Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కన్నవారిని సైతం కాదనుకొని అతనితో వచ్చేసింది. అతనే తన సర్వస్వంగా భావించింది. పెండ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. కానీ అతని నుండి కోరుకున్న ప్రేమ ఆమెకు దొరకలేదు. వ్యాపారంలో బిజీగా ఉన్నాడని కొంతకాలం భరించింది. ఏండ్లు గడుస్తున్నా అతనిలో మార్పు రాలేదు. యంత్రంలా బతకడం ఆమెకు కష్టంగా మారింది. చివరకు ఐద్వా లీగల్‌సెల్ సాయం కోసం వచ్చింది.
శ్వేతకు ముఫ్పై ఐదేండ్లు. తన చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. తండ్రి లెక్చరర్‌గా చేసి రిటైర్ అయ్యారు. ఓ అక్క, అన్నయ్య ఉన్నారు. బిఎడ్ చేసేటపుడు కుమార్‌తో పరిచయమయింది. పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ పెండ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ శ్వేత ఇంట్లో పెండ్లికి ఒప్పుకోలేదు. కుమార్ మాత్రం తన ఇంట్లో వాళ్ళను ఒప్పించాడు. చివరకు పెండ్లి చేసుకున్నారు. కన్నవాళ్ళకు దూరమైనా ఎంతగానో ప్రేమించిన భర్త దొరికినందుకు శ్వేత చాలా సంతోషించింది.
కుమార్ పెద్దగా చదువుకోలేదు. ఓ కంపెనీలో పని చేసేవాడు. పెండ్లయిన ఏడాదికి వీరికి బాబు పుట్టాడు. శ్వేత డీఎస్సీ రాస్తే ఉద్యోగం వచ్చింది. అప్పటి వరకు వారి కాపురం సిటీలోనే ఉండేది. అయితే శ్వేతకు పోస్ట్ సిటీకి దూరంగా వచ్చింది. బాబు చిన్నవాడు. వాడిని వదిలి రోజూ వెళ్ళి రావడమంటే కష్టం. అందుకే స్కూల్‌కు దగ్గర్లో ఇళ్ళు తీసుకుందామని భర్తను అడిగింది. కానీ సిటీని వదిలి కుమార్ రానన్నాడు. సిటీ వదిలి గ్రామానికి వెళితే తనకు అక్కడ పని దొరకదన్నాడు. ఎప్పుడూ బిజీగా ఉండేవాడు. కనీసం శ్వేతతో సరిగా మాట్లాడే వాడు కాదు.
కొత్తగా బిజినెస్ ప్రారంభించాలని అనుకుంటున్నాడు. ఇలాంటి సమసయంలో అతను సిటీ వదిలితే సమస్య అవుతుందని శ్వేత ఒక్కతే స్కూల్‌కి దగ్గర్లో చిన్న గది అద్దెకు తీసుకుంది. అయితే కుమార్ కనీసం వారానికి ఓ సారి కూడా భార్యా, బిడ్డను చూడటానికి వెళ్ళేవాడు కాదు. శ్వేత అడిగితే బిజీగా ఉన్నానని చెప్పేవాడు. భర్త మాటలను ఆమె కూడా నమ్మింది. తనే స్కూల్ సెలవులు ఇచ్చిన ప్రతి సారీ వస్తూ పోతూ ఉండేది. ఇంటి పనులు, బాబును చూసుకోవడం, స్కూలుకు వెళ్ళడం ఆమెకు కష్టమయింది. అయినా తప్పదు. ఒంటరి తనాన్ని భరించలేక ఏడ్చి ఏడ్చి కండ్లు వాచి పోయేవి. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపేది. భర్త మాత్రం ఆమె గురించి అస్సలు ఆలోచించేవాడు కాదు. అలాగే నాలుగేండ్లు గడిపింది.
