Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సులువుగా బరువు తగ్గాలన్నా.. ఆరోగ్యంగా ఉండాలన్నా ప్రతీ రోజు కనీసం అర గంట నుంచి 90 నిమిషాలు నడవాలని వైద్యులు చెబుతున్నారు. అయితే రోజూ నిర్ధారిత సమయంలో నవడం వీలుకాకపోయినా.. వారంలో కనీసం 150 నిమిషాలు (2.5 గంటలు) వాకింగ్ సమయం ఉండేలా ప్లాన్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నడవమన్నారు కదా అని చాలామంది నామ్ కే వస్తే అన్నట్టుగా నడక మొదలు పెడతారు. అలా నడవడం వల్ల ఏ మాత్రం ఉపయోగం ఉండదు. శరీరం అంతా చరుగ్గా కదిలే విధంగా వేగంగా నడవాలి. వేగంగా నడవడం వల్ల సాధారణంగా సమయంలో కంటే ఊపిరి ఎక్కువగా పీలుస్తారు. మీ వద్ద ఫిట్నెస్ బ్యాండ్ ఉన్నట్టయితే తప్పకుండా మీ హార్ట్ రేట్‌ను చెక్ చేసుకోండి. ఫిట్నెస్ బ్యాండ్, యాప్ లేకపోతే హార్ట్‌రేట్ మానిటర్ తీసుకోవడం మంచిది.
30 నిమిషాలు నడవాలని నిర్ణయించుకున్నట్టయితే. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి బ్రేక్ తీసుకోవచ్చు. ముందుగా కాసేపు వార్మింగ్ అప్ చేసిన తర్వాతే వాకింగ్ మొదలు పెట్టడం మంచిది. ఎందుకంటే అప్పటి వరకు బిరుకుగా ఉన్న కండరాలు వార్మింగ్ అప్‌తో ఆక్టివ్ అవుతాయి. మొదటిసారి వాకింగ్ చేసేవారు ఒక్కసారే ఎక్కువ దూరం, ఎక్కువ సమయం నడవకూడదు. నెమ్మది నెమ్మదిగా దూరాన్ని, సమయాన్ని పెంచుకోవాలి. లేకపోతే మొదటి రోజు అతిగా నడిస్తే రెండో రోజు నడవడం కష్టమవుతుంది. దీనివల్ల మీలో శ్రద్ధ తగ్గిపోతుంది.
వర్షం వచ్చిందనో, మరేదైనా కారణంతో నడకను ఒక్కరోజు కంటే ఎక్కువ రోజులు వాయిదా వేయకూడదు. ఒక్క రోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా నడవడమే మంచిది. దీనివల్ల క్యాలరీలు కరగడమే కాకుండా మీ శరీర జీవక్రియ మెరుగుపడుతుంది. ఒక వేళ బయటకు వెళ్లడం కుదరకపోతే ఇంట్లోనే వ్యాయామం చేయడానికి ప్రయత్నించడం మంచిది. .
బరువు తగ్గాలంటే రోజూ కనీసం గంట నుంచి గంటన్నర నడవాలి. అలాగే అధిక క్యాలరీలు కలిగిన ఆహారానికి కూడా దూరంగా ఉండాలి. బీజీ లైఫ్ వల్ల చాలామందికి కనీసం అరగంట వాకింగ్ చేసే సమయం కూడా ఉండదు. అలాంటివారు రోజులో కనీసం మూడు సార్లు 10 నిమిషాల చొప్పున నడవడానికి ప్రయత్నించండి.
నడవడానికి ముందు కనీసం ఐదు నిమిషాలు వార్మప్ చేయాలి. రోజూ 30 నిమిషాలు నడిస్తే కనీసం 100 నుంచి 300 క్యాలరీలు ఖర్చవుతాయి. అయితే అది మీ బరువు మీద ఆధారపడి ఉంటుంది. వాకింగ్ చేసేప్పుడు మీ శరీరంలో నిల్వ ఉన్న కొవ్వులే ఎక్కువగా కరుగుతాయి.
మొదటి 30 నిమిషాల నడకలో శరీరంలో నిల్వ ఉన్న చక్కెర ఇంధనంలా మండుతుంది. అలా నడక కొనసాగించే కొద్ది శరీరంలో ఉన్న కొవ్వులు సైతం కరగడం మొదలవుతుంది. అందుకే రోజూ 30 నిమిషాలు కంటే ఎక్కువ సేపు నడవడానికి ప్రయత్నించండి. వాకింగ్ వల్ల కేవలం బరువు మాత్రమే కాదు డయాబెటీస్, గుండె జబ్బులు తదితర వ్యాధుల ముప్పు నుంచి కూడా బయటపడతారు. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం ఎంచక్కా నడకను ప్రారంభించండి.