Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గర్భం ధరించడం ప్రతి మహిళకూ ఓ వరం. అయితే ఆ సమయంలో ఎదురయ్యే ఒత్తిడి, ఆందోళనల వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యం, ఎక్కువ మొత్తంలో హార్మోన్లు ఉత్పత్తవడం వంటివి సహజం. తద్వారా పలు శారీరక మార్పులు జరగడంతో పాటు కొన్ని సమస్యలు కూడా ఎదురవుతుంటాయి. వీటిలో పిగ్మెంటేషన్ కూడా ఒకటి. నుదురు, బుగ్గలపై నల్లటి మచ్చల్లాగా వచ్చే ఈ సమస్య వల్ల ముఖం నిర్జీవమైపోయినట్లుగా, అందవిహీనంగా కనిపిస్తుంది. మరి, ఈ సమస్య నుంచి బయటపడడానికి ఏవైనా సౌందర్య సాధనాలు వాడదామా అంటే వాటిలో ఉండే రసాయనాలు కడుపులో పెరిగే బిడ్డపై ఎక్కడ ప్రతికూల ప్రభావం చూపుతాయో అన్న భయం కాబోయే తల్లుల్ని వెంటాడుతుంది. ఈ క్రమంలో ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి ఇంట్లో లభించే కొన్ని సహజసిద్ధమైన పదార్థాలు ఉపయోగపడతాయంటున్నారు సౌందర్య నిపుణులు.
ఎలాంటి చర్మ సమస్యనైనా తగ్గించే శక్తి కలబందకు ఉందనడంలో సందేహం లేదు. ఇది ప్రెగెన్సీ సమయంలో వచ్చే పిగ్మెంటేషన్‌ను కూడా సమూలంగా తొలగిస్తుంది. ఇందుకోసం కలబంద గుజ్జును సమస్య ఉన్న చోట రాసి ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్లతో కడిగేయాలి. ఇలా రోజూ చేయడం వల్ల వారం రోజుల్లోనే మీ ముఖంలో తేడా మీరు గమనించచ్చు.
రెండు బాదంపప్పులు, టీస్పూన్ తేనె.. ఈ రెండూ కలిపి మెత్తటి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్న చోట రాసి పావుగంట పాటు అలాగే ఉంచుకోవాలి. ఆపై కడిగేసుకుంటే పిగ్మెంటేషన్ తగ్గడమే కాదు.. దాని వల్ల అక్కడ నిర్జీవమైన చర్మం కూడా కాంతివంతంగా మారుతుంది.
గంధం, పసుపు సమపాళ్లలో తీసుకొని దానికి పాలను కలుపుతూ పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. దీన్ని పిగ్మెంటేషన్‌తో నిర్జీవమైన చర్మంపై రాసి అరగంట పాటు అలాగే ఉంచుకొని ఆ తర్వాత కడిగేసుకోవాలి. తద్వారా చక్కటి ఫలితం కనబడుతుంది.
సన్నగా తురిమిన బంగాళాదుంప గుజ్జుకు కాస్తంత నిమ్మరసం కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్‌ను రోజూ సమస్య ఉన్న చోట అప్త్లె చేసుకొని అరగంట పాటు ఆరనివ్వాలి. ఆపై చల్లటి నీటితో కడిగేసుకుంటే క్రమంగా సమస్య తగ్గుముఖం పడుతుంది.
గుప్పెడు పుదీనా ఆకులకు నీళ్లు కలుపుతూ మెత్తటి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. దీన్ని సమస్య ఉన్న చోట అప్త్లె చేసుకొని పావుగంట తర్వాత కడిగేసుకుంటే సరిపోతుంది. పిగ్మెంటేషన్ బారి నుంచి త్వరితగతిన ఉపశమనం పొందాలంటే రోజుకు రెండుసార్లు ఈ చిట్కా పాటిస్తే చక్కటి ఫలితం ఉంటుంది.
పిగ్మెంటేషన్ని తగ్గించుకోవడానికి ఆహారం విషయంలో కూడా శ్రద్ధ వహించడం అవసరం. దానిమ్మ, బెర్రీస్, నట్స్, బొప్పాయి.. వంటి యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పదార్థాలతో పాటు కివీ, నిమ్మ, స్ట్రాబెర్రీ, కమలాఫలం, ద్రాక్ష, క్రాన్బెర్రీస్.. వంటి విటమిన్-సి అధికంగా లభించే పండ్లను కూడా రోజూ తప్పకుండా ఆహారంలో భాగం చేసుకుంటే సమస్య త్వరగా తగ్గుతుంది. ఇవి కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యానికి కూడా అవసరమే.