బాబు కాస్త పెరిగాక స్కూల్లో వెయ్యాలని ట్రాన్స్ఫర్ చేయించుకుని శ్వేత కూడా సిటీకి వచ్చేసింది. బాబును స్కూల్లో చేర్పించారు. ఇప్పుడు సిటీ నుండే స్కూల్‌కి వెళుతుంది. ఉదయం మూడు గంటలకు లేచి పనులన్నీ చేసుకొని స్కూల్‌కి బయలుదేరుతుంది. సాయంత్రం ఎప్పుడో వస్తుంది. శ్వేత ఇంత కష్టపడుతున్నా కుమార్ మాత్రం ఆమెను అస్సలు పట్టించుకోడు. ఎప్పుడైనా శ్వేత నిలదీస్తే గొడవ పెట్టుకుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే శ్వేత లీగల్‌సెల్‌కు వచ్చి 'ఆయన నుండి నాకు ప్రేమ కావాలి. తెలిసిన వాళ్ళు మీ దగ్గరికి వెళ్ళమంటే వచ్చారు. మీరే ఆయనతో మాట్లాడి నాతో ప్రేమగా ఉండేలా చేయండి' అంటూ బాధపడింది.
శ్వేత పరిస్థితి తెలుసుకున్న లీగల్‌సెల్ సభ్యులు కుమార్‌కు లెటర్ పంపారు. తర్వాతి వారం అతను వచ్చి 'మేడమ్ శ్వేత ప్రతి విషయానికి ఏడుస్తుంది. అందుకే నాకు చిరాకు. ఇంటికి రావాలంటేనే భయం' అన్నాడు.
దానికి సభ్యులు 'శ్వేత మీ నుంచి ప్రేమా, ఆప్యాయతను కోరుకుంటుంది. తను పని చేసే స్కూలు చాలా దూరంగా ఉంది. ఆమె ఇంటి పనులు చేసుకొని అంత దూరం వెళ్ళి రావడమంటే మామూలు విషయం కాదు. మీరేమో మీ పనుల్లో బిజీగా ఉంటారు. ఆమె జాబ్ వచ్చిన దగ్గర నుండి ఒంటరిగానే ఉంటుంది. ఒంటరి తనాన్ని భరించలేకపోతుంది. ఆమెకు అవసరమైనప్పుడు మీ నుండి ప్రేమ దొరకలేదు. దాని వల్లే ఏడుస్తుంది. మీరిద్దరూ ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అప్పుడే ప్రేమ పెండిండ్లకు సమాజంలో గౌరవం. మిమ్మల్ని నమ్ముకుని కన్నవారిని కాదనుకుని వచ్చింది. తన ప్రపంచం మీరే అనుకుంది. కానీ మీరు ఆమెను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆమెతో ఎప్పుడైనా ఆప్యాయంగా మాట్లాడారా? నాలుగేండ్ల ఒంటరిగా బాబుతో అక్కడ ఉంటే.. ఒక్కసారైనా ఎలా ఉన్నావు? అని అడగలేదు. అందుకే ఆమె బాధపడుతుంది. మీరు శ్వేతను ప్రేమగా పలకరిస్తే చాలు బాధలన్నీ మర్చిపోతుంది. ఇకమీదటైనా ఆమెను అర్థం చేసుకోండి. ఇద్దరూ బాబును తీసుకొని అప్పుడప్పుడు బయటకు వెళ్ళిరండి. అప్పుడే మీ మధ్య ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి' అని చెప్పారు.
సభ్యులు చెప్పిన దానికి అతను సరే అన్నాడు. ఇక మీదట శ్వేతతో ప్రేమగా ఉంటానని చెప్పాడు. దాంతో శ్వేత కూడా సంతోషించింది. ఇదే ఆనందంతో ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోయారు.
మళ్ళీ రెండు నెలల తర్వాత ఎంతో బాధతో శ్వేత లీగల్‌సెల్‌కు వచ్చింది. విషయం ఏమిటని సభ్యులు అడిగారు. శ్వేత ఏడుస్తూ 'మేడమ్ ఇక నేను కుమార్‌తో కలిసి బతకలేను. అతను నమ్మించి మోసం చేశాడు. ప్రేమ పేరుతో నాటకమాడాడు. చెల్లెలు అని చెప్పుకుంటూనే ఆయనతో పనిచేసే అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు. ఈమె గురించి గతంలో నాకు ఎంతో మంది చెప్పారు. కాని అతనిపై ఉన్న నమ్మకంతో ఎవరి మాటలు నమ్మలేదు. కానీ నిన్న నేనే స్వయంగా వాళ్ళిద్దరినీ చూడకూడని స్థితిలో చూశాను. నేను నిలదీస్తే ఆయన ఒప్పుకోడం లేదు. ఇక నా మనసు విరిగిపోయింది. నేను మాత్రం అతనితో ఉండలేను. ఇలాంటి అలవాట్లు ఉండబట్టే నాతో ప్రేమగా ఉండటం లేదు. అందుకే దయచేసి నేను అతనితో విడిపోడానికి సాయం చేయండి' అంటూ ఏడ్చేసింది.
శ్వేత బాధను గమనించిన సభ్యులు ఆమెను ఓదార్చి.. 'చూడు శ్వేత ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. కాస్త నిదానంగా ఆలోచించు. ఓ వారం సమయం తీసుకో. వచ్చే వారం మీ నాన్నను కూడా తీసుకురా ఏం చేయాలనేది నిర్ణయించుకుందాం' అని చెప్పి పంపారు.
వచ్చే వారం శ్వేత తన తండ్రిని వెంటబెట్టుకొని వచ్చి 'కుమార్ మారడానికి సిద్దంగా లేడు. తను కూడా విడాకులు ఇస్తానంటున్నాడు. అతనిలో తప్పుచేశాననే భావన కూడా లేనప్పుడు ఇక అతనితో బతకాల్సిన అవసరం నాకు లేదు. అతనికి ఆమెతోనే కాదు ఇంకా ఇద్దరు ముగ్గురితో సంబంధం ఉందని తెలిసింది. ఎలాంటి రోగాలు తెచ్చుకున్నాడో. అందుకే నా బతుకు నేను బతుకుతాను. బాబును పెంచుకుంటాను. బాబు అతని దగ్గరే ఉంటే పాడైపోతాడు. అందుకే కోర్టులో బాబును నా దగ్గరే ఉంచుకుంటానని లెటర్ పెట్టుకుంటా. మీకు తెలిసిన లాయర్ ఎవరైనా ఉంటే చెప్పండి' అంటూ శ్వేత తన నిర్ణయాన్ని సభ్యులకు చెప్పింది.
శ్వేతను బయటకు పంపి సభ్యులు ఆమె తండ్రితో మాట్లాడితే 'విడాకుల విషయంలో శ్వేతను కాస్త నిదానంగా ఆలోచించమని నేను కూడా చెప్పాను. కాని తను నా మాట కూడా వినడం లేదు. కానీ భర్త వల్ల తను చాలా బాధపడింది. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపింది. మంచి భవిష్యత్ ఉన్న పిల్ల. చదువులో ఎప్పుడూ ముందుండేది. ఇలాంటి వ్యక్తిని పెండ్లి చేసుకొని తన జీవితం పాడుచేసుకుంది' అంటూ బాధపడ్డారు.
అతని మాటలకు సభ్యులు 'కుమార్‌తో ఓసారి మేం కూడా మాట్లాడి చూస్తాం. అతనిలో ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉంటే శ్వేతకు నచ్చజెబుదాం' అని సభ్యులు కుమార్‌కు ఫోన్ చేశారు.
కుమార్ కూడా శ్వేతతో విడిపోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. అతని మాటల్లో తప్పు చేశాననే భావనగానీ, శ్వేతతో కలిసి ఉండాలనే ఆలోచనగానీ ఉన్నట్టు సభ్యులకు అనిపించలేదు. దాంతో శ్వేతను లోపలికి పిలిచి 'చూడు శ్వేత నీకు నచ్చిన నిర్ణయం తీసుకునే హక్కు నీకు ఉంది. కుమార్ కూడా నీతో కలిసి బతకడానికి ఇష్టపడడం లేదని నువ్వే చెప్పావు. నువ్వు తెలివైన అమ్మాయివి. ఉద్యోగం ఉంది. కాబట్టి ధైర్యంగా బతకగలవు. బాబును బాగా చదివించు. నీకు ఏ సాయం కావాలన్నా మీ నాన్న చేస్తారు. మా దగ్గకు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉండు. అయితే అతన్ని అలా ఊరికే వదలకూడదు. నిన్ను మోసం చేసినట్టే మరో మహిళను చేస్తాడు. కాబట్టి అతన్ని కోర్టుకు లాగాలి. తగిన నష్టపరిహారం తీసుకోవాలి' అని ధైర్యం చెప్పి పంపారు.
- సలీమ