Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తులసి చర్మానికే కాదు.. శిరోజాల సంరక్షణకూ అవసరం. కుదుళ్లలో చెమట, చుండ్రు, దురద, చిన్న చిన్న కురుపులు రావడం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఇటువంటి వారికి తులసి నూనె చక్కటి పరిష్కార మార్గం. దీనికోసం చేయాల్సిందల్లా తులసి ఆకులను పొడి చేసి (సుమారు పది స్పూన్ల పొడి), ఆ పొడిని ఓ డబ్బా కొబ్బరి నూనెతో కలిపి వేడి చేయాలి. నూనె వేడెక్కడం మొదలయ్యాక అందులో కొన్ని మెంతులు వేయాలి. మెంతులు నూనెలో ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి నూనెను చల్లార్చాలి. పొడిగా ఉన్న సీసాలో ఈ నూనెను భద్రపరచుకొని వారానికి రెండుసార్లు దీంతో మర్దన చేసుకోవాలి. గంట తర్వాత తలస్నానం చేస్తే సమస్య సులభంగా పరిష్కారమవుతుంది. కేశ సంపదను సైతం పెంచుతుంది.
రోజూ 2, 3 తులసి ఆకులను నమలడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. పొడి చర్మం, గజ్జి, తామర వంటి చర్మ వ్యాధుల నుంచి కచ్చితంగా ఉపశమనం పొందవచ్చు.
తులసి ఆకులు, గుడ్డు తెల్లసొన కలిపి పేస్ట్‌లా తయారుచేసి 20 నిమిషాలు ముఖానికి పట్టించి కడిగేయాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తే చర్మం బిగుతుగా మారి ముఖం కాంతిని సంతరించుకుంటుంది.
తులసి రసాన్ని తాగడం వల్ల చర్మానికి, శిరోజాలకు, దంతాలకు చాలా మంచిది. అలాగే శరీరంలో వ్యాధినిరోధక శక్తి కూడా పెరుగుతుంది.