Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వర్షాకాలంలో వేడివేడిగా ఏమైనా తినాలని, తాగాలనిపించడం సహజం. స్పైసీగా తింటూ చినుకులను ఆస్వాదిస్తుంటే ఆ మజానే వేరు. ప్రస్తుతం కరోనా కాబట్టి అందరూ ఆరోగ్యంపై దృష్టి పెట్టారు. ఎలాంటి ఆహారం తీసుకున్నా అందులో రోగనిరోధక శక్తి పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. అందుకే కాఫీ, టీకి బదులుగా వేడివేడి సూప్స్ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. నోటికి కూడా రుచిగా ఉంటుంది.
చికెన్ కార్న్ సూప్
కావల్సిన పదార్థాలు: స్వీట్‌కార్న్ - అరకప్పు, చికెన్ స్టాక్ - నాలుగు కప్పులు, మొక్కజొన్న పిండి - రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, కోడిగుడ్డు - ఒకటి, ఉడికించిన చికెన్ ముక్కలు - అరకప్పు, వెనిగర్ - ఒక టేబుల్‌స్పూన్.
తయారు చేసే విధానం: ఒక పాత్రలో మొక్కజొన్న పిండి తీసుకుని, అరకప్పు నీళ్లు పోసి పక్కన పెట్టాలి. మరో పాత్రలో స్వీట్ కార్న్, చికెన్ స్టాక్ వేసి ఉడికించాలి. నీళ్లు పోసి పెట్టుకున్న మొక్కజొన్న పిండిని అందులో వేయాలి. చిన్నమంటపై పదినిమిషాల పాటు ఉడికించాలి. తగినంత ఉప్పు వేసి ఉడికించిన చికెన్ ముక్కలు వేసి మరికాసేపు ఉంచాలి. కోడిగుడ్డు కొట్టి కలుపుకోవాలి. వెనిగర్ వేసి కాసేపు చిన్నమంటపై ఉంచి, దింపుకొని వేడివేడిగా సర్వ్ చేయాలి.
నేరేడు సూప్
తయారు చేసే విధానం: తాజా నేరేడు పళ్ళను వేడి నీటిలో కొద్ది సేపు నానబెట్టాలి. గింజలను తొలగించి గుజ్జు చేసి జల్లెడ పట్టాలి. అప్పుడు నేరేడు పండు రసం వస్తుంది. దీనికి కొంచెం ఉప్పు కలపాలి. ఒక పొంగు వచ్చే వరకు ఉంచి, పొయ్యి మీద నుండి దించేయండి. తర్వాత నిమ్మరసం కలిపి తీసుకోండి. గొప్ప యాంటీ ఆక్సిడెంట్ గుణాలున్న పండు నేరేడు. డయాబెటిస్ ఉన్నవారికి నేరేడు సూప్ మంచిది.
పాలక్ సూప్
కావల్సిన పదార్థాలు: పాలకూర- కొంచెం, వెల్లుల్లి రెబ్బలు- ఐదు, వెన్న లేదా నూనె- ఒక టీస్పూను, ఫ్యాట్ తక్కువగా ఉన్న పాలు- అరకప్పు, కార్న్‌ఫ్లోర్- ఒక టీస్పూను, మిరియాలపొడి, ఉప్పు- సరిపడా.
తయారు చేసే విధానం: కాడలు తీసేసి పాలకూర ఆకుల్ని శుభ్రంగా కడగాలి. కుక్కర్లో కాస్తంత వెన్న వేడిచేసి అందులో వెల్లుల్లి రెబ్బల్ని వేగించాలి. తరువాత కడిగిన పాలకూరని వేయాలి. అందులో పాలు, అరకప్పు నీళ్లు పోసి కుక్కర్లో ఉడికించాలి. ఉడికిన మిశ్రమం చల్లారాక దాన్ని గ్రైండ్ చేయాలి. కార్న్‌ఫ్లోర్‌ను నీళ్లల్లో వేసి చిక్కగా చేసి అందులో కలపాలి. ఒకవేళ సూప్ చిక్కగా అయితే కార్న్‌ఫ్లోర్ కలపాల్సిన అవసరం లేదు. ఉప్పు, మిరియాలపొడిని కలిపి తాజా క్రీము సూప్ పైన వేసుకుని వేడి వేడిగా తాగితే టేస్టీగా ఉంటుంది. ఈ సూప్ తాగితే శరీరం ఎనర్జిటిక్‌గా ఉంటుంది. (పాలకూర ఇష్టంలేని వాళ్లు గుమ్మడికాయ, బ్రొకోలి, క్యారెట్ లేదా ఇష్టమైన ఏ కూరగాయలైనా వాడొచ్చు.)
వెజిటబుల్ సూప్
కావల్సిన పదార్థాలు: అల్లం - చిన్నముక్క, వెల్లుల్లి - నాలుగు రెబ్బలు, పచ్చిమిర్చి - ఒకటి, కొత్తిమీర - కొద్దిగా, బీన్స్ - నాలుగైదు, క్యారెట్లు - రెండు, క్యాప్సికం - ఒకటి, పుట్టగొడుగులు - మూడు, ఉల్లికాడలు - రెండు, మిరియాలు - ఒక టీస్పూన్, సోయా సాస్ - ఒక టేబుల్‌స్పూన్, మొక్కజొన్న పిండి - నాలుగు టేబుల్‌స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - సరిపడా.
తయారు చేసే విధానం: కూరగాయలను శుభ్రంగా నీటితో కడగాలి. పాన్‌లో నూనె వేసి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి వేగించాలి. తర్వాత కట్ చేసిన బీన్స్, క్యారెట్ ముక్కలు, క్యాప్సికం, మిరియాలు, కొత్తిమీర వేసి మరి కాసేపు వేగనివ్వాలి. ఈ మిశ్రమంలో తగినంత ఉప్పు వేసి కలియబెట్టాలి. సోయాసాస్ వేసి కొన్ని నీళ్లు పోసి మరికాసేపు మరగనివ్వాలి. నీళ్లు మరుగుతున్న సమయంలో మొక్కజొన్న పిండి వేసి కలపాలి. సన్నగా తరిగిన ఉల్లి కాడలతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ వర్షాకాలంలో ఈ వెజిటబ్లో మన్చావ్ సూప్ శక్తినిస్తుంది.