Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇప్పుడు అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలూ ఉద్యోగాలు చేస్తున్నారు. దాంతో ఎవరికి వారికి స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఒకింత ఎక్కువే ఉంటున్నాయి. పెండ్లయ్యాక అది అహంగా మారకుండా సర్దుబాటు చేసుకోవాలి. ఒకరినొకరు అర్థం చేసుకుని సాగిపోవాలి. అందుకు ఈ సూత్రాలు ఉపయోగపడతాయి.
పెండ్లికి ముందే ఒకరికొకరు అవతలి వారి పని విధానం, సమయం వంటివి తెలుసుకుని ఉంటే మేలు. లేదా పెండ్లయినా కొత్తలోనే ఆ పని చేయండి. దీనివల్ల ఇద్ద్దరి మధ్యా అవగాహన, సమన్వయం పెరిగి కలిసి పోగలుగుతారు.
పెండ్లయ్యాక మీకు కొన్ని బాధ్యతలూ వస్తాయి. ఒకోసారి మీరెంత ఆలస్యంగా పడుకున్నా... పొద్దెక్కినా లేవదు అని భాగస్వామే అంటే చిరాకొస్తుంది. అర్థం చేసుకోవడం లేదనే బాధ మెలిపెడుతుంది. ఇది క్రమంగా గొడవలకు కారణం కావొచ్చు. అందుకే ఇద్దరి పని వేళల్నీ గమనించుకుంటూ... వాటికి అనుగుణంగా కనీసం ఎనిమిది గంటల నిద్ర ఉండేలా ప్రణాళిక వేసుకోండి. అప్పుడు అవతలివారూ అర్థం చేసుకోగలరు.
మీరెంత పెద్ద ఉద్యోగైనా... ఇంటికీ, ఆఫీసుకీ మధ్య కచ్చితంగా గీత ఉండాలి. అలాకాకుండా ల్యాప్టాప్, ఫోన్లతో కాలం గడిపేస్తుంటే అవతలివారు అభద్రతకు గురవుతారు. అన్నిసార్లూ ఆ పరిధులు నిర్ణయించుకోవడం కుదరకపోవచ్చు. దీంతో సెలవు రోజుల్లోనూ, అదనపు గంటలూ పని చేయాల్సి రావొచ్చు. ఆ పరిస్థితుల్ని అర్థం చేసుకోవడంలో మీరు విఫలమవ్వొద్దు. ఈ తీరు ఎదుటివారిలో ఒత్తిడి తగ్గిస్తుంది. మీ మధ్య అనుబంధాన్ని పెంచుతుంది.
గౌరవించుకోండి.... వ్యక్తిగతంగా ఎవరికివారు వేర్వేరు చోట్ల పెరుగుతుంటారు. ఆయా పరిస్థితులకు అనుగణంగా వారి ఆహారపు అలవాట్లు, అభిరుచులు ఉండొచ్చు. దీన్ని మీరు గౌరవించి తీరాలి. అవతలివారికి స్వేచ్ఛ ఇవ్వడమూ మంచిది.