Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శిరీష బండ్ల.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోన్న పేరు. అంతరిక్షానికి తెలుగుదనాన్ని అద్దిన మన తెలుగు బిడ్డ. ఈ నెల 11వ తేదీన అంతరిక్షంలోని అడుగుపెట్టి తన చిన్ననాటి కలను నిజం చేసుకుంది. కల్పనా చావ్లా, సునీత విలియవమ్స్ తర్వాత రోదసి లోకి అడుగుపెట్టిన భారతీయ మహిళగా చరిత్రనే సృష్టించిన ఆమె అద్భుత ప్రయాణం గురించి నేటి మానవిలో...
మొత్తం ఆరుమంది పరిశోధకులతో కూడిన ఈ టీమ్‌లో శిరీష ఒకరు. టీమ్ మొత్తానికీ ఆమె ఒక్కరే మహిళ కావడం మరో విశేషం. బ్రిటిష్ వ్యాపారవేత్త రిచర్డ్ బ్రాన్సన్కు చెందిన సంస్థ వర్జిన్ గెలాక్టిక్ పంపిస్తున్న 'యూనిట్' వ్యోమ నౌకలో ఆమె రోదసిలోకి అడుగుపెట్టారు. శిరీష రోదసి యాత్ర విజయవంతమైంది. ఆ ఘనత సాధించిన తొలి తెలుగు వ్యక్తి కావడంతో పాటు నాలుగో భారత్ మూలాలున్న వ్యక్తిగా... భారత్ మూలాలున్న మూడో మహిళగా చరిత్రకెక్కింది.
చిన్ననాటి కల...
34 ఏండ్ల బండ్ల శిరీష ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా తెనాలిలో పుట్టారు. తండ్రి మురళీధర్ పెథాలజిస్ట్‌గా పనిచేస్తారు. 1989లో ఆ కుటుంబం అమెరికాలోని హ్యూస్టన్‌కు వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. చిన్నతనం నుండే ఎప్పటికైనా అంతరిక్షంలో అడుగుపెట్టాలని ఆమె కలలు కనేది. అందనంత ఎత్తులో ఉండే చుక్కలను, చంద్రుడిని ఎలాగైనా అందుకోవాలని ఆశపడింది. తన లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఆస్ట్రోనాట్ కావాలి. ఆపైపుగా తన చదువును కొనసాగించింది.
చూపు సమస్యతో...
ఎయిర్స్ ఫోర్స్‌లో చేరి పైలెట్ అయితే నాసాలో అవకాశం దొరుకుతుందని తన మార్గాన్ని నిర్దేశించుకుంది. అయితే స్కూల్ విద్య అభ్యసించే సమయంలోనే ఆమెకు కంటి సమస్య వచ్చి తన కలల ప్రవాహానికి అడ్డుకట్ట వేసింది. పైలెట్ కానీ, ఆస్ట్రోనాట్ కాని కావాలంటే కంటి చూపు చాలా ముఖ్యం. దాంతో ఎంతో నిరుత్సాహపడింది. ఇంటర్ చదివే సమయంలో ఓ ప్రైవేట్ టూరిజం సంస్థ గురించి ఆమెకు తెలిసింది. అంతరిక్షంలోకి అడుగుపెట్టాలంటే నాసా మాత్రమే కాదు ఇంకా ఎన్నో మార్గాలు ఉన్నాయని ఆ సంస్థ ద్వారా ఆమె తెలుసుకుంది. ఇక తన కలలకు రెక్కలు కట్టుకుని ఆకాశమే హద్దుగా ప్రయత్నాలు కొనసాగించింది.
కలల రంగంలోకి అడుగు
ఎరో స్పేస్ ఇంజనీరింగ్‌పై ఫోకస్ పెట్టింది. ఇంజనీరింగ్ చేసే సమయంలోనే జీరో గ్రావిటీలో ప్రయాణించే ఛాన్స్ కొట్టేసింది. మైక్రోగ్రావిటీ సబ్జెక్ట్‌లో ఆమె నిష్ణాతురాలు. 2011లో ఫ్లోరిడా యూనివర్సిటీ నుండి ఏరోనాటికల్, ఆస్ట్రోనాటికల్ ఇంజినీరింగ్ పూర్తిచేసింది. వెంటనే ఉద్యోగంలో చేరిపోయింది. అప్పటి వరకు టెక్నికల్ పరంగా తప్ప వ్యాపారంపై పెద్దగా ఆమెకు అవగాహన లేదు. ఆ అవగాహన కోసం జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ చేసింది. అక్కడ ఆమెలోని ఆసక్తిని గమనించిన ఓ ప్రొఫెసర్ కమర్షియల్ స్పేస్ అనే సంస్థ నియామకాలు చేపడుతుందని చెప్పారు. అక్కడ ఇంటర్వ్యూకి హాజరై ఎంపికయ్యింది. అలా 2012లో తన కలల రంగంలోకి అడుగుపెట్టింది.
వర్జిన్ గెలాక్టిక్లోకి...
015లో వర్జిన్ గెలాక్టిక్ సంస్థకు మారిపోయింది. ఇది కూడా ఓ స్పేస్ టూరిజం సంస్థ. అక్కడ బిజినెస్ డెవెలప్మెంట్, అడర్ గవర్నమెంట్ అఫైర్ మేనేజర్‌గా చేరి ఇప్పుడు ప్రభుత్వ వ్యవహారాలు, పరిశోధన కార్యకలాపాల విభాగం వైస్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగింది. ఆ సంస్థ లాంచర్ 1, స్పేస్ షిప్ట్ 2 ప్రోగ్రామ్స్ విజయవంతంగా కావడంలో ఈమె కీలకపాత్ర పోషించింది. ఈ విధంగా పట్టుదలతో కృషి చేసి అంచలంచలుగా ఎదుగుతూ చివరకు అంతరిక్షంలోకి అడుగుపెట్టింది. ఆమె తన చిన్నతనం నుండి అంతరిక్షంలోకి అడుగుపెట్టాలని ఆమె కలలుకంటూ ఉండేది. ఇన్నేండ్లకు ఆమె కల నిజమైనందుకు ఆమె ఆనందానికి అవధుల్లేవు.
ఎవరెవరు ఉన్నారు...
భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 8 గంటలకు ప్రారంభమైంది. నిజానికి ఈ రోదసియానం సాయంత్రం 6.30కి మొదలు కావాల్సి ఉంది. అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో 90 నిమిషాలు ఆలస్యంగా ఇది మొదలైంది. వర్జిన్ గెలాక్టిక్ యజమాని, బ్రిటన్ వ్యాపారవేత్త సర్ రిచర్డ్ బ్రాన్సన్తో పాటు బండ్ల శిరీష, మరో నలుగురు ఈ రోదసియానం చేశారు.
- సలీమ