Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మొదటిసారి తల్లైన మహిళల జీవన విధానంలో ఎన్నెన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. పాపాయి ధ్యాసలో పడిపోయి సరిగ్గా తినడం, కంటి నిండా నిద్రపోవడం కూడా మర్చిపోతుంటారు తల్లులు. ఇదిత వారిలో ఒత్తిడికి దారితీస్తుంది.. శారీరకంగానూ ప్రతికూల ప్రభావం చూపుతుంది. అయితే కొత్తగా తల్లైన మహిళల్లో ఈ నిద్రలేమి సహజమే అయినా.. అది తల్లీబిడ్డలిద్దరి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు నిపుణులు. అందుకే బాలింతలు వీలు చూసుకొని మరీ విశ్రాంతి తీసుకోవడం, నిద్ర పోవడం మంచిదని సలహా ఇస్తున్నారు. ఇందుకోసం కొన్ని చిట్కాలు సైతం సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం...
ఇంట్లో పెద్దలు ఉంటే: పసి పిల్లలకు రాత్రి, పగలు అనే తేడా ఉండదు. వాళ్లు ఎప్పుడు నిద్ర పోతారో, ఎప్పుడు మెలకువతో ఉంటారో చెప్పలేం. కొంతమంది గంటల తరబడి నిద్రపోతే.. మరికొందరు చిన్నారులు అలా ఓ అరగంట కునుకు తీసి ఆలోపే నిద్ర లేస్తుంటారు. ఇలా వారు నిద్ర లేచే సరికి తల్లి పక్కనే ఉండాలి. లేదంటే ఆకలితో ఏడుస్తుంటారు. ఇక పిల్లలు పడుకున్నారని ఆ సమయంలో ఇంటి పనులు చేసుకోవడం చాలామందికి అలవాటు. పిల్లలకు పాలిచ్చేటపుడు తల్లికి రాత్రుళ్లూ నిద్ర ఉండదు. దీంతో బాలింతల్లో నిద్రలేమి సమస్య ఎదురవుతుంటుంది. మరి దీన్ని జయించాలంటే పనులన్నీ పక్కన పెట్టి పిల్లలు నిద్రపోయినప్పుడే తల్లులూ నిద్ర పోవాలంటున్నారు నిపుణులు. ఒకవేళ ఇంట్లో చిన్నారుల్ని చూసుకునే పెద్దవాళ్లుంటే మీ పిల్లల బాధ్యతను కాసేపు వాళ్లకు అప్పగించి మీరు హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు.
కాసేపు వ్యాయామం: మనకేమో రాత్రి వేళ హాయిగా నిద్ర పోవడం అలవాటు. అదే పిల్లలేమో ఆ సమయంలో సరిగ్గా నిద్రపోరు. ఇక వేళా పాళా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు నిద్ర రమ్మంటే అస్సలు రాదు. నిజానికి బాలింతల్లో నిద్ర లేమికి ఇలా నిద్ర పట్టకపోవడమూ ఓ కారణమే అంటున్నారు నిపుణులు. అలాగని నిద్రను దాటవేయకుండా సులభంగా నిద్ర పట్టడం కోసం ధ్యానం, శ్వాస సంబంధిత వ్యాయామాలు, మీ కుటుంబ సభ్యుల సహాయంతో తల-శరీరం మర్దన చేసుకోవడం, కాసేపు నడక వంటివి సాధన చేస్తే మనసు రిలాక్సై సుఖ నిద్రకు ప్రేరేపిస్తుంది. తద్వారా శరీరానికీ విశ్రాంతి దొరుకుతుంది.
ఆ ఆలోచనల్ని వదిలేయండి: ప్రసవానంతర ఒత్తిడి సహజం. అయితే ఇందుకు కారణాలు అనేకం. గర్భం ధరించడం, డెలివరీ సమయాల్లో బరువు పెరగడం, శరీరంపై ముడతలు, అందం తగ్గిపోవడం వంటివి రావడం సహజమే అని తెలిసినా కొంతమంది వాటిని అంగీకరించలేరు. దాంతో మానసిక ఒత్తిడి, ఆందోళనలకు గురవుతుంటారు. తిరిగి పూర్వపు స్థితికి ఎప్పుడొస్తామో అన్న ఆలోచనల్లోనే నిరంతరం గడుపుతుంటారు. కొత్తగా తల్లైన మహిళల్లో నిద్రలేమికి ఇదీ ఓ కారణమే! ఇలాంటి మానసిక ఆందోళనలు మీకే కాదు మీ చిన్నారికీ మంచివి కాదు. కాబట్టి వీటిని ఎంత త్వరగా దూరం చేసుకుంటే అంత మంచిది. ఇలాంటి ఆలోచనలు మనసులోకి రానప్పుడు నిద్ర కూడా సుఖంగా పడుతుందంటున్నారు నిపుణులు. ఇక ఎంత ప్రయత్నించినా ఇలాంటి ఆలోచనలు తరచూ వేధిస్తున్నట్లయితే ఓసారి మానసిక నిపుణులను సంప్రదించి కౌన్సెలింగ్ కూడా తీసుకోవచ్చు.
బాధ్యతల్ని పంచుకోండి: బాలింతలకు రోజంతా తమ బిడ్డతోనే సరిపోతుంది. అలాంటప్పుడు ఇంటి పనులు, కుటుంబ బాధ్యతలు అంటే పని భారం తడిసిమోపెడవుతుంది. ఇలా అయితే పిల్లలు నిద్రపోయినప్పుడు తాము కూడా పడుకోవడానికి సమయం దొరకదు. కాబట్టి కొత్తగా తల్లైనవారు సాధ్యమైనంత వరకు పిల్లల్ని చూసుకోవడమొక్కటే పనిగా పెట్టుకోవాలి. ఇంట్లో ఇతర కుటుంబ సభ్యులున్నట్టయితే మిగతా పనులు వారికి అప్పగించడంలో తప్పు లేదు. అలాగే మీ పాపాయి తల్లిపాలతో పాటు పోత పాలు కూడా తాగుతున్నట్టయితే డబ్బా పాలు తాగించే బాధ్యతను భర్తకు అప్పగించవచ్చు. ఆ సమయంలో మీరు విశ్రాంతి తీసుకోవచ్చు. ఇలా ఆలోచిస్తే బాలింతలు విశ్రాంతి తీసుకోవడానికి, నిద్రలేమిని ఎదుర్కోవడానికి ఎన్నో మార్గాలున్నాయి.