరు కీర్తిని తెచ్చారు అంటూ నా భర్తకు మెహరంగర్ కోటలో 6,000 రూపాయల అద్దెకు స్థలం ఇచ్చాడు'' అని భగవంతి చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు
మోహన్ లాల్ తన రోజు మొత్తాన్ని మసాలా దినుసుల దుకాణంలో గడిడి సాయంత్రం తన కిరానా దుకాణానికి తిరిగి వచ్చి ప్రతిరోజూ రెండు గంటలు స్పానిష్, ఫ్రెంచ్ వంటి వివిధ భాషలను నేర్చుకుంటూ పర్యాటకులతో సంభాషించేవాడు. ఈ వ్యాపారం అతి తక్కువ కాలంలోనే అభివృద్ధి చెందింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులను భారతీయ సుగంధ ద్రవ్యాలు రుచి చూసేలా చేశారు ఆ జంట. ఇంగ్లాండ్ కర్రీ ఆర్గనైజేషన్ కూడా దీన్ని ధృవీకరించింది.
అత్యంత కష్ట సమయం
వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతున్న సమయంలో మోహన్ లాల్ కన్నుమూశారు. భగవంతి తన జీవితంలో చాలా కష్టమని చెప్పే సమయం ఇది. తన ఏడుగురు బిడ్డల భవితను తలచుకుని కుమిలిపోయింది. తీవ్ర ఆందోళన చెందింది. ఎందుకంటే ఆమె అత్తగారు నెలవారీ అద్దెకు బదులుగా దుకాణాన్ని తమకు ఇచ్చేయమంటూ అడగడం ప్రారంభించారు.
బిడ్డలకే ప్రాధాన్యం
''దుకాణాన్ని నేనే కొనసాగిస్తానని వారికి చెప్పినప్పుడు కోప్పడ్డారు. ఓ మహిళ మార్కెట్లో కూర్చోవడం ఏంటీ... పైగా ఆడపిల్లలను కూడా అందులో కూర్చోబెడతావా..? నీకు సిగ్గులేదా..? అంటూ ఎన్నో మాటలు అన్నారు. అయినా నేను నా బిడ్డలకు ప్రాధాన్యం ఇచ్చాను. నేను చేయాల్సిన పనిని కొనసాగించాను'' అని ఆమె చెప్పింది. అప్పటి నుండి భగవంతి తన ఏడుగురు కుమార్తెలైన ఉషా, పూనమ్, నీలం, నిక్కి, కవిత, రితు, ప్రియలను నిర్విరామంగా చదివించారు. వాళ్ళు కూడా తండ్రి వలే అనేక విదేశీ భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు.
వెబ్సైట్ ద్వారా అమ్మకాలు
పస్తుతం ఎంవి స్పైసెస్ను ఆ ఏడుగురు అమ్మాయిలే నడుపుతున్నారు. జోధ్‌పూర్ నగరం అంతటా వారికి నాలుగు దుకాణాలు ఉన్నాయి. వారు విస్తృతమైన గ్రౌన్దేడ్, గ్రౌండ్డ్ సుగంధ ద్రవ్యాలు, టీ సుగంధ ద్రవ్యాలు, కూరలకు ఉపయోగించే సుగంధ ద్రవ్యాలు, అలాగే క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్‌లను కూడా అందిస్తారు. రిటైల్ దుకాణాలతో పాటు 250 గ్రాముల సుగంధ ద్రవ్యాలకు 3 డాలర్ల నుండి 20 డాలర్ల ధరతో తమ వెబ్సైట్ ద్వారా విదేశీ వినియోగదారులకు అందిస్తుంది.
విదేశాల నుండి ఆర్డర్లు
సంవత్సరాలుగా దుకాణాన్ని సందర్శించిన చాలా మంది పర్యాటకులు తమ సొంత దేశం నుండి ఆన్లైన్లో ఆర్డర్లు ఇచ్చే రిపీట్ కస్టమర్లుగా మారారు. నెలకు సుమారు 30 విదేశీ ఆర్డర్లు వస్తుంటాయి. వారి కుటుంబ సభ్యులే కాకుండా అదనంగా 12 మందితో కూడిన బృందం వారి కోసం పనిచేస్తోంది. యుకెకు చెందిన సందర్శకుడు క్లెయిర్ భగవంతి మూడవ బిడ్డను ''స్పైస్ గర్ల్ నంబర్ 3'' అని పిలుస్తాడు. ''మోహన్ లాల్ మా కోసం చాలా కష్టపడ్డారు. ఆయన పేరును నేను ఇలాగే వదిలిపెట్టను. నేను జీవించి ఉన్నంత కాలం ఈ వ్యాపారం కొనసాగుతూనే ఉంటుంది. నా కుమార్తెలు అందరూ నాకెంతో సహకరిస్తున్నారు'' అంటుంది భగవంతి.