Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుతం ఇంటి నుంచి పనిచేసే క్రమంలో చాలామంది అమ్మల పరిస్థితి ఇబ్బందిగా ఉంది. కరోనా థర్డ్‌వేవ్ భయంతో పాఠశాలలు తెరవలేదు. దాంతో పిల్లల ఆలనా పాలన చూస్తూనే.. వేళకు వారికి అన్నీ సమకూర్చడం.. మరోవైపు ఆఫీస్ పని చేయడమంటే వారికి కత్తి మీద సాములా మారింది. అయితే ఈ పరిస్థితిని అధిగమించాలంటే సమయపాలనతో పాటు మరికొన్ని చిట్కాలు పాటించాలని చెబుతున్నారు నిపుణులు. అలాంటప్పుడే పిల్లలున్న తల్లులు వర్క్ ఫ్రమ్ హౌమ్ని ఎంజారు చేయగలరని.. చక్కటి పనితీరును కనబరచగలరని అంటున్నారు. మరి, ఆ చిట్కాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..
మన జీవితంలో ప్రతి విషయం సమయపాలనతోనే ముడిపడి ఉంటుంది. ఏ పని చేయాలన్నా అందుకు ఓ సమయమంటూ కేటాయించుకొని.. చక్కటి ప్రణాళికతో ముందుకు సాగితే తప్పకుండా విజయం సాధిస్తాం. ఈ నియమం ఇంటి నుంచి పనిచేసే అమ్మలకూ వర్తిస్తుందంటున్నారు నిపుణులు.
సమయం నిర్దేశించుకోవాలి
ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా మహిళలకు క్షణం తీరిక దొరకదు. ఎప్పుడూ ఏదో ఓ పని ఉండనే ఉంటుంది. మధ్యమధ్యలో పిల్లల్ని చూసుకోవాల్సి వస్తుంది. అయితే ఇలా ఏ పని చేయడానికైనా ఓ కచ్చితమైన సమయం నిర్దేశించుకోగలిగితే.. ఆ టైమ్‌లోనే దాన్ని పూర్తి చేయచ్చు. ఇంటి పనులు, వంట పని, పిల్లలకు స్నానం చేయించడం, ఫ్రెషప్ అవడం.. వీటన్నింటికీ ఓ టైమ్ అంటూ పెట్టుకొని.. ఉదయం తొమ్మిది కల్లా అన్నీ పూర్తి చేసుకోగలిగితే.. ఆపై ప్రశాంతంగా ఆఫీస్ పని మొదలుపెట్టచ్చు. ఇక మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ సమయంలో ఎలాగూ కాసేపు బ్రేక్ తీసుకుంటారు కాబట్టి అదే సమయంలో పిల్లలూ మీతో పాటే తినేలా చేస్తే.. మధ్యమధ్యలో మీ పనికి ఎలాంటి అంతరాయం కలగకుండా జాగ్రత్తపడచ్చు. ఇలా ఓ క్రమ పద్ధతి ప్రకారం పనుల్ని, పిల్లల్ని చూసుకోవడాన్ని సమన్వయం చేసుకోగలిగితే ఆఫీస్ పని వేళకు పూర్తవుతుంది.. మీకంటూ కాస్త సమయం కూడా మిగులుతుంది. పైగా ఏ విషయంలోనూ టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు.
వారికి నచ్చినట్టు...
ఇంటి నుంచి పని చేసే అమ్మలకు పిల్లల వల్ల పనికి అంతరాయం కలగకుండా ఉండాలంటే వారి గదిని మరింత ప్రత్యేకంగా, కిడ్-ఫ్రెండ్లీగా తీర్చిదిద్దమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో వాళ్ల గదిలో వాళ్లకు నచ్చిన బొమ్మలు, ఆటవస్తువుల్ని ఏర్పాటుచేయచ్చు.. వారికి నచ్చిన కార్టూన్ బొమ్మలతో కూడిన వాల్స్టిక్కర్ని గదిలో ఓ గోడకు అతికించచ్చు. ఇలా ఆలోచిస్తే బోలెడన్ని ఐడియాలొస్తాయి. అయితే వారి కోసం కొనే ఆటవస్తువులు వారిని ఆలోచింపజేసే విధంగా, వారికి విజ్ఞానాన్ని పంచే విధంగా ఉంటే మరీ మంచిదంటున్నారు నిపుణులు. వాటితో ఆడుకుంటూనే బోలెడన్ని విషయాలు నేర్చుకోగలుగుతారు. కాబట్టి ఇలా వాళ్ల గది వాళ్లకు నచ్చినట్టుగా ఉంటే మధ్యమధ్యలో మీ పనికి ఎలాంటి అంతరాయం కలిగించరు. అయితే ఇలా చిన్నారులు వాళ్ల గదిలో గడిపినప్పటికీ వారిపై ఓ కన్నేసి ఉంచాలి. లేదంటే మొబైల్ ఫోన్లో ఆటలు, అంతర్జాలంలో ఏ వెబ్సైట్ పడితే అది చూడడం.. వీటివల్ల వారికి చేకూరే ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువ. కాబట్టి ఆన్లైన్ క్లాసుల సమయంలో తప్ప మిగతా సమయంలో ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు వారికి చేరువలో ఉంచకపోవడం మంచిది.
కచ్చితమైన సమయం
పిల్లలు ఎంతగా వాళ్ల గదికి పరిమితమైనా ఇంట్లో ఎంతో కొంత అల్లరి వాతావరణం ఉండడం మాత్రం ఖాయం. దీంతో మీరు మీ గదిలో పని చేసుకున్నప్పటికీ వారు చేసే అల్లరి మీకు కాస్త అంతరాయం కలిగించచ్చు. ఇలాంటి సమయంలో మీ ఆఫీస్ టీమ్‌తో కాన్ఫరెన్స్ కాల్స్, వర్చువల్ మీటింగ్స్, ఇతర విషయాల గురించి చర్చించడం వీలు కాకపోవచ్చు. కాబట్టి వాళ్లు మధ్యాహ్నం పూట పడుకున్నప్పుడు ఇలాంటి పనుల కోసం సమయం కేటాయిస్తే అనువుగా ఉంటుందంటున్నారు నిపుణులు. అయితే ఇందుకోసం ముందుగానే మీరు మీ పైఅధికారుల నుంచి అనుమతి తీసుకోవడం, మీ కొలీగ్స్‌తో ఓ మాట చెప్పడం.. వంటివి చేస్తే.. ఇటు మీకు, అటు వారికి సమయం వథా కాదు. పైగా ఇలా కచ్చితమైన సమయం పెట్టుకుంటే పని కూడా త్వరగా, ప్రశాంతంగా పూర్తి చేసుకోవచ్చు.
వర్చువల్‌గా ఆడుకునే ఏర్పాటు
సుమారు గత ఏడాదిన్నర కాలంగా పిల్లలు ఇంటికే పరిమితమవడంతో వాళ్ల ఫ్రెండ్స్‌ని ఇప్పటికే చాలా మిస్సవుతూ ఉంటారు. వారి మనసులో బయటికి వెళ్లి ఆడుకోవాలని ఉన్నా.. ఈ ప్రతికూల పరిస్థితుల్లో అది వీలు కాదు. మనమూ అందుకు అంగీకరించం. అయితే ఈ సమస్యను వర్చువల్‌గా పరిష్కరించడం మంచిదని చెబుతున్నారు నిపుణులు. కాబట్టి పిల్లలు వారి ఫ్రెండ్స్‌తో వర్చువల్‌గా ఆడుకునే ఏర్పాటు చేయడం మంచిది. ఇందుకోసం జూమ్, గూగుల్ హ్యాంగౌట్, వర్చువల్ టూర్స్, నెట్‌ఫ్లిక్స్ పార్టీ.. లాంటి యాప్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగిస్తూ పిల్లలు వారి ఫ్రెండ్స్‌తో కలిసి ఆన్లైన్లోనే వారికి నచ్చిన ఆటలాడుకోవచ్చు. తద్వారా స్నేహితుల్ని మిస్ అవుతున్నామన్న ఆలోచన వారికి రాదు. పైగా ఈ ఆటలతో అటు ఫన్, ఇటు విజ్ఞానం.. రెండూ అందుతాయి. అంతేకాదు ఇలా వాళ్లు తమ పనిలో బిజీగా ఉండడం వల్ల మిమ్మల్ని కూడా డిస్టర్బ్ చేయరు. ఇక మీ పని మీరు హాయిగా, ప్రశాంతంగా పూర్తి చేసుకోవచ్చు.
వారాంతరాల్లో ఇలా...
కొంతమంది పిల్లలు వారికి అన్ని సదుపాయాలు సమకూర్చి పెట్టినా మధ్యమధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తుంటారు. 'అమ్మా.. అది చేసిపెట్టు.. ఇది చేసిపెట్టు..' అంటూ ఏవేవో స్నాక్స్ కావాలంటారు. వాళ్లు అంత ముద్దుగా అడుగుతుంటే ఇక చేసి పెట్టక తప్పదు. దీంతో చేసే పనికి అంతరాయం కలగడం, సాయంత్రం వేళకు పని పూర్తికాకపోవడం.. ఇలా ఒత్తిడికి గురవుతుంటాం. మరి ఈ సమస్య లేకుండా ఉండాలంటే వారాంతాల్ని సద్వినియోగం చేసుకోవడం ఒక్కటే మార్గం అంటున్నారు నిపుణులు. ఎలాగూ వారమంతా వాయిదా వేస్తూ వచ్చిన పనులన్నీ ఆ రెండు రోజుల్లో పూర్తి చేసుకుంటాం. వాటితో పాటు కాస్త సమయం కేటాయించి మీ పిల్లలకు ఇష్టమైన స్నాక్స్ తయారుచేసి పెట్టగలిగితే వాళ్లే కావాల్సినప్పుడు వాటిని తీసుకొని తింటారు. దాంతో మిమ్మల్ని మధ్యలో డిస్టర్బ్ చేయకుండా ఉంటారు. అయితే ఎక్కువ స్నాక్స్ చేసి పెట్టే సమయం లేకపోతే వారానికో వంటకం చొప్పున, ఆ వారమంతా సరిపడా చేసి పెట్టినా సరిపోతుంది.
ముందే అనుమతి తీసుకోండి
కాస్త ఎదిగిన పిల్లలైతే ఈ విషయాలన్నీ అర్థం చేసుకొని, మీరు చేసిన మార్పులకు అనుగుణంగా నడుచుకుంటారు. అదే ఐదేండ్లలోపు వారిని చూసుకుంటూ పనిని కొనసాగించడం అంటే ఇంకా కష్టం. కాబట్టి వారిని చూసుకోవడానికి ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్లుంటే పర్లేదు. లేదంటే వాళ్లు ఆడుకుంటున్నప్పుడో, మధ్యమధ్యలో పడుకున్నప్పుడో ముఖ్యమైన ఆఫీసు పనులు పూర్తి చేసుకోవాలి. అయితే ఇలా మీ అవసరాల గురించి ముందే మీ పైఅధికారులతో ఓసారి మాట్లాడి అనుమతి తీసుకుంటే మరీ మంచిది.