Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బిడ్డలకు తల్లిదండ్రులులేకుండా అనాధలను చేసిన కరోనా మహమ్మారి మూడో విజృంభణలో తల్లులకు గర్భశోకం కలిగిస్తుందని ప్రచారం చేస్తున్నారు. తల్లులందరూ కంకణం కట్టుకొని కరోనా మళ్ళీ రాకుండా తరిమేయాలి. తన బిడ్డల జోలికొస్తే ఏ తల్లీ ఊరికే చస్తూ ఉండదని నిరూపించాలి. అందుకు గాను ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఉండాలి. వ్యాక్సిన్‌ను నిర్లక్ష్యం చేయకుండా వేయించుకోవాలి. వ్యాక్సిన్ వేయించుకున్నాం కదా అని బయట ఎక్కువగా తిరగొద్దు. లాక్డౌన్ ఎత్తేసిన రెండు రోజుల్లోనే జనమంతా బజార్లలో కొచ్చారు. అలా కాకుండా ఎవరి ఇంట్లో వాళ్ళుండి కరోనాను సవాల్ చేయండి. ''నువ్వెలా కొత్త రూపాలు మార్చుకుని వస్తావో చూస్తాం రమ్మని'' మనం కాలు బయట పెట్టకపోపతే కరోనా ఏం చేయలేదు. అదే మన ఆయుధం. మాస్క్‌లు వేసుకునే ఉండండి. మనం పేపర్లలో చూస్తున్నాం. ఆంక్షలు లేవు అనగానే పర్యాటక కేంద్రాలు రద్దీగా మారిపోయాయి. మార్కెట్లు ప్రయాణ స్టేషన్ల దగ్గర కిక్కిరిసిన జనం కనిపిస్తున్నారు. అలాంటి చోట భద్రత ఎలా ఉంటుంది. నిబంధనలను నీటి మీద రాతలుగా మార్చకుండా తు.చ తప్పక పాటించాలి. ఖాళీ సమయాన్ని విజ్ఞానం పెంచుకోవడానికి ఉపయోగించండి.
తోటకూర ఆకులతో...
మా గార్డెన్లో ఆకు కూరలు వేసి పెంచుకుంటున్నాం. తాజా ఆకుకూరల్ని పండించి తినాలన్నది మా కోరిక. అందుకే తోటకూర, పాలకూర, మెంతికూర, కొత్తిమీర వంటి ఆకుకూరల్ని పెంచుకుంటున్నాము. ఒక్కోసారి కోసుకోవటం ఆలస్యమైతే అవి ముదిరిపోతుంటాయి. బాగా రక్తం పడుతుందని డాక్టర్లు ఆకుకూరలు తినమంటారు. తోటకూర చెట్టు మా కుండీలో ఆరడుగులు పెరిగిపోయింది. నేనెవరికీ తక్కువ కాదన్నట్టుగా నేలలో వేసినవైతే పది అడుగుల ఎత్తుదాకా పెరిగాయి. ఈ చెట్టు 'అమరాంథేసి' కుటుంబానికి చెందినవి. దీని శాస్త్రీయనామం ''అమరాంథస్ గాంజెటికస్'' అంటారు. ఇది ఆకుకూరలలో ప్రధానమైన ఆకుకూర. వంద గ్రాముల ఆకుకూరను తీసుకుంటే ప్రోటీనుల 18 గ్రాములు ఉంటాయి. ఇందులో కొవ్వు ఉండదు. బాగా ఆకలిని కలిగిస్తుంది. జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. తోటకూర పులుసు, తోటకూర పప్పు, తోటకూకర వేపుడు వంటి రకరకాలుగా వండుకోవచ్చు. వీటిలో మొక్క తోటకూర, పెద్ద తోటకూర అని రెండు రకాలుంటాయి. తోటకూర ఆకుల్ని కోసుకొచ్చి నేను నెమలిని చేశాను. తర్వాత పూలు వేసే పుష్పగుచ్చాలు బాగా పెరిగాయి. వాటిని కోసి నెమలి ఫించానికి అమర్చాను. నూరు వరహాల పూల మొగ్గల్ని నెమలి ముక్కుగా అమర్చాను. కుండీల్లో ఎండిపోయిన పువ్వుల్ని సైతం నెమలి ఫించానికి వాడాను. బాగుంది కదూ!
ఇంజక్షన్ సీసాలపై ఉండే రేకు బిళ్ళలతో...
నెమలి శరీరాన్ని ఫించాన్ని ఒక నల్లని కార్డు బోర్డుపై ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ గీతల వెంట తళుకుల్ని అతికించుకుంటూ పోవచ్చు. ఇంజక్షన్ సీసాల మూతగా అల్యూమినియం రేకు సీల్ చేసి ఉంటుంది. ఈ సీల్ మొత్తం తియ్యటం కష్టం కాబట్టి సూది గుచ్చటానికి వీలుగా గుండ్రంగా ఒక కటింగ్ ఉంటుంది. ఈ రేకు బిళ్ళను తీసేసి సిరంజి గుచ్చి మందును తీస్తారు. అలా తీసేసిన రేకు బిళ్ళల్ని నేను దాచి ఉంచాను. ఎక్కువగా తెల్లటి రేకులే ఉంటాయి. కాబట్టి శరీరం, ఫించం అవుట్లైను తెల్లని బిళ్ళలతోనే తయారు చేశాను. ఒక్క సీసా మూత తీస్తే ఆరు ఇంజక్షన్లు వస్తాయి. ఒక బొమ్మ తయారావాలంటే ఎన్ని ఇంజక్షన్ సీసాల రేకు బిళ్ళలు సేకరించాలో చూడండి. శరీరంలో బంగారు రంగు వస్త్రాన్ని ముక్కలు చేసి నింపాను. ఫించం కాబట్టి నేరేడు రంగు బిళ్ళల్ని వాడాను. పిల్లలకు వేసే పోలియో సూదిలో మాత్రమే ఇవి ఉంటాయి. కాళ్ళకు బిస్కెట్ పేకెట్ ర్యాపర్‌ను కత్తిరించి వాడాను. ఇలా నెమలి తయారైంది. నెమలి మన జాతీయ పక్షి అని తెలుసు కదా. అంతేకాదు పక్షి జాతి కంతటికీ రారాజు కూడా! మనం చూసే అందమైన ఈకలు కేవలం మగ నెమలికి మాత్రమే ఉంటాయి. నెమళ్ళు ఫాసియానిడే కుటుంబానికి చెందిన పక్షులు. వీటి మాంసం కోసం వేటాడుతున్నందున నిషేధం విధించారు. కాలుష్యం వలన అన్ని పక్షుల్లాగే ప్రమాదస్థితిలో ఉన్నాయి.
ఇంజక్షన్ల ప్యాకింగులతో...
ఇంజక్షన్ సీసాలు శుభ్రంగా సీల్ చేసి ఉంటాయని చెప్పుకున్నాం కదా! ఈ సీసాలు ఆరు కలిసి ఒక ప్లాస్టిక్ ప్యాకింగులో ఉంటాయి. సుమారుగా ఆరు ఇంజక్షన్లు ఒక అట్టలో కలిపి ఉంటాయి. నేను ఇలాంటి ప్లాస్టిక్ అట్టలతో నెమలిని చేశాను. ఈ ప్లాస్టిక్ అట్టలు శంకుపూల రంగులో ఉండటం వలన నెమలిని చేయాలనిపించింది. సాధారణంగా ఈ ప్లాస్టిక్ అట్టల్లో 'డెకడ్రాన్' అనే ఇంజన్లు ఉంటాయి. ఈ అట్టల్ని సేకరించి నెమలి ఆకారంగా తయారు చేశాను. ప్రతివారూ బాల్యంలో నెమలీకను పుస్తకంలో పెట్టుకొని దానికి మేత వేస్తే పిల్లల్ని పెడుతుందని నమ్మేవాళ్ళు. నెమలీకకూ బాల్యానికీ అవినాభావ సంబంధముంది. అలాగే నెమలి ఫించం అనగానే గుర్తుకొచ్చేది చిన్ని కృష్ణుడే. చిన్ని కృష్ణుని చేతిలో వెన్నముద్ద తలలో నెమలి ఫించం ఉంటుంది. వర్షం కురిసిన ఆహ్లాద సమయంలో నెమళ్ళు పురి విప్పి నృత్యం చేస్తాయి. నీలం ఆకుపచ్చ రంగుల్లో మెరిసే ఫించానికి కన్నులు ఉంటాయి.
తినే పదార్థాలతో...
ఈ నెమలి బొమ్మకు వాడిన తిండి పదార్థాల పేరు తెలుసా. వీటిని 'గులాబీ'లు అంటారు. గోధుమ పిండి, బెల్లం కలిపిన పిండిలో పువ్వులాంటి చక్రం పెట్టి నూనెలో వేస్తే ఇలా పువ్వులా విచ్చుకొని కరకరలాడతాయి. గులాబీ అచ్చులు అని పిండిలో పెట్టే ఇనుప చక్రాలు మా ఇంట్లోనూ ఉన్నాయి. అయినా నేనివి ఇంట్లో వండలేదు. స్వగృహా ఫుడ్స్‌లో కొన్నాను. ఈ గులాబీలను, కారప్పూసను ఉపయోగించి నెమలిని తయారు చేశాను. ఎవరైనా వచ్చినపుడు వారికి పెట్టేవి ఇలా తయారు చేసి పెడితే బాగుంటుంది. పిల్లలకు ఇలా అమర్చి ఇస్తే తినను అన్న పదార్థాలు కూడా తింటారు. ఆడ నెమళ్ళకు కూడా రెక్కలు ఫించం ఉంటుంది. కానీ పొడుగాంటి రెక్కలు ఉండవు. చిన్నగా ఉంటుంది. ఈ నెమలి ఈకల మీద సన్నగా పేర్చినట్టుండే నూగు లాంటి సీలియాలోనే నెమలికి రంగులు ఏర్పడటానికి కావలసిన వర్ణక ద్రవ్యాలుంటాయి.
ఆకుల పూలతో...
నేను మా అబ్బాయితో వాళ్ళ కాలేజీకి వెళ్ళినపుడు పెద్దపెద్ద వృక్షాల నిండా పువ్వులు కనిపించాయి. రేల పూలు, తుమ్మ కాయలు వంటి వాటితో పాటుగా పేరు తెలియని ఎన్నో చెట్ల పువ్వులు, ఆకులు తెంపు కొచ్చాను. వాటన్నింటితో నెమలిని తయారు చేశాను. నెమలి అంటేనే రంగులకు నెలవు. అదీ రంగుల పూలతో చేస్తే ఎంత అందంగా ఉంటుంది. చూడటానికి రెండు కళ్ళూ చాలవు. అలా పూల నెమలి తయారైంది. నెమళ్ళను మానవులు దాదాపుగా 2000 సంవత్సరాల నుంచీ మచ్చిక చేసుకోవడానికి చూస్తున్నారు. అయినా కూడా దీనికి పెంపుడు జంతువుల్లా సాత్విక గుణాలు అబ్బలేదు. ఈ నెమళ్ళు మిగతా పక్షులతోనూ పెద్దగా కలవవు. మానవులకూ మచ్చిక కావు. అందుకే వీటిది ఇగడాలమారి మనస్తత్వం అంటారు. కొన్ని నెమళ్ళు తెల్లగా ఉంటాయి. దీనికి కారణం వాటిలో జన్యులోపం వలన అవి అలా పుడతాయి.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